Suryaa.co.in

Telangana

అధికారం కాపాడుకొనేందుకు భాజపాతో కేసీఆర్‌ దోస్తీ: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భాజపా నాయకులు డమ్మీలుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం దిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రాజాసింగ్‌కు భాజపాలోనే విలువలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఫిర్యాదులు సర్వసాధారణమని.. ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణకు అన్యాయం చేశారు: మల్లు రవి
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు కోసం తెలంగాణ బిల్లులో పెట్టారని.. ఏడేళ్లల్లో వాటి ఏర్పాటు కోసం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ చేస్తే ఎంతో మంది దళిత గిరిజనులకు న్యాయం జరిగేదన్నారు. కేసీఆర్ వారం రోజుల నుంచి దిల్లీలో ఉన్నారని.. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చి ఈ పనులు ఎందుకు చేయలేదని మల్లు రవి నిలదీశారు. ఈ విషయాలపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE