Suryaa.co.in

Editorial

మళ్లీ ‘కాపు’ క ల్లోలం

– ఎమ్మార్పీఎస్ తరహాలో కేఆర్‌పీఎస్‌కు సన్నాహాలు
– ఇప్పటివరకూ 5 శాతం ఈడబ్ల్యుఎస్ కోటాపైనే కొట్లాట
– కొత్తగా 12 శాతం రిజరేషన్ల కోసం మరో ఉద్యమానికి కసరత్తు
– సీఎంఓలో కాపులే రీ అంటున్న కాపు సంఘాలు
– డజన్ల మంది వీఆర్‌లో డీ ఎస్పీ, సీఐలకు పోస్టింగులపై గళం విప్పేందుకు సిద్ధం
– పవన్ నిర్లిప్త వైఖరిపై కాపు సంఘాల ఆగ్రహం
– కాపు సంఘాలను దూరంగా ఉంచిన కల్యాణ్‌పై కన్నెర్ర
– పవన్ ఉండటం వల్లే టీడీపీలో కాపులకు గుర్తింపు పోయిందన్న అసంతృప్తి
– రెంటికీ చెడ్డ రేవడయ్యామంటున్న కాపు సంఘాలు
– ఈనెల 29న విజయవాడ వేదికలో కేఆర్‌పీఎస్ సన్నాహక సభ
– ముందు కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు
– గతంలో రాజమండ్రిలో రద్దయిన నేపథ్యంలో కాపు సంఘాల మరో యత్నం
– 12 శాతం రిజర్వేషన్లు అసంభవమంటున్న కొన్ని కాపు సంఘాలు
– ముందు 5 శాతం ఈడబ్ల్యుఎస్ కోటా అమలుపైనే పోరాడాలని వాదన

(మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ జమానాలో వినిపించని కాపు డిమాండ్లు ఇప్పుడు మళ్లీ తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్లే.. తమకూ 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో కాపులు మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ కూటమిలో చేరిన ఫలితంగా తాము మరోసారి రాజకీయంగా అనాధలమయ్యామన్న ఆగ్రహం కాపు సంఘాల్లో వ్యక్తమవుతోంది. తమను పట్టించుకునేవారు కరవయ్యారన్నది వారి ఆగ్రహానికి అసలు కారణంగా కనిపిస్తోంది. మరోవైపు.. సీఎంఓలో కాపు అధికారిని నియమించాలన్న కొత్త డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. జనసేన-టీడీపీ తమ సమస్యలు పట్టించుకోని నేపథ్యంలో, సీఎంఓలో ఒక అధికారిని నియమించడం ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం కల్పించాలన్న సూచన మరికొన్ని కాపు సంఘాల నుంచి వినిపిస్తోంది.

పాలకులకు పక్కలో బల్లెంలా ఉండే కాపు ఉద్యమం.. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ రెక్కలు తొడిగేందుకు సిద్ధమవుతోంది. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ డిమాండ్లు వినిపించేందుకు సాహసించని కాపు సంఘాలు, కూటమి కాలంలో పొలికేక వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆమేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తరహాలో, కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కెఆర్‌పీఎస్)కి ఊపిరిపోసేందుకు కాపు సంఘాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. నిజానికి దీనికి గత నెలలో రాజమండ్రిలోనే అంకురార్పణ జరగాల్సిన ఉండగా, కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. మళ్లీ ఇప్పుడు ఈనెల 29న విజయవాడ వేదికగా, కార్యాచరణ ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ మేరకు ఈపాటికే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల కాపు సంఘాలకు ఫోన్ల ద్వారా సందేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనివెనక కోనసీమ జిల్లాకు చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాజమండ్రికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే, ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహించే మరో రాజకీయ విశ్లేషకుడు ఉన్నట్లు కాపు సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయక త్వం తాజాగా ఆ కోనసీమ నేతను ముద్రగడ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓడిన ఆ కాపునేత, జనసేనలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో.. వైసీపీలోనే కాపునేతగా అవతారమెత్తేందుకు సిద్ధనమవుతున్నారని కాపు వర్గాలు చెబుతున్నాయి.

అయితే అనూహ్యంగా వీరికి ఏ పార్టీకి చెందని జిల్లాల కాపు నేతలు ఈ ప్రయత్నాలకు మద్దతు ప్రకటించినట్లు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, వైసీసీకి చెందని కాపు నేతలు గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కాపులకు ఇస్తున్న ప్రాధాన్యంపై తరచూ సమావేశాలు నిర్వహించుకుంటున్నారట.

ఆ సందర్భంలో.. ‘‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూటమిలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపులను ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. అసలు పవన్ కల్యాణే మాతో ఉంటే ఇక కాపులతో పనేమిటన్నట్లు వ్యవహరిస్తోంది. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కుల సమస్యలు చెబితే, ఇప్పుడు మాదేముంది? అంతా పవన్ కల్యాణ్ చూసుకుంటున్నారంటున్నారు. పోనీ పవన్‌గారితో మాట్లాదామంటే ఏడాది నుంచి ఆయన మాకు అపాయింట్‌మెంటే ఇవ్వడం లేదు.

జనసేన ఎమ్మెల్యేలకు చెబితే, వాళ్లు.. మాకూ పవన్ గారు టైమ్ ఇవ్వడం లేదంటున్నారు. మరి మా 5 శాతం ఈడబ్ల్యుస్ రిజర్వేషన్ల సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? మన కులానికి చెందిన దాదాపు 10మంది డీఎస్పీలు, డజన్ల మంది సీఐలకు ఇప్పటిదాకా పోస్టింగులు ఇవ్వలేదు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాటకు సంబంధం లేని ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు వేశారు. గుంటూరుకు మాజీ ఎంపి మాధవ్ వెళ్లినప్పుడు ఇంటలిజన్స్‌లో ఉన్న డీఎస్పీ సీతారామయ్యను వీఆర్‌లో పెట్టారు. దానికి సీతారామయ్యకు ఏం సంబంధం? గుంటూరులో ఒక్క కాపు సీఐ లేరు. అంతా ఒకటే సామాజికవర్గం వాళ్లున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే దీనిపై ఎవరు నాయకత్వం వహిస్తే, వారితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’మని చర్చించుకున్నట్లు సమాచారం.

టీడీపీలో ఉన్న కాపు హేమాహేమీలంతా.. ఇప్పుడు పవన్ కల్యాణ్ పుణ్యాన జీరోగా మారారన్న వ్యాఖ్యలు కాపు వర్గాల్లో బహిరంంగానే వినిపిస్తున్నాయి. పవన్ తమతో ఉన్నారన్న ధీమాతోనే టీడీపీ నాయకత్వం వారిని పట్టించుకోవడం లేదని, పవన్‌ను నమ్మి సొంత పార్టీ కాపులను పక్కనపెట్టడం వెనక ఏ వ్యూహం ఉందో తెలియడం లేదని టీడీపీ కాపు నేతలూ చర్చించుకుంటున్న పరిస్థితి.

గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి వల్ల కాపులు ఆర్ధికంగా-సామాజికంగా నష్టపోతే, ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్ల రాజకీయంగా అనాధలమయ్యామని జిల్లాలకు చెందిన కాపునేతలు, రాష్ట్ర కాపునాడు నాయకుల వద్ద వాపోతున్నారట. పైగా గత ఏడాది రాష్ట్ర కాపు నేతలు సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉండటాన్ని ఆక్షేపిస్తున్నారు. దీనితో వారికి ఏం చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్నామని కాపు రాష్ట్ర నేతలు వాపోతున్నారు.

ఏడాది నుంచి పవన్ కల్యాణ్… కాపులకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తారని ఎదురుచూసిన కాపుల ఆశ.. క్రమంగా అసంతృప్తిగా మారి, అది ఆగ్రహానికి దారితీసిన వైనాన్ని వైసీపీ రాజకీయంగా సద్వినియోగం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
తమను అటు టీడీపీ, ఇటు జనసేన పట్టించుకోకపోతే ఇక రోడ్డెక్కడం ఒక్కటే శరణ్యమన్న వాదన వినిపిస్తున్నారు. కేవలం పవన్ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే తమకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదన్న ఆగ్రహం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది జనసేన ఎమ్మెల్యేలలో సైతం ఇదే అంశంపై అసంతృప్తి ఉన్నప్పటికీ, వారంతా పవన్ ముందు గళమెత్తేందుకు భయపడుతున్నారని కాపు నేతలు తమ సమావేశాల్లో చెబుతున్నారట. అయితే ఇప్పుడు ఈడబ్ల్యుఎస్ కోటా బదులు, 12 శాతం రిజర్వేషన్ డిమాండ్ తెరపైకి రావడంతో కాపుల కొట్లాట కొత్త మలుపు తిరిగినట్లయింది

పవన్ కల్యాణ్ తన రాజకీయ స్వార్ధం కోసం, తన కుటుంబసభ్యులకు పదవుల కోసమే కూటమిలో ఉన్నారు తప్ప.. తన పలుకుబడిని 12 శాతం రిజర్వేషన్ల కోసం ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న వ్యాఖ్యలు, కాపు సంఘాల్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎంతోమంది కృషి చేస్తే వారిని కాదని, ఆయన తన అన్నయ్య నాగబాబుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలపై కాపు వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే కాపు యువకులకు ఎడ్యుకేషన్‌లో ఆ మేరకు అవకాశాలు లభిస్తాయన్నది వారి వాదన.

ఎలాగూ సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని తేల్చిచెప్పినందున, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు కూడా లేవని గుర్తు చేస్తున్నారు. ఇక పక్కనే ఉన్న మహారాష్ట్ర కూడా మరాఠాలకు రిజర్వేషన్ ఇచ్చినట్లే, తమకూ 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ప్రభుత్వమే చొరవ తీసుకుని దానిని అమలుచేయడమే న్యాయమని కాపు సంఘాలు వాదిస్తున్నాయి.
అయితే మరికొన్ని కాపు సంఘాలు మాత్రం.. 12 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని, అది కూటమి ప్రభుత్వం గట్టిగా అనుకుంటే తప్ప సాధ్యం కాదని వాదిస్తున్నాయి. దానికంటే.. ముందు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌లో 5 శాతం అమలు కోసం పోరాడటమే మంచిదని స్పష్టం చేస్తున్నారు.



‘సీమ’లోనూ బలిజ కార్పొరేషన్ డిమాండ్

అటు రాయలసీమలో అత్యధిక జనాభా ఉన్న బలిజలు కూడా బలిజ కార్పొరేషన్ కోసం గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బలిజ సంఘాలు గత రెండు నెలల నుంచి అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తమను కాపు కార్పొరేషన్ నుంచి విడగొట్టి, బలిజ-శెట్టిబలిజకు వేరుగా కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు.

అయితే సీమ బలిజల ప్రయత్నాలను కోస్తా కాపులు అడ్డుకుని, వారికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విడిపోతే నష్టపోతామని వారికి సర్దిచెబుతున్నా, వారు మాత్రం బలిజ కార్పొరేషన్ డిమాండ్‌కే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. సీమలో రెడ్లను వ్యతిరేకించి, వారి ఆధిపత్యాన్ని ఎదిరించే బలిజలు.. సుదీర్ఘకాలం నుంచీ టీడీపీకి మద్దతునిస్తున్నా, ఆ పార్టీ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి బలిజ వర్గాల్లో ఉంది. ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీకి బాహాటంగా మద్దతునివ్వడమే కాకుండా, పార్టీలో చేరిన బలిజ నాయకులను ఎవరూ పట్టించుకోకపోవడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది.

కొద్దికాలం క్రితం తమ కులానికి చెందిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును, తిరుపతి క్యూ లైన్ల ఘటనలో అన్యాయంగా బదిలీ చేశారన్న ఆగ్రహం వారిలో ఇంకా పోనట్లు కనిపిస్తోంది. ఆయనకు ఇప్పటివరకూ సరైన పోస్టింగు లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత- బలిజల్లో ఇమేజ్ ఉన్న పాలకొండరాయుడు తనయుడు, గత ఎన్నికల్లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమయింది. ఆయన ఓడిన తర్వాత పదవి ఇస్తామని ఇవ్వకపోగా, ఆయనపై మేడా మల్లికార్జునరెడ్డి తమ్ముడు సహా ముగ్గురిని పోటీగా తీసుకురావడంపై ఆగ్రహించిన సుబ్రమణ్యం, పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా తన తమ్ముడిని తనకు పోటీగా తయారుచేయడమే సుబ్రమణ్యం అసంతృప్తికి మరో కారణమంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి రాజీనామా చేయడమే దానికి కారణం.

ఎన్టీఆర్ హయాంలో సీమలో 9 మందికి టికెట్లు ఇస్తే మొత్తం గెలిచారని, తర్వాత ఇప్పుడు దానిని ఒకటి, రెండుకు కుదించారని బలిజ నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా తాము రెడ్లపై వ్యతిరేకతతో టీడీపీకి మద్దతునిస్తుంటే, అది ఆ పార్టీకి అలుసుగా మారిందని బలిజ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

‘సీమలో మాకు-రెడ్లకు సరిపడదు. మేం వారి పెత్తనం ఒప్పుకోం. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే మేం టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నందున ప్రయోజనం లేకపోగా, నష్టం జరుగుతోంది. మమ్మల్ని ఏ ఎమ్మెల్యే గుర్తించడం లేదు. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి బలిజ నేతలను పార్టీలో చేర్చుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అదేదో వైసీపీ వారితోనే సర్దుకుపోతే, కనీసం పెరిగే నియోజకవర్గాల్లో కొన్ని సీట్లయినా ఇస్తారు కదా అన్న చర్చ బలిజల్లో జరుగుతోంది. దీనిపై టీడీపీ నాయకత్వం ఎంతవరకూ స్పందిస్తుందో చూడాలి’’ అని తిరుపతికి చెందిన ఓ బలిజనేత వ్యాఖ్యానించారు.

కాగా టీడీపీకి రాజీనామా చేసిన పాలకొండరాయుడు తనయుడు సుబ్రమణ్యంను.. వైసీపీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చినట్లు బలిజనేతలు చెబుతున్నారు. బెంగళూరులో జగన్‌ను కలిసిన నేపథ్యంలో, సుబ్రమణ్యంకు ఆమేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.



సీఎంఓలో కాపు అధికారిని నియమించండి

– కాపులకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలుచేయండి

– ప్రభుత్వానికి కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం

విజయవాడ: సీఎంఓ కార్యాలయంలో కాపు అధికారిని నియమించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో కాపులు ఎప్పుడూ లేనంత అయోమయం-గందరగోళంలో ఉన్నారని, ఈ పరిస్థితిలో తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు సీఎంఓలో కాపు అధికారిని నియమించాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో అత్యంత పెద్ద జనాభా సంఖ్య ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన అధికారిని సీఎంఓలో నియమించడంలో తప్పేమీలేదన్నారు. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయన సీఎంను కోరారు. ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని కాపు నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల దృష్ట్యా ఈ డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.

‘‘ఈ రెండు అంశాలపై ఇటీవలి కాలంలో మూడుసార్లు జిల్లా నేతలతో సమావేశాలు జరిగాయి. మా సమస్యలపై టీడీపీ,జనసేన పార్టీలు దృష్టి సారించడం లేదని జిల్లా కాపు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమం చేయాలని మాకు సూచించారు. అయితే మేం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత సమిష్టి నిర్ణయం తీసుకుందామని వారికి నచ్చచెప్పాం. కాపుల మద్దతుతో గెలిచిన కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం మాకుంది’’ అని గాళ్ల వ్యాఖ్యానించారు.



మరాఠాల మాదిరి మాకూ రిజర్వేషన్ కావాలి

– ఈడబ్ల్యుఎస్ వద్దు.. 12 శాతం రిజర్వేషన్ ముద్దు
– దానికోసమే కాపు రిజర్వేషన్ పోరాటసమితి
– ఎమ్మార్పీఎస్ తరహాలోనే కెఆర్‌పీఎస్ ఉద్యమ ప్రణాళిక
– 29న మంత్రులందరినీ కలుస్తాం
– ఇది పార్టీలకు అతీతమైన పోరాట సంస్థ
– కేఆర్‌పీఎస్ కన్వీనర్ నాగేంద్రబాబు

విజయవాడ: ‘‘మాకు ఈడబ్ల్యుఎస్‌లో 5 శాతం వద్దు. దానివల్ల మాకు ఒరిగేదేమీలేదు. దానిని ఓసీలకే ఇచ్చేయండి. రేపు ఎవరైనా దానిపై కోర్టుకు వెళ్లినా ఇబ్బందే. మాకు మహారాష్ట్రలో మరాఠాలకు షిండే ప్రభుత్వం ఇచ్చినట్లు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి. 30 శాతం ఉన్న మరాఠాలాకు బిజెపి ప్రభుత్వమే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. ఇక్కడ కాపులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తోనే కాపు రిజర్వేషన్ పోరాట సమతి ప్రారంభిస్తున్నాం. ఇందులో ఒక్క స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే ఉంటారు. మిగిలినవారంతా కో ఆర్డినేటర్లమే. మేం 29న విజయవాడలో సభ పెట్టి, మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తామ’’ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ రావి శ్రీనివాసరావు, జానపామల నాగేంద్రబాబు, వెల్లడించారు.

మహారాష్ర్టలో 30 శాతం మంది ఉన్న మరాఠాలకు అక్కడి బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, అమిత్‌షా స్వయంగా వచ్చి దానిని ప్రకటించారని నాగబాబు గుర్తు చేశారు. ‘ఇక్కడ కూడా ప్రభుత్వంలో బీజేపీ ఉంది. కాపు నాయకుడు పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మా కాపులంతా గత ఎన్నికల్లో కూటమికే ఓటు వేశాం. కాబట్టే మాకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈడబ్ల్యుఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ల మాకు వచ్చేదేమీ లేదు. పైగా అగ్రకులాల వారితో మాకెందుకు కొట్లాట? అది మొత్తం ఓసీలకే ఇవ్వండి. ఇప్పుడు మేం బీసీలుగా 12 శాతం రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. దానిని ఇప్పించే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకోవాలి.ఎందుకంటే గత ఎన్నికల్లో కాపులంతా పవన్‌ను చూసే కూటమికి ఓట్లేశారు. ఈ డి మాండ్ సాధనకే కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. నిజానికి కాపు ఐక్యవేదికలో భాగమే. కొత్తది కాదు. దీని వెనుక ఏ పార్టీ లేదు. పార్టీలకు తూకాలు ఉంటాయి. మాకు డిమాండ్ల సాధనే తప్ప తూకాలు ఉండవు’’ అని నాగబాబు, ఆర్వీ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

ఈనెల 29న విజయవాడలో సభ నిర్వహిస్తున్నామని, తర్వాత తమ డిమాండ్ల సాధనకు మంత్రులను కలసి వినతిపత్రాలిస్తామని వెల్లడించారు. అన్ని పార్టీలకు చెందిన కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలిస్తామని వివరించారు. కాపు ఉద్యమం.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరహాలో ఉండబోతుందని చెప్పారు. తమ ఉద్యమం వెనక వైసీపీ ఉందన్న ఆరోపణలను ఖండించారు.

 

LEAVE A RESPONSE