కాళేశ్వరం బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు
ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం
ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం
కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు
కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
కాళేశ్వరం బ్యారేజీ లోపాల పుట్ట అని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చింది. డిజైన్, ప్లానింగే లోపభూయిష్టమని కుండబద్దలు కొట్టింది. అసలు మొత్తం బ్యారేజీని పునాదులతో సహా మళ్లీ నిర్మించాలని స్పష్టం చేసింది. దీని వైఫల్యం ప్రభుత్వ-ప్రజల ఆస్ధిక వ్యవస్థకు తీరని నష్టమని వెల్లడించింది. ఆ మేరకు డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నివేదికలో తన అభిప్రాయాలు వెల్లడించింది. డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నివేదిక అంశాలివి.
మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది.
బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు.
ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం.
బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది.
కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది.
అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది.