– 29 నాటి కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభ రద్దు
– రంగంలోకి దిగిన టీడీపీ ఎంపీ సానా సతీష్
– లోకేష్ ఆదేశాలతో కాపునేతలతో భేటీ
– కేఎస్‌పీఎస్ సభ రద్దు చేసుకోమని కోరిన సానా
– వచ్చే నెలలో బాబు-లోకేష్‌తో భేటీ ఏర్పాటుచేయిస్తామని హామీ
– మరాఠాల తరహాలో 10 శాతం రిజర్వేషన్, 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్లేషన్లపై చర్చ
– సతీష్‌పై గౌరవంతో కేఎస్‌పీఎస్ సభ రద్దు చేసుకుంటున్నామన్న కాపునేత నాగబాబు
– కాపుల ఓట్లతోనే జనసేన ఎమ్మెల్యేలు గెలిచారని నాగబాబు స్పష్టీకరణ
– జులైలో భారీ సమావేశం ఏర్పాటుచేసి, ప్రతిపాదనలు ఇస్తామన్న నాగబాబు
– తర్వాత బాబు-లోకేష్‌తో కాపునేతల భేటీకి సానా హామీ
– పెంటపాటి పుల్లారావుతో సభలోనే ఫోన్‌లోనే మాట్లాడిన సానా సతీష్
– కాపు సంఘాలతో సమన్వయం చేసిన గంధం పల్లంరాజు
– ‘‘సూర్య’’ ఎఫెక్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
మాదిగ రిజర్వేషన్ పోరాట సమతి (ఎమ్మార్పీఎస్) తరహాలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్)కి ఊపిరిపోసి.. రోడ్డెక్కేందుకు సిద్ధమైన కాపు సంఘాల దూకుడుకు, కాపు సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బ్రేకులు వేశారు. టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సానా సతీష్.. కేఆర్‌పీఎస్‌కు సన్నాహాలు చేసిన నాగేంద్రబాబుతో సహా దాదాపు రెండొందల మంది కాపులతో శుక్రవారం భేటీ అయ్యారు. దీనిని కాపు నేత గంధం పల్లంరాజు అనుసంధానకర్యగా వ్యవహరించారు.
కాగా.. మహారాష్ట్రలో మరాఠాల తరహాలో ఏపీలోనూ కాపులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కాపులు, ఈనెల 29న బెజవాడలో సభ పెట్టనున్నారంటూ ‘‘సూర్య’ ’లో ఈ నెల ఈనెల 24న ‘‘మళ్లీ కాపు కల్లోలం’’ పేరిట వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇది కాపు వర్గాల్లో కలకలం రేపింది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో నిఘా వర్గాలు దానిపై దృష్టి సారించాయి.
దీనితో నష్టనివారణకు రంగంలోకి దిగిన మంత్రి లోకేష్.. ఎంపి సానా సతీష్‌కు దిద్దుబాటు చర్యలకు దిగాలని ఆదేశించ డం, ఆయన కాపు నేతలతో భేటీ కావడం చకచకా జరిగిపోయింది.
అసలేం జరిగింటే.. మహారాష్ట్రలో మరాఠాలకు, అక్కడి బీజేపీ సర్కార 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లే.. ఏపీలోనూ కాపులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో, కాపు రిజర్వేషన్ పోరాట సమితికి ఊపిరిపోసేందుకు కాపు నేత లు సిద్ధమయ్యారు.
కాకినాడకు చెందిన కాపు నేత జె.నాగేంద్రబాబు ఆధ్వ్యరంలో ఈనెల 29న విజయవాడలో ఎమ్మార్పీఎస్ మాదిరిగానే.. కెఆర్ పీఎస్‌ను, రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు చైర్మన్‌గా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మేరకు నాగబాబు రాష్ట్రంలోని కాపు సంఘాలకు సమాచారం పంపించారు.
దీనిని ‘‘సూర్య’ వెలుగులోకి తెచ్చింది. దానితో రంగంలోకి దిగిన మంత్రి లోకేష్.. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలంటూ కాపు నేత, ఎంపి సానా సతీష్‌ను ఆదేశించారు. దానితో రంగంలోకి దిగిన సతీష్.. వివాదరహితుడైన కాపు నేత గంధం పల్లంరాజుతో చర్చించారు. ఉద్యమాలకు బదులు, ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కరింకుందామని సతీష్ ఆయనకు సూచించారు.
కూటమి ప్రభుత్వం కాపు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నందున, ఈ సమయంలో ఉద్యమాలు అవసరం లేదని హితవు పలికారు. ప్రభుత్వం కూడా కాపు సమస్యలపై సానుకూలంగా ఉన్నందున, కాపునేత నాగేంద్రబాబుతో చర్చించి ఉమ్మడి సమావేశానికి ఒప్పించాలని, కాపునేత పల్లంరాజును ఎంపి సానా సతీష్ అభ్యర్థించారు.
దానితో రంగంలోకి దిగిన పల్లంరాజు.. కాపు నేత నాగేంద్రబాబుతో, ఎంపీ సానా సతీష్ ప్రతిపాదనలు వివరించారు. అటు ఎంపి సతీష్ సైతం, నాగేంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈనెల 27న తాను కాకినాడకు వ స్తానని, అక్కడ కాపు సమస్యలపై చర్చిద్దామని.. అప్పటివరకూ ‘‘సూర్య’ లో వచ్చిన కథనాన్ని సోషల్‌మీడియాలో విస్తృతం చేయవద్దని.. అటు సతీష్, ఇటు పల్లంరాజు సూచించినట్లు సమాచారం. దానికి అంగీ రించిన నాగేంద్రబాబు.. తమకు కాపు సమస్యలు పరిష్కారమవడమే ముఖ్యమని, సానా సతీష్ ప్రతిపాదనను అంగీకరించారు.
ఆ ప్రకారంగా శుక్రవారం కాకినాలోని తన ఆఫీసులో సానా సతీష్ కాపు ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన గంధం పల్లంరాజు..ఉద్యమాలతో లాభం లేదని, మన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి.. వాటిని పరిష్కరించుకునే అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు.
మరో కాపు నేత ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ.. కాపు,బలిజ, ఒంటరి సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాలని సూచించారు. కాపుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఇప్పుడే వచ్చినందున, దానిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గత ఎన్నికల్లో కాపులు కూటమిపై నమ్మకంపై ఓటు వేసి గెలిపించినందున, కాపుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెంటపాటి పుల్లారావుతో కూడా చర్చించాలని సూచించారు.
దీనితో జోక్యం చేసుకున్న కేఆర్‌పీఎస్ నేత నాగబాబు.. రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావును అందరి ఎదుటే, ఎంపి సానా సతీష్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడు మీతో చర్చిస్తానని, ఈలోగా 29న బెజవాడలో తలపెట్టిన కాపుసభను వాయిదా వేసుకోవాలని సానా సతీష్ అభ్యర్ధించగా, అందుకు పుల్లారావు అంగీకరించారు.
కాపు సమస్యలు పరిష్కారం కావాలన్న సదుద్దేశంతో పెంటపాటి పుల్లారావు అంగీకరించిన ందున, తాము కూడా 29న జరపతలపెట్టిన సభను వాయిదా వేసుకుంటున్నామని నాగేంద్రబాబు ప్రకటించారు. ‘‘ ఈ సభ వెనక ఏ పార్టీ లేదు. తోటత్రిమూర్తులతో చ ర్చించిన విషయం వాస్తవమే. నేను అన్ని పార్టీల్లోని కాపులతో మాట్లాడతా. కాపు సమస్యలను పరిష్కరిస్తానన్న సానా సతీష్ హామీపై మాకు గౌరవం ఉంది. రాయలసీమలో రెడ్లు కాపు సర్టిఫికెట్లతో కాపులుగా చెలామణి అవుతున్నారు. కాబట్టి సీమలో బలిజ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కాపు కార్పోరేషన్‌కు 5 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పినా, ఇంతవరకూ 5 పైసలు ఇవ్వలేదు. దానికి నిధులు కేటాయించాలి. ఏపీ,తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి ఆరు రాష్ట్రాల్లో కాపులు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నారు. మహారాష్ర్ట ప్రభుత్వం మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లే, ఇక్కడా 10, 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే మా డిమాండ్. రేపు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వడంపై ఎవరైనా కోర్టుకు వెళితే మనకే నష్టం. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్న ఎంపి సానా సతీష్ మాటపై గౌరవం ఉంచి 29న జరపతలపెట్టిన సభను విరమించుకుంటున్నాం. జూలైలో కాపు సంఘాలు ఒక సమావేశం నిర్వహించనున్నాయి. దానికి రాష్ట్రంలోని అన్ని కాపు సంఘాలు హాజరయి ప్రతిపాదనలివ్వాలి. దానిని పరిశీలించి, అందులో కొన్నిటిని ప్రభుత్వానికి పంపుదాం. ప్రభుత్వం కూడా అన్నీ ఒకేసారి పరిష్కరించలేదు కాబట్టి కొంత సమయం ఇద్దాం’ అన్నారు.
అందుకు స్పందించిన ఎంపి సానా సతీష్.. వచ్చే నెలలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ అపాయింట్‌మెంట్ తీసుకుని కాపు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ ‘‘ గత ఎన్నికల ముందు టీడీపీ,జనసేనపై ఉన్న ఊపు ఇప్పుడు మన కులంలో కనిపించడం లేదు. నాటి ఆవేశం కూడా పోయింది. మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.ఇ దీనికి కారణం ఏమిటి? ఎవరన్నది ఆలోచించాలి. నేను చెబితే బాగుండదు. మేం ఏ కులంతో ఘర్షణ కోరుకోవడం లేదు. మా వాటా మాకివ్వాలని మాత్రమే అడుగుతున్నాం. మరాఠాల తరహాలో మాకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఉండదనుకుంటున్నాం. దానిపై ఎంపి సానా సతీష్ సానుకూలంగా స్పందించారు. ఆయనపై గౌరవంతోనే 29 నాటి సభను వాయిదా వేస్తున్నాం. మాకు అంతిమంగా కావలసింది కాపు జాతి ప్రయోజనాలే.దీనిపై ఎలాంటి రాజీలేద’’ని నాగేంద్రబాబు స్పష్టం చేశారు.
‘‘జనసేన ఎమ్మెల్యేలు కాపుల ఓట్లతోనే గెలిచారు. కానీ వాళ్లు వేరే భ్రమల్లో ఉన్నారు. కాపుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకంతోనే కాపులు గత ఎన్నికల్లో జనసేనను గెలిపించారు. కానీ జనసేన ఎమ్లెల్యేలు మాత్రం, తమను చూసే గెలిచారనుకుంటున్నారు. కాపుల సత్తా చాటేందుకు ఉన్న అన్ని అవకాశాలు వాడకుందాం’’ అని నాగేంద్ర వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో.. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ జోక్యం- రాయబారంతో, ఈనెల 29న విజయవాడలో జరపతలపెట్టిన కాపురిజర్వేషన్ పోరాట సమితి సభ వాయిదా పడింది. ఒకవేళ సానా సతీష్ రంగంలోకి దిగకపోయి ఉంటే, 29 తర్వాత కాపులు రోడ్డెక్కేవారే. ఆ రకంగా కూటమి సర్కారును, కాపు కల్లోలం నుంచి ఎంపి సానా సతీష్ తాత్కాలికంగా గట్టెక్కించడంతో టీడీపీ నాయకత్వం హాయిగా ఊపిరిపీల్చుకుంది.