Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ తర్వాతే నాకు కులమైనా,మతమైనా,రాజకీయాలైనా

– 420 గాళ్ళను ఎండగడితే కులంపై దాడి చేసినట్టా
– చంద్రబాబు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే
– వాళ్ళ డైరెక్షన్ మేనేజర్ లా పనిచేస్తున్న బాబు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 24: సీఎం జగన్మోహనరెడ్డి తర్వాతే తనకు కులమైనా, మతమైనా, రాజకీయాలైనా, ఇంకేదైనా అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. ప్రముఖ మీడియా ఛానల్స్ కు మంత్రి కొడాలి నాని ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని చెప్పారు. ఆయనే బతికి ఉంటే సమైక్యంగా ఉన్న రాష్ట్రం రెండుగా అయ్యేది కాదన్నారు. వైఎస్సార్ మరణంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. అదృష్టవశాత్తూ ఉన్నత భావాలు కల్గిన, 24 గంటలూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉండే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కులాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడి అవసరం రాష్ట్రానికి, ప్రజలకు ఉందని చెప్పారు. దగ్గర నుండి చూశానని, జగన్మోహనరెడ్డి కోసం తనకు కులం, మతం అవసరం లేదన్నారు. జగన్ నాలుగు కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే అంతే చాలని, అందుకోసమే పనిచేస్తానని, కులం కోసం పనిచేయనని చెప్పారు.

సీఎం జగన్మోహనరెడ్డిని పతనం చేయాలని చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళంతా 420 గాళ్ళని ప్రజలకు పదేపదే చెబుతుండడం కులంపై దాడి చేసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డిని కూలదోసి తడికె లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నిస్తున్నారని, వీళ్ళు చేసే నీచపు కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తుంటే పనికిమాలిన వాళ్ళతో డిబేట్లు పెట్టించి తనను టార్గెట్ చేస్తూ తిట్టిస్తుండడం వల్లే చంద్రబాబు 420 పనులను ఎండగడుతున్నానని చెప్పారు.

గతిలేక, వేరే పార్టీలేక కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వెనకే ట్రావెల్ అవుతున్నారన్నారు. కమ్మ సామాజిక వర్గంపై చంద్రబాబు , రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ప్రేమ లేదన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు చందాలు పోగు చేసుకునే పనిలో ఉంటారన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలో ఉంటే వీళ్ళ ఆటలు సాగవని తెలుసన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అతన్ని తడికలా అడ్డం పెట్టుకుని బ్రోకర్ పనులు చేసుకోవచ్చని అనుకుంటున్నారన్నారు.

వీళ్ళ నిజ స్వరూపాన్ని తెలుసుకుని ఆ సామాజిక వర్గమే మూతి పళ్ళు రాలగొడుతుందన్నారు. చంద్రబాబుకు 40 ఏళ్ళ అనుభవం ఉన్నా ఆయన కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. అల్జీమర్స్ తో బాధపడుతున్న చంద్రబాబు ఇంటి దగ్గర కూర్చోవాలన్నారు. లోకేష్ ను పెట్టి టీడీపీని నడపలేనన్న నిర్ణయానికి వచ్చాడన్నారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడులకు అప్పజెప్పి వాళ్ళ డైరెక్షన్లో మేనేజర్ లా చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు.

LEAVE A RESPONSE