కా‘రణ’ జన్ముడు.. కోడెల

– కుటుంబమే .. బలహీనత
– కోడెల మరణం ప్రతి తండ్రి-కొడుకులకూ ఒక హెచ్చరిక సందేశం
– ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనత వరకూ
– పల్నాడుకు ఆయనో చిరునామా
– కోడెల వారసులను వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు
– వారసులకు అక్కరకు రాని కోడెల మృతి సానుభూతి
– మాకొద్దంటున్న సత్తెనపల్లి తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రతి తండ్రీ ఒక ధృతరాష్ర్టుడే. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకు దివంగత పోరాటయోద్ధ , మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా మినహాయింపు కాదు. దశాబ్దాల పాటు పల్నాటి పౌరుషానికి చిరునామాగా నిలిచిన కోడెల ఆత్మహత్య, ఆయన అభిమానులకు ఇప్పటికీ రుచించని చేదువార్త.

పల్నాటి పులిగా జేజేలు అందుకున్న ఆయన.. ఒక విషాద పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడటాన్ని, ఆయన అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఒక సాహసికుడు, నియోజకవర్గం అభివృద్ధి కావాలనుకునే స్వాప్నికుడు, అత్యంత విషాదకర పరిస్థితిలో.. తన జీవితానికి తానే చరమగీతం పలకడం కలలో ఊహించని పరిణామం.

డాక్టర్ కోడెలకు నర్సరావుపేట గుంటూరు రోడ్‌లో.. తన కూతురిపేరిట లక్ష్మీ నర్శింగ్ హోం ఆసుపత్రి ప్రారంభించినప్పటి రోజుల్లో, హస్తవాసి ఉన్న వైద్యుడిగా మంచి పేరు. చేతిలో డబ్బులేని రోగులకు చికిత్స అందించి, ప్రయాణ ఖర్చులకు డబ్బులిచ్చి పంపిన మానవతా వాదిగా మంచిపేరు. అదే ఆయనను ఎన్టీఆర్‌ను ఆకర్షించి, టికెట్ ఇచ్చేలా చేసింది.

నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆ నియోజకవర్గానికి మహర్జాతకం పట్టింది. కోడెల ఏ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల నుంచి ప్రత్యేకంగా జీఓలు వచ్చేవి. ప్రతి మంత్రిని నియోజకవర్గానికి తీసుకువచ్చి, నిధులు తీసుకువచ్చేవారు. ఆ రకంగా మంచినీటి కష్టంతో మగ్గిన నర్సరావుపేటకు, ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రావిటీతో నీరు తెప్పించిన భగీరధుడు కోడెల. ఏ శాఖలో పనిచేసినా, దానిపై ఆయన ముద్ర సుస్పష్టం. ఉదయమే లేచి పట్టణంలో తిరగడం ఆయన వ్యసనం.

జర్నలిస్టుగా నేను తొలుత ఆయనపై వ్యతిరేక వార్తలతోనే ఆయన పరిచయం. నర్సరావుపేట ద్విశాబ్ది ఉత్సవాల సందర్భంలో.. జర్నలిస్టులకు ఆయనిచ్చిన క్లాసులు గానీ, కోటప్పకొండ జాతరలో ఆయన నిర్వహించిన అధికారుల సమీక్షపైగానీ, నాటి మంత్రి పెదరత్తయ్య నర్సరావుపేట పర్యటనలో ఆంతర్యం గానీ నేను రాసిన వ్యతిరేక కథనాలు.. కోడెలలో కోపం తెప్పించినా.. నిభాయించుకుని, నన్ను పిలిచి నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధిని వివరించేలా చేశాయి.

కానీ అభివృద్ధి వేరు-రాజకీయాలు వేరన్నది అప్పటి నా వాదన. దీనికి అప్పట్లో ఆంధ్రప్రభ కరస్పాండెంట్‌గా ఉన్న వేదాంతం అంజనీకుమార్, ఇప్పటి విశాలాంధ్ర జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రమేష్ ప్రత్యక్ష సాక్షులు. కాలగమనంలో.. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తొలి అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ సెక్రటరీగా నన్ను నియమించారు. అది వేరే కథ.

దూకుడుకు మారుపేరైన కోడెల, ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. తన మాట చెల్లుబాటుకాకపోతే, తన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ధర్నాలకు దిగేవారు. ఇష్టం లేకపోతే ఎవరితోనూ మాట్లాడకపోవడం ఆయన నైజం. రాజకీయ అంశాల్లో కఠినంగా ఉండే కోడెల, నరసరావుపేట అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేవారు. తన రాజకీయ ప్రత్యర్ధి కాసు కృష్ణారెడ్డిని సైతం, ఇంటికెళ్లి మరీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేవారు.

నర్సరావుపేట కేంద్రంగా దశాబ్దాలపాటు, రాజకీయాలను శాసించిన కోడెల సత్తెనపల్లికి మారటం, ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. అప్పటివరకూ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ, ఆయనను అడిగి నిర్ణయం తీసుకోవలసిందే. ఆయనంటే వారికి భయం, గౌరవం కూడా.

అయితే సత్తెనపల్లికి మారిన తర్వాత, పార్టీ నాయకత్వంలో ఆయనపై ఉన్న భయం-గౌరవం పోయింది. కారణం. కుటుంబసభ్యుల ప్రవర్తన! బంగారు బాతుగుడ్డును వాడుకోవడం ఒక విద్య. తెగనమ్మడం అత్యాశ. ఆ అత్యాశే దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కోడెల ఇమేజీని డ్యామేజీ చేసింది. కుటుంబ కక్కుర్తి ఒక పోరాట యోద్ధ సాధించుకున్న క్రేజ్‌ను మింగేసింది. ఆయన కష్టపడి ప్రత్యర్ధులతో పోరాడి సాధించుకున్న హీరో ఇమేజ్‌ను, కేవలం ఐదేళ్లలో జీరోని చేసింది. తమ స్వార్ధానికి ఆయనను బలిచేసిందన్నది జనాభిప్రాయం. ఆయన ఇమేజిని పోటీలుపడి, తాకట్టు పెట్టిందన్నది ఇప్పటికీ కోడెల అభిమానుల ఆవేదన.

అప్పటికే చేతికందివచ్చిన ఒక కొడుకు దూరమైన వేదనలో ఉన్న కోడెల, మరో కొడుకు కోసం తాను కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ను, త్యాగం చేశారన్నది ఆయన అభిమానుల అభిప్రాయం. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రభుత్వం.. స్పీకర్ ఆఫీసులోని ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లిన, ఆయన కుటుంబసభ్యుల బాగోతాన్ని బయటపెట్టింది. కుటుంబానికి చెందిన బిల్డింగులో అద్దెకు ఇచ్చిన శాఖల వ్యవహారాన్ని రచ్చ చేసింది.

ఫలితంగా.. అప్పటివరకూ రారాజుగా వెలిగిన కోడెల, బయటకు వచ్చి ఎవరికీ ముఖం చూపించుకోలేని దయనీయం. మరోవైపు పుత్రరత్నం శివరాంపై కేసులపై కేసులు. వంగి మరీ సలాము కొట్టిన వారే ముఖం చాటేసిన దుస్థితి. అధికారంలో ఉండగా సంపాదించిన ఆస్తులపై జగన్ సర్కారు కన్ను. ఏరికోరి నిర్మించుకున్న సేఫ్ కంపెనీ, పరాయివారి పాలైన వారి వైనం.

ఒకవైపు తాను కష్టపడి సంపాదించుకున్న ఇమేజీని, పోటీలుపడి మరీ డామేజీ చేసిన కుటుంబసభ్యులను ఏమీ అనలేక.. మరోవైపు పాతాళానికి పోయిన తన గౌరవాన్ని చూసి తట్టుకోలేక.. ఇంకోవైపు వెపు వ్యక్తిగత సమస్యలు.. కలసి వెరసి ఓ పోరాట యోధుడిని ఉరితాడు వైపు నడిపించి, జీవితాన్ని ముగించుకునే విషాద పరిస్థితి నెట్టివేశాయి. కోడెల ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు, ఆపరేషన్ చేయించుకున్న నన్ను ఇంటికి వచ్చి మరీ పరామర్శించిన వైనం ఇంకా గుర్తు.

సహజంగా పార్టీని, సమాజాన్ని ప్రభావితం చేసిన నేతల వారసులకు, వారి మరణాంతరం గౌరవం-గుర్తింపు ఉంటుంది. కోడెల వంటి బలమైన నేత వారసులకయితే, ఆయన మరణాంతరం అంతకు రెట్టింపు ఆదరణ ఉండాలి. కానీ కోడెల వారసులకు ప్రజల్లో ఎక్కడా ఆదరణ లేదు. పైగా ప్రతిఘటన, పోటీ.

కోడెల గారి వారసులన్న సానుభూతి ఎవరికీ లేదు. కోడెల కుటుంబానికి న్యాయం చేయాలని అడిగే గొంతు లేదు. పైగా వాళ్లు మాకొద్దని పార్టీ ఆఫీసులోనే ధర్నాలు చేసే వైచిత్రి. వారి బాధితులు నాటి బాధలు ఇంకా మర్చిపోకపోవడమే దానికి కారణం. అధికారం అనేది ఒక మత్తు. ఆ మత్తు అహంకారం-అత్యాశ దిశగా నడిపిస్తుంది. అది తెలుసుకుని అడుగులేసే వారే స్థిత ప్రజ్ఞులు.

కోడెల జీవితం రాజకీయాల్లో ఉన్న ప్రతి తండ్రికీ.. రాజకీయాల్లో ఉన్న- రాజకీయాల్లో రావాలనుకునే ప్రతి కొడుకులకూ ఒక హెచ్చరిక సంకేతం. తండ్రుల ఇమేజీని డామేజీ చేస్తే వచ్చే నష్టాలు-లాభాలేమిటన్నది కోడెల జీవితం ఒక గుణపాఠం. రాజకీయాల్లో వారసుల చేష్టల వలన వచ్చే లాభనష్టాలేమిటన్నది కోడెల కుటుంబమే ఒక హెచ్చరిక. తండ్రులను అమ్ముకునే వారి జీవితాలు.. నమ్ముకునే వారి జీవితాలు ఎలా ఉంటాయన్నది దానికి కోడెల విషాద మరణం ఓ గుణపాఠం.

రాజకీయ నేతగా కోడెల మహోన్నతుడు. ఒక యోధుడు. కానీ ఓ తండ్రిగా విఫలనేత. కుటుంబ బలహీనతలు అధిగమించలేని సగటు తండ్రి. రాజకీయాల్లో తిరుగులేని స్ధాయికి చేరిన నేతలకు, కోడెల జీవితం ఓ హెచ్చరిక సంకేతం. కుటుంబంపై ప్రేమతో.. కష్టపడి సాధించుకున్న రాజకీయ చరిత్రను త్యాగం చేస్తే, మిగిలేది విషాదమే. ఇది కోడెల ఒక్కరికే కాదు. ప్రతి తండ్రికీ వర్తించే సూత్రం.

Leave a Reply