Suryaa.co.in

Telangana

ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు: మధు యాష్కీ గౌడ్

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్టూడెంట్ మాదిగ పెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని తీసుకుని.. అధికారంలోకి వచ్చాక ఆయనను జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్‌దని మధు యాష్కీ మండిపడ్డారు.
ఎస్సీల్లో మాదిగలు వెనుకబడ్డారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ప్రత్యేక రాష్ట్రంలో అయినా వారికి న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.అయితే కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితుల్లో మాదిగలు కిందిస్థాయిలో ఉన్నారు.. వారిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని మధు యాష్కీ పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ కూడా మాదిగలను మోసం చేసింది.2014 ఎన్నికల సమయంలో బీజేపీ వారి మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చాక వారిని మోదీ మోసం చేశాడు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. దేశ సంపదలో దళితులు కూడా భాగమే. అట్టుడుగు వర్గాలకు అందాల్సిన సంపదను కూడా మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున అమ్మేశాడు. దీనితో పాటు విద్యాసంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లను మోదీ దూరం చేస్తున్నాడు. తద్వారా దళితులకు విద్య అందకుండా చేస్తున్నాడని మధు యాష్కీ ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఫెలోషిప్స్, స్కాలర్ షిప్స్ అందించాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE