మొత్తం 16 రకాల దానాలు
వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. సంతానార్ధం, త్రిధర్మ రక్షణార్ధం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో యజ్ఞాలకి, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది.
మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో నాలుగు దానాలు మరింత విశిష్టమైనవి. అవి కన్యాదానం, గోదానం, భూదానం మరియు విద్యాదానం. వీటిని చతుర్విధ దానాలంటారు. భూదానంలో భూమి మీదనో, గోదానంలో గోవు మీదనో గల అన్ని హక్కులనూ దానం పుచ్చుకున్నవారికి ఇచ్చి వేస్తారు. వారు వాటిని అనుభవించవచ్చు. ఇంకొకరికి ఇవ్వవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కన్యాదానం వాటికి భిన్నమైనది. వధువు యొక్క సర్వబాధ్యతలను మరి ఒకరికి బదిలీ చేయడానికి, కన్యాదాన ఉద్దేశ్యం ఇంత దాకా ఆమె పోషణ, రక్షణ, సంతోషం, ఓదార్పు, ప్రోత్సాహం, అన్నీ తల్లిదండ్రుల బాధ్యతలు.
ఇకపై ఆమె భర్తకు, అత్తవారింటికి మార్చబడతాయి. వివాహం అనేది ద్వైపాక్షిక ఒప్పందం. దాన్ని దైవసాక్షిగా, అగ్నిసాక్షిగా, మనస్సాక్షిగా అంగీకరించాలి, గౌరవించాలి, అనుసరించాలి. ఇవి వధూవరులకి కాదు, వారి కుటుంబీకులకు వర్తిస్తుంది.
కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సాహకాలూ అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సంసిద్ధపరుస్తుంది. భరోసా కల్పిస్తుంది. ధైర్యస్థైర్యాలనిస్తుంది. వరుని కాళ్ళు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తూ, నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను.
నా పితరులు తరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరింపబడిన ఈ కన్యను ధర్మ, కామార్ధ సిద్ధి కలిగే నిమిత్తము మంచి శీలం కలిగిన, బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను, అంటూ చతుర్ధీవిభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దానం చేయడు కన్యాదాత. వరుడి దగ్గిర నుండి కొన్ని ప్రమాణాలు అడుగుతాడు. మరి ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టిని, తన ఇంటి మహారాణిని, కన్యాదాత అంత సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు అడుగుతాడు.
1. నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకూడదు అని అడిగితే, వరుడు దానికి అంగీకరిస్తాడు. ధర్మమునందు ఈమెను అతిక్రమించనని
ప్రమాణం చేస్తాడు.
2. అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించావో, ఇక ముందు సంపాదించబోయెదానికి ఈవిడ సర్వాధికారిణి. ఒప్పుకుంటావా? అని అడిగితే దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.
3. నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయే గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారానే నీవు సంతానాన్ని పొందాలి. అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు అనగానే, దానికి కూడా వరుడు అంగీకారం తెలుపుతాడు.
అప్పుడు ఒక మహాద్భుతమైన కన్యాదాన ఘట్టం జరుగుతుంది. ముందుగా విష్ణుస్వరూపుడిగా ఉన్న వరుడు ఎదురుపడితే, మరి ఆయన ఆతిధ్యం ఇవ్వాలంటే అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా!. దీనికంటే ముందు కన్యాదాత, వరుడు వివాహవేదికకు వచ్చే ముందే ఒక ఆసనం ఏర్పాటు చెయ్యాలి. అది దర్భాసనం అయి ఉండాలి. ఎందుకంటే విష్ణుమూర్తి వచ్చి నీ ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా! మరి దర్భాసనాన్ని మించిన ఉచితాసనం ఏముంటుంది కనక. అందుకని కన్యాదాత తప్పక దానిని ఏర్పాటు చేసుకోవాలి.
కాళ్ళు కడిగేటప్పుడు కూడా ముందుగా కుడికాలుని ఉంచితే, తనకు కాబోయే మామగారు, అత్తగారు మరచెంబుతో సన్నటి ధారతో నీటిని పోస్తుంటే, మామగారు బహుజాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలను కడుగుతాడు. అలాగే, దాని తరువాత ఎడమ పాదాన్ని ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే ప్రీతితో కడుగుతాడు. మామగారు, అల్లుడి పాదాలు కడుగుతుంటే చాలా ఆనందంగా, వింతగా Photographer వంక, Videographer వంక చూడడం కాదు, వరుడు చెయ్యాల్సింది.
తనకంటే వయసులో పెద్దాయన తన కాళ్ళు కడుగుతున్నాడు. తాను చేసుకున్న పుణ్యం అంతా తరిగిపోతుంది. కాబట్టి, ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి (మయి, మయి, యశోమాయి) అని. బ్రహ్మగార్ని అడిగితే ఆయన చెబుతాడు. ఈ విషయం వరుడి తండ్రి చెప్పుకోవాలి. కన్యాదాత చెప్పుకోలేడు కదా… బాబూ! నేను నీ కాళ్ళు కడుగుతుంటే నువ్వు అలా మెడ వేళ్ళాడేసి Videographer వంక చూడటం కాదు, ఇది చదువుకో అని చెబితే తనను తాను పోగుడుకున్నట్లు అవుతుంది అని తండ్రి చెప్పుకోవాలి. నీ పుణ్యం ఎగిరిపోతుందిరా…
– కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరు