Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ వ్యాఖ్యలపై కమ్మ కులాల కన్నెర్ర

– జగన్.. మా వేలితో మా కన్నే పొడుస్తావా?
– నరికేస్తాం అంటుంటే ఖండించలేదు
– పల్నాడులో ఖండించిన కుల సంఘాలు
– దుమ్మెత్తిపోసిన కమ్మ సేవా సమితి విజయవాడ ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ
– కులాన్ని పార్టీలతో ముడి పెట్టవద్దు: అధికారి ప్రతినిధి పువ్వాడ సుధాకర్
– కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోండి: కేజీఎఫ్‌ ఏపీ ప్రతినిధి ముత్తవరపు రామకృష్ణ
– జగన్ వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాల ఖండన

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిన్న బుధవారం పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కెజిఎఫ్) తీవ్రంగా ఖండిస్తూ, జగన్‌ను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించింది.

ఈ సందర్భంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ వైఖరిని స్పష్టం చేశారు. “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం మానవత్వం గల చర్యగా అభినందనీయం. అయితే, ఈ సందర్భాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ, కమ్మ సామాజిక వర్గాన్ని అవమానించేలా, అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం మరియు ఖండనీయం. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయి, వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడతాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను హెచ్చరిస్తున్నాము,” అని కెజిఎఫ్ నాయకులు తెలిపారు.

రాజకీయ నాయకులకు హెచ్చరిక

“గతంలో తెలంగాణలో కేటీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పాలనలో కమ్మ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా చెల్లించుకున్న మూల్యం స్పష్టంగా కనిపిస్తుంది.2023 తెలంగాణ ఎన్నికలో BRS ఘోరఓటమి తరువాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. ఇకపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తే, కమ్మ సామాజిక వర్గం మరింత సమైక్యతతో, గట్టిగా స్పందిస్తుంది. రాజకీయ నాయకులు అన్ని సామాజిక వర్గాలను గౌరవించే బాధ్యతను చేపట్టాలి,” అని కెజిఎఫ్ హెచ్చరించింది.

కమ్మ వర్గ చరిత్ర గురించి స్పష్టీకరణ

కెజిఎఫ్ నాయకులు కమ్మ సామాజిక వర్గం యొక్క గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ, “కమ్మ వర్గ చరిత్ర తెలియని వారు ఉంటే, మేము చరిత్ర పుస్తకాలు పంపిస్తాం. వాటిని చదివి కనీసం ఇకనైనా జ్ఞానం సంపాదించుకోవాలని కోరుతున్నాము. కమ్మ వారి చరిత్రను చిన్నచూపు చేస్తే, అది చిరస్థాయిగా నిలిచే సత్యం కాదు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి రైతు పోరాటాల వరకు, కమ్మ వారు అనేక రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.

కాకాని వెంకట రత్నం, ఎన్.జి. రంగా వంటి స్వాతంత్ర్య సమరయోధులు జైలు జీవితం గడిపి దేశానికి సేవ చేశారు. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం కోసం 1950 లోనే రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ 55 లక్షల రూపాయలు, 5,000 ఎకరాల భూమిని దానం చేసి దేశాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన సామాజిక వర్గాన్ని అవమానించే ప్రయత్నాలు సహించేది కాదు,” అని స్పష్టం చేశారు.

సామాజిక న్యాయం కోసం కమ్మ వారి పోరాటం

“కమ్మ సామాజిక వర్గం ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందుండి పోరాడే సంప్రదాయం కలిగిన వర్గం. బడుగు బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం కమ్మ వారు నిరంతరం కృషి చేశారు. ఈ చరిత్రను విస్మరించి, రాజకీయ స్వార్థం కోసం ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం నీతిబాహ్యం. కమ్మ వారు కేవలం ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గం కాదు. సమాజంలో సమైక్యత, కృషి, సేవలో ముందున్న బలమైన శక్తి,” అని కెజిఎఫ్ పేర్కొంది.

జగన్‌ మా వేళ్ళతో మమ్మల్నే పొడుస్తున్నారు: గుమ్మడి రామకృష్ణ

మాసీ సీఎం జగన్‌ మా వేళ్ళతో మమ్మల్నే పొడుస్తున్నారు.. మీరు రాజకీయాలు మాట్లాడండి. కులాల పేరు వద్దు. మీరు ఏబీవీ, నిమ్మగడ్డ రమేష్ లను వేధించారు. మీ వల్లే మల్లేశ్వరరావు చనిపోయారు. 175 అని చెప్పి ప్రోత్సహించారు.. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అంటుంటే ఖండించలేదని కమ్మ సేవా సమితి విజయవాడ ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.

అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానిస్తే నవ్వుకోవడం దేనికి సంకేతం? మతాలు, కులాలు వద్దు విధానాలు మాట్లాడండి. మేం టీడీపీ కి దాసోహం కాదు. 1971 నుంచి 13 మంది సీఎంలను చూశాం.. ఎవరు కులాల మీద టార్గెట్ చేయలేదు. మాట్లాడలేదు. మీరు ఏ కుల ప్రస్తావన తీసుకు రావద్దు.. అసెంబ్లీ నుంచి పారిపోయి ఓదార్పు పేరుతో కుట్రలు, విద్వేషాలు రెచ్చకొట్టొద్దని రామకృష్ణ హితవు పలికారు.

మీ పాలనలో కమ్మ అధికారులను తొక్కి పెట్టావ్ : పువ్వాడ సుధాకర్

ఆ సంఘం అధికారి ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో కులాల ప్రస్తావన తెచ్చే విధంగా మాట్లాడవద్దు. నీ పాలనలో కమ్మ వారిపట్ల ద్వేషంతో అమరావతికి కులాన్ని అపాదించారు. డీఎస్పీ ట్రాన్స్ఫర్ లను కులానికి ఆపాదించారు. కమ్మ కులస్తులు ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తే కులాన్ని అపాదిస్తావ్. అనేక మంది రెడ్డి సీఎంలు పని చేశారు. ఎవరు మాట్లాడనివి నువ్వు మాట్లాడావు. కులాన్ని పార్టీలతో ముడి పెట్టవద్దు. సమాజ సేవకు కమ్మ కులం కట్టుపడి ఉంది. మా కులాన్ని అగౌరవ పర్చవద్దు. మీ పాలనలో కమ్మ అధికారులను తొక్కి పెట్టావ్.

కమ్మ కులంపై ఏ రాజకీయ పార్టీ విమర్శలు చేసినా సహించేది లేదని సుధాకర్‌ హెచ్చరించారు. కులాల మధ్య సామరస్యం కోసం పని చేయాలి. కులాల మధ్య అంతర్గత చిచ్చు పెట్టి మీరు ఆనందించడం సరికాదు. మా కులాన్ని ద్వేషించే రాజకీయ పార్టీలకు మేం వ్యతిరేకంగా పని చేస్తామన్నారు.

మీ పార్టీలో కమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చారా? : కేజీఎఫ్‌ ఏపీ ప్రతినిధి ముత్తవరపు రామకృష్ణ

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్‌) ఏపీ ప్రతినిధి ముత్తవరపు రామకృష్ణ మాట్లాడుతూ, మీ పార్టీలో కమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చారా? స్వాతంత్రం తర్వాత కమ్మ మంత్రి లేకుండా మీ ప్రభుత్వంలో హయంలో జరిగింది. మీ పార్టీ లో ఉన్న దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ లకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు. అవన్నీ మాట్లాడకుండా కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోండి.

సామాజిక సామరస్యం కోసం పిలుపు

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అన్ని సామాజిక వర్గాల గౌరవాన్ని కాపాడే రాజకీయ సంస్కృతి అవసరమని ఉద్ఘాటించింది. “సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెంపొందించాలంటే, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జగన్ మోహన్ రెడ్డి గారు తమ వ్యాఖ్యలను పునర్విమర్శించి, భవిష్యత్తులో అన్ని వర్గాలను గౌరవించే విధంగా మాట్లాడాలని కోరుతున్నాము. కమ్మ సామాజిక వర్గం సమాజ సేవ, కృషి, సమైక్యతలో ఎల్లప్పుడూ ముందుంటుంది,” అనికెజిఎఫ్ నాయకులు తెలిపారు.

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ నాయకులు సామాజిక వర్గాలను అవమానించకుండా, సామరస్యాన్ని పెంపొందించే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే, కమ్మ సమాజం తగిన రీతిలో స్పందిస్తుందని స్పష్టం చేసింది. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం అందరూ కలిసి పనిచేయాలని కెజిఎఫ్ పిలుపునిచ్చింది.

ఈ సమావేశంలో గుమ్మడి రామకృష్ణ , ముత్తవరపు రామకృష్ణ , ధూళిపాల శ్రీనివాస్ , మైనేని సంపత్ కుమార్ , సూరపనేని స్వరూప రాణి , బొప్పన గాంధీ, రావి రమేష్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE