ఎన్టీఆర్‌పై ‘కమ్మ’టి దాడి

9

– జూనియర్‌పై అన్న అభిమానుల జంగ్‌
– అన్న శతజయంతి వేదికలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ డుమ్మా
– జూనియర్‌ నిర్లక్ష్యంపై కమ్మ సామాజికవర్గం కన్నెర్ర
– రాంచరణ్‌, వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, హాజరు
– ఎన్టీఆర్‌ గైర్హాజర్‌పై అన్న అభిమానుల ఆగ్రహం
– అక్కినేని వారసుడు వచ్చినా నందమూరి వారసుడెక్కడ?
– బాలకృష్ణ-నాగార్జునకు మనస్పర్ధలు ఉన్నా హాజరైన అక్కినేని వారసులు
– మరి ఎన్టీఆర్‌ పేరు చెప్పుకునే జూనియర్‌ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం
– అన్నకు ఎలా వారసుడవుతారంటూ సోషల్‌మీడియాలో వార్‌
– జూనియర్‌కు ఆ హక్కు లేదంటూ చర్చ
– ఎన్టీఆర్‌ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయన వారసుడు కాలేరంటూ కామెంట్లు
– సొషల్‌మీడియా విమర్శల వానలో తడుస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌
– మూడురోజులు దాటుతున్నా ఇంకా అదే మూడ్‌లో అన్న అన్న అభిమానులు-కమ్మ వర్గం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు సినిమాల నుంచి పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇప్పుడు కమ్మ వర్గం కన్నెర్రకు గురవుతున్నారా? ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు డుమ్మా కొట్టిన జూనియర్‌ను, అన్న అభిమానులు ద్వేషిస్తున్నారా? ఆయనను అన్న నిజమైన వారసుడిగా చూడటం లేదా? కేవలం ఎన్టీఆర్‌ పేరును వారసత్వానికే అడ్డం పెట్టుకుంటున్నారని ఆగ్రహంతో రగిలిపోతున్నారా? తాత స్మరణకు తారాతోరణం తరలివచ్చినా, సొంత మనుమడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం, ముఖం చాటేయడాన్ని అన్న అభిమానులు-కమ్మవర్గం జీర్ణించుకోలేకపోతుందా? మూడురోజులయినా.. ఇంకా వారు ఆ మూడ్‌లోనే ఉన్నారా? యస్‌.. ఇప్పుడు సోషల్‌మీడియాలో విమర్శల వర్షం చూస్తే అది నిజమేననిపిస్తుంది.

నట సార్వభౌమ దివంగత నందమూరి తారకరామారావు శతజయంత్రి వేడుకలు ముగిసినప్పటికీ.. ఆ వేడి ఇంకా చల్లారడం లేదు. సోషల్‌మీడియా వేదికగా దానిపై ఇంకా వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కారణం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ కార్యక్రమానికి ముఖం చాటేయడమే! ఎన్టీఆర్‌-అక్కినేని సినీరంగంలో భిన్నధృవాలుగా ఉన్నప్పటికీ, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు, అక్కినేని వారసులు హాజరుకాగా..పత్రికా ప్రకటనల్లో సదా ఎన్టీఆర్‌ను స్మరించుకునే జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం, ముఖం చాటేయడం అన్న అభిమానులకు అస్సలు రుచించలేదు.

అందుకే హైదరాబాద్‌లో శత జయంతి వేడుకలు ముగిసినప్పటికీ, ఎన్టీఆర్‌ తీరుపై అన్న అభిమానుల ఆగ్రహం, ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. సోషల్‌మీడియా వేదికగా ప్రపంచలోని అన్న అభిమానులు-కమ్మ వర్గం జూనియర్‌ నిర్లక్ష్యంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. చివరాఖరకు ఆ చర్చ.. ‘అన్న గారు పేరు పెట్టుకున్నంత మాత్రాన జూనియర్‌ అన్న వారసుడయిపోరు’ అన్నంత వరకూ వెళ్లడం, ఎన్టీఆర్‌కు ఇబ్బందిగా మారింది.

దివంగత ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి బాలకృష్ణ వారసుడయినప్పటికీ, జనం మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌ను మాత్రమే, నిజమైన వారసుడిగా భావిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. అందుకు తగినట్లే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా.. ప్రతి ఏడాది జరిగే ఎన్టీఆర్‌ జయంత్రి-వర్థంతి రోజున, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారీ ప్రకటనలు ఇస్తుంటారు. ‘మళ్లీ ఎప్పుడు పుడతావు తాతా’ అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తుంటారు. ఈ కట్టె కాలేంత వరకూ తాత పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ చెబుతుంటారు. కానీ, కొన్నేళ్ల నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌, మానసికంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు.

గతంలో ఎన్నికల ప్రచారంతోపాటు, మహానాడులో పాల్గొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో భూతద్దం వేసి వెతికినా, ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయనకు పిల్లనిచ్చిన మామ, వైసీపీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్‌ అనుచరుడిగా పేరొందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-ఆయన తనయుడు లోకేష్‌ను బండబూతులు తిడుతుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సిఫారసు వల్లే వారిద్దరికీ టీడీపీలో టికెట్లు వచ్చాయన్నది బహిరంగ రహస్యం.

అయినా ఏ సందర్భంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌, వారిద్దరినీ నియంత్రించిన దాఖలాలు లేవు. పైగా వారిద్దరూ చాలా సందర్భాల్లో ..టీడీపీ పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్‌ చేస్తుంటారు. . తన అనుచరులను ఎన్టీఆర్‌ నియంత్రించడం బదులు, వారిని ప్రోత్సహిస్తున్నారన్నది, అన్న అభిమానులు-కమ్మ సామాజికవర్గం అనుమానం. అది వేరే విషయం.

దానితో అన్న అభిమానులతో పాటు, మెజారిటీ కమ్మ సామాజికవర్గం జూనియర్‌ ఎన్టీఆర్‌పై ద్వేషం పెంచుకున్న పరిస్థితి. ఎన్టీఆర్‌ కొత్త సినిమాలు వచ్చినప్పుడల్లా, ఈ వర్గమంతా ఆ సినిమాలకు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కొన్నేళ్ల నుంచి కొనసాగుతోందన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆనర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో పార్టీలకు అతీతంగా ఓ కార్యక్రమం నిర్వహించింది. దానికి రాంచరణ్‌, వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, సుమంత్‌, వంటి అగ్రనటులతోపాటు.. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత పురందీశ్వరి, సీపీఐ జాతీయ నేత రాజా, సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి, జయప్రద, జయసుధ, ప్రభ, నిర్మాత జి.ఆదిశేషగిరిరావు, అల్లు అరవింద్‌ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా దాదాపు, తారకరాముడి శత జయంతి వేడుకలకు తరలివచ్చారు. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, అక్కనేని కుటుంబం నుంచి నాగచైతన్య, సుమంత్‌; చిరంజీవి కుటుంబం నుంచి హీరో రాంచరణ్‌, అల్లు అరవింద్‌ హాజరయ్యారు. కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం డుమ్మా కొట్టారు.

అయితే.. ఎన్టీఆర్‌ వారసుడిగా ప్రచారంలో ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం.. ఆ సభకు ముఖం చాటేయడంపై, అన్న అభిమానులు.. ప్రధానంగా కమ్మ సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిజానికి ఈ కార్యక్రమం జరిగి మూడు రోజులయినప్పటికీ, ఆ ఆగ్రహజ్వాల ఇంకా చల్లారడం లేదని సోషల్‌మీడియాలో, అన్న అభిమానుల అసంతృప్తి స్పష్టం చేస్తోంది. తాను విదేశాలకు వెళ్లే షెడ్యూల్‌ ముందే ఖరారయినందున, తాత శతజయంతి వేడుకలకు హాజరుకాలేకపోతున్నానని, ఎన్టీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

నిజానికి నందమూరి బాలకృష్ణ-అక్కినేని నాగార్జున మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఇద్దరికీ విబేధాలున్నాయన్నది బహిరంగమే. అయినప్పటికీ.. అక్కినేని కుటుంబం దానిని పక్కనపెట్టి, అక్కినేని నాగచైతన్య, సుమంత్‌ హాజరయిన వైనాన్ని, అన్న అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు గ్లామర్‌-ఫాలోయింగ్‌ ఉన్న రాంచరణ్‌ కూడా, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్న అన్న అభిమానులు.. జూనియర్‌ గైర్హాజరుపై గరం అవుతున్నారు.

ఈ సందర్భంగా వారు తమ ఆగ్రహాన్ని, దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ‘‘ఎన్టీఆర్‌ పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్న గారికి వారసుడయిపోర’’ని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మనసులో ప్రేమ లేకుండా పెద్దాయన పేరును.. ఎదుగుదల కోసం అడ్డుపెట్టుకుని ఎదుగుదామంటే కుదరద’’ని, మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

‘‘అన్న గారిపై అక్కినేని కటుంబానికి ఉన్న ప్రేమ, ఆయన వారసుడినని ప్రచారం చేసుకునే జూనియర్‌కు లేకపోవడం దురదృష్టకరం అని ఇంకొందరు పోస్టులు పెడుతుంటారు. వీరిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ గైర్హాజరీఆయన ఇమేజీని డ్యామేజీ చేసిందని అన్న అభిమానుల ఆగ్రహం స్పష్టం చేస్తోంది.