నిప్పులు చిమ్మే ఉపన్యాసం, సంకుచితత్వానికి అతీతమైన సహజ గంభీరం, జీవితమంతా ఉద్వేగంతో మాట లకు మంటలు నేర్పిన వ్యక్తి జ్వాలాముఖి. ఆయన ప్రసంగిస్తుంటే ఊపిరి బిగబట్టాల్సిందే! ఆ మాటల జలపాతంలో దూకేయాల్సిందే!
దిగంబర కవిగా, విప్లవ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడైన ఆ అక్షరయోధుడు దశాబ్దం క్రితం శాశ్వత నిద్రలోకి జారేముందు ప్రజలకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో! మనుషులపైన అచంచల ప్రేమతో జీవించిచాడు.తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు.
మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాదులోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్.బీ. పూర్తిచేశాడు.
ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాదులోని ఎల్.ఎన్.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు.
మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో ‘మనిషి’ దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు.1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు.
ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు.1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. డిసెంబరు 14 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.
సమాజంలోని కుళ్లును చూసి, మర్యాదలన్నిటినీ పటాపంచలు చేసి, ఆవేశంతో విరుచుకు పడ్డారు. ఆయనలోని వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలతో ఢీకొన్నాయి. ‘ఓటమీ తిరుగుబాటు’ ద్వారా నక్సల్‌బరీని సాక్షాత్కరింపజేశారు. విప్లవకవిగా మారి, విరసం ఆవిర్భావ చోదకశక్తిగా పనిచేశారు. అధ్యాపకుడిగా పాఠాలు చెప్పినా, జీవిత పాఠాలు చెప్పడమే ప్రవృత్తిగా స్వీకరించారు. ఉపన్యాసం జ్వాలాముఖికి జీవలక్షణం. ఆయన పేరులోనే కాదు, ప్రసంగంలోనూ బద్దలవుతున్న అగ్నిపర్వతం కనిపిస్తుంది. ఆ సుదీర్ఘ ధిక్కారస్వరం ఆయన కవిత్వం లోనూ ప్రతిబింబిస్తుంది. సమూహంలో ఉపన్యసించినా, వ్యక్తులతో మాట్లాడినా ఆ వాక్ప్రవాహం తగ్గేదికాదు. కర్ఫ్యూ ఉన్నా ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఘర్షణ జరిగినా అక్కడ వాలేవారు. శాంతియాత్రలు చేశారు. శ్రీశ్రీతో కలిసి పౌరహక్కుల కోసం రాష్ట్రమంతా తిరిగినప్పుడు ‘సెడిషన్ చార్జ్’ పెట్టి జైలులో నిర్బంధించారు.
జ్వాలాముఖి ఒక వ్యక్తిగా కాకుండా ఎప్పుడూ తన వాగ్ధాటితో ఒక శక్తిగానే కనిపించేవారు. తన భావజాలంతో విభేదించేవారితో కూడా ఆత్మీయంగా వ్యవహరించేవారు. మనుషులపట్ల ఎల్లప్పుడూ ప్రేమ, ఆత్మీయత ఆయనలో కనిపించేవి. మనుషులతో ఎంతో హుందాగా ప్రవర్తించే ఆయన సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేశారు.
జ్వాలాముఖి రాసిన ‘వేలాడిన మందారం’ ఉరిశిక్షపై వచ్చిన తొలి నవల. అదొక దిగులు దొంతర. శరత్‌చంద్రుడి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ‘దేశదిమ్మరి ప్రవక్త’ పేరుతో అనువదించారు. ‘రాంఘేయ రాఘవ’ జీవిత చరిత్రను కూడా అనువదించారు.
‘హత్యలు, ఆత్మహత్యలు వర్గసమాజం దినచర్యలు’ అంటూ నిరసించారు. వర్గాలు లేని మానవ స్వర్గాలను స్వప్నించారు. ‘కోటి స్వరాలు పోరాడందే ఉన్నత సమాజం ఆవిష్కరించదు. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రభవించద’ని స్పష్టం చేశారు.
రెండు సార్లు చైనాలో పర్యటించారు. భారత్, చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉభయ దేశాల మైత్రికి ఎంతో శ్రమించారు. జ్వాలాముఖి రచనలలో ‘భస్మ సింహాసనం’ అత్యుత్తమ కావ్యం.
వీరు ” మనిషీ” కావ్యంతో సాహిత్య జీవితం ఆరంభించి, దిగంబరకవిగా, విప్లవ కవిగా, ప్రసిద్దికెక్కి, మహా వక్తగా పేరుగాంచిన వీరు సాంస్కృతిక రంగంలో ఐఖ్య సంఘటన అవసరమని నమ్మిన వ్యక్తి .. సామ్రాజ్య వాదాన్ని ప్రసంగాలలో ఎండగడుతూ, భూస్వామ్య సంస్కృతిని ఎదిరించిన ఒక శక్తి .
జ్వాలాముఖి రచనలు:
‘వేలాడిన మందారం’ నవల
హైదరా’బాధ’లు
‘ఓటమి తిరుగుబాటు’ కవితా సంకలనం
‘రాంగేయ రాఘవ’ జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం.
శరత్ జీవిత చరిత్రను ‘దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు’ పేరుతో హిందీ నుంచి అనువదించాడు.
అవార్డులు:
ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు,
దాశరథి రంగాచార్య పురస్కారం,
హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు.
రచయిత జ్వాలాముఖి నిత్య చైతన్యం, నిప్పులు చిమ్మే ఉపన్యాసం, సంకుచితత్వానికి అతీతమైన సహజ గంభీరం, జీవితమంతా ఉద్వేగంతో సాగింది. దిగంబర కవిగా, విప్లవ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు. మనుషులపైన అచంచల ప్రేమతో జ్వాలాముఖి జీవించారని చెప్పాలి.
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.