Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు తలంటినా జగన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్దిరాదా?

-తక్కువ ధరకు వచ్చే విద్యుత్ వదిలేసి అధిక ధరలకు కొనడమేంటి?
-ఎవరి ప్రయోజనాల కోసం ప్రజల సొమ్ము దోచిపెడుతున్నారు?
-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ధ్వజం

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో సుప్రీంకోర్టు తలంటినప్పటికీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్దిరావడం లేదు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం హిందూజాల నుంచి యూనిట్ 3.80 పైసలకు కొనుగోలు చేయకపోవడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని చెబుతూ మహానది పవర్ కంపెనీ నుంచి రూ.4.50పైసలకు కొనుగోలు చేయడమేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించడం చూస్తే ప్రభుత్వ అవినీతి బట్టబయలవుతోంది.

రూ. 3.80 పైసలకు లభించే విద్యుత్ ను వదిలి పీక్ అవర్స్ లో 19రూపాయలకు కూడా వైసిపి ప్రభుత్వం కొనుగోలు చేయడం కమీషన్ల కోసం కాదా? అధికారంలోకి వచ్చాక 32నెలల్లో ప్రజలపై 22వేల కోట్లరూపాయల భారం మోపిన జగన్ రెడ్డి సర్కారు అది చాలదన్నట్లుగా తాజాగా రాష్ట్రంలోని శ్రీకాకుళంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం రైతులను మరింత ఊబిలోకి నెట్టడం కాదా? పశ్చిమ గోదావరి జిల్లాలో గృహాలకు ప్రిపెయిడ్ మీటర్లు అమరుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వ్యవసాయ మీటర్లు, ప్రిపెయిడ్ మీటర్లు అవినీతిలో భాగమే. పొరుగున ఉన్న తెలంగాణా ప్రభుత్వం జలవిద్యుత్ ను పెంచుకొని చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుండగా, జగన్ రెడ్డి మాత్రం కమీషన్లకోసం తమ బినామీ కంపెనీల నుంచి అధిక ధరలు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.

పోలవరం పూర్తిచేసుకుంటే 960 మెగావాట్ల జలవిద్యుత్ ను అతి తక్కువ ధరకు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. సోలార్ విద్యుత్ కు ప్రస్తుత మార్కెట్ ధరకంటే అధిక రేటుతో సెకీతో ఒప్పందం చేసుకుని లక్ష కోట్లరూపాయల అవినీతికి జగన్ రెడ్డి తెరలేపారు. విద్యుత్ ప్రజలపై మోయలేని భారం మోపేవిధంగా జగన్ రెడ్డి అధికధరలకు విద్యుత్ కొనుగోలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అవినీతిని తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.

LEAVE A RESPONSE