రజనీపై రాగింగ్.. రైటా? రాంగా?

– బజారుభాష వైసీపీకి శోభనిస్తుందా?
– ఎన్టీఆర్-చంద్రబాబుపై పొగడ్తలే తలైవా చేసిన నేరమా?
– జగనన్నను పల్లెత్తు మాట అనని రజనీకాంత్
– టీడీపీ కూడా పొగడని తలైవా
– హైదరాబాద్ అభివృద్ధి గురించే ప్రస్తావన
– చంద్రబాబు గెలవాలన్న ఆకాంక్షకే అంతేసి రచ్చనా?
– రజనీ వ్యక్తిత్వంపై వైసీపీ విరుచుకుపడటం ఎందుకో?
– రజనీ ప్రాపపం కోసం అగ్రనేతలు ఆరాటపడే స్థాయి
– బజారుభాషతో పరువుపోగొట్టుకున్న వైసీపీ
– నేతలపై నియంత్రణ కరవైన దుస్థితి
– బూతులపార్టీ అన్న ముద్రతో తటస్థులు, మర్యాదస్తుల్లో పార్టీపై ఏహ్య భావం
– సమాజం ఏమనుకుంటోందో అని కూడా ఆలోచించే పరిస్థితి లేని బేఫర్వా
– ప్రత్యర్ధులను బూతులు తిడితే వైసీపీ నాయకత్వం సంతోషిస్తుందన్న సంకేతాలు
– ఆ లెక్కన వైసీపీలో మర్యాదస్తులే లేరా?
– రజనీకాంత్‌ను ట్రోల్ చేస్తున్న వైనంపై సిగ్గుపడుతున్న సోషల్‌మీడియా
– ఇప్పటికీ స్పందించని వైసీపీ అధినేత జగనన్న
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘విడిచేసింది వీధికి పెద్ద అని’ అంటాడు చింతామణిలో సుబ్బిశెట్టి. ఇప్పుడు ఏపీలో దిగజారుడు రాజకీయాలు చూస్తే, పాత చింతామణి నాటకం గుర్తుకురాకమానదు. అసలు సోషల్‌మీడియానే ఒక బూతు. అలాంటి సోషల్ మీడియా కూడా.. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై, వైసీపీ సోషల్‌మీడియా సైన్యంతోపాటు.. వైసీపీ నేతలు ప్రయోగిస్తున్న బజారుభాషపై సిగ్గుతో చితికిపోతోంది. సుత్తిలేకుండా, సూటిగా చెప్పాలంటే.. సోషల్‌మీడియా కూడా వైసీపీ సైనికుల ట్రోలింగుతో సిగ్గుపడుతోంది.

ఇప్పటికీ సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ పిలుపే ప్రభం‘జనం’. ఆయనకు వివాదరహితుడన్న పేరు. గొప్ప మానవతావాది. వివాదాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేకనే.. రాజకీయ పార్టీకి సిద్ధమైన రజనీ, చివరి క్షణంలో మనసు మార్చుకుని, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమిళనాడు సీఎం జయలలిత నివసించే పోయస్‌గార్డెన్‌లోనే ఉండే రజనీ, ఆమె అహంకారానికి గురయ్యారు. అయినా ఆమెను పల్లెత్తు మాట అనని మౌని ఆయన.

కాకపోతే ఆమెకు తానేంటో చూపించాలనుకున్నారు. అంతే. కారులో ఉన్న రజనీ, హటాత్తుగా కిందకు నడుచుకుంటూ వెళితే రోడ్లు స్తంభించిపోయాయి. జయలిలితకు షాక్. అప్పుడు తెలిసింది తలైవికి.. తలైవా పవరేంటో! ఆ తర్వాత రజనీతో సఖ్యతగా ఉన్నారు. అది వేరే విషయం. అంత పవర్‌ఫుల్ హీరోను వైసీపీ నేతలు లేకితనంతో చేస్తున్న విమర్శలు, సభ్య సమాజాన్ని అధికార పార్టీని ఈసడించుకునే పరిస్థితికి చేర్చాయి. ఇది మనం మనుషులం అన్నంత నిజం!

పూర్వాశ్రమంలో రజనీ.. మరీ అంత మౌని అనుకుంటే పొరబాటు. బాగా జోష్ ఉన్న రోజుల్లో, బేగంపేట ఎయిర్‌పోర్టు అద్దాలు పగులకొట్టిన ఫైర్‌బ్రాండ్ ఆయన. క్రమశిక్షణ లేని రజనీ జీవితం, చాలామంది సినీతారలకు హడలకొట్టేది. తర్వాత ఆయనకు జీవితంలో, క్రమశిక్షణ ప్రాధాన్యం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. వేటగాడైన వాల్మీకి, తర్వాత రుషి అయినట్లు.. రజనీ కూడా యోగిలా మారారు. దానికి కారణాలు అనేకం. అది అప్రస్తుతం.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కార్యాలయ జాతీయ సమన్వయకర్త టిడి జనార్దన్ నాయకత్వంలో ఆ మేరకు ఒక కమిటీ వేశారు. మేధావులను అందులో చేర్చారు. అంతా కలసి కసరత్తు చేసి, తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను భావి తరాలకు అందించే ప్రయత్నం ప్రారంభించారు. పుస్తకం ముద్రించాలని నిర్ణయించారు. అందుకు అంకురార్పణగా.. విజయవాడ కేంద్రంగా ఒక సభ నిర్వహించారు.

దానికి సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆహ్వానించారు. ఇటీవలి కాలంలో రాజకీయాల గురించి మాట్లాడని తలైవా.. ఆ సభలో తన మనసులో మాట బయటపెట్టారు. దివంగత మహానేత ఎన్టీఆర్ గొప్పతనం గురించి ప్రస్తావించారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి గుర్తు చేశారు. నిజానికి కేటీఆర్ సైతం హైదరాబాద్ అభివృద్థి, ఐటీలో ప్రగతిలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ సైతం.. చంద్రబాబు కృషిని మెచ్చుకున్నారు.

చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. ఏపీ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని జోస్యం చెప్పారు. తన ఆప్తమిత్రుడైన మోహన్‌బాబు వల్ల.. చంద్రబాబు పరిచయం అయ్యారన్న పాత విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో రజనీకాంత్ ఎలాంటి హద్దు దాటలేదని, బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. తన మనసులో ఉన్న మాట ఆయన ఆవిష్కరించారంతే!

అయితే వైసీపీ తీర్ధం తీసుకున్న మోహన్‌బాబు.. ఇప్పటివరకూ తన ప్రాణస్నేహితుడైన రజనీకాంత్‌ను, అదే తన పార్టీ నేతలు బజారుభాషతో తిడుతున్నా మౌనంగా ఉన్నారు. మరి అదేం స్నేహమో మంచువారే సెలవివ్వాలి? తన మిత్రుడిని తన పార్టీ నేతలు అంత అనాగరిక బజారు భాష వాడుతున్నా, తనకేం పట్టనట్లు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఆయనే సెలవివ్వాలి. అది వేరే విషయం.

నిజానికి రజనీకాంత్ ప్రసంగాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఆయన ఎవరినీ విమర్శించలేదు. ఎవరి మనసూ నొప్పించలేదు. ఎవరినీ మాటలతో గాయపరచలేదు. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగనన్నను, తలైవా పల్లెత్తు మాట అనలేదు. ఆయన పాలన గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అప్పుల పాలన గురించి మాట్లాడలేదు. టీడీపీ మాదిరిగా బాబాయ్ హత్య గురించి ప్రస్తావించలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ప్రశ్నించలేదు.

కానీ, అది వైసీపీ గ్యాంగ్‌కు ఏవిధంగా నష్టం-ఇబ్బంది అనిపించిందో తెలియదు. ఒక కొడాలి నాని, ఇంకో రోజా, మరో దాడిశెట్టి రాజా.. మరో పోసాని.. వీరు కాకుండా వైసీపీ సోషల్‌మీడియా మూకుమ్మడిగా, రజనీకాంత్‌పై మాటల దాడి ప్రారంభించడమే ఆశ్చర్యం. మంత్రిగా పనిచేసిన కొడాలి నాని అయితే.. రజనీకాంత్‌ను వ్యక్తిగతంగా దూషించిన వైనం, వైసీపీని ఆరాధకులకు సైతం అసహ్యం ఏర్పడేలా చేసింది.

ఒక సినిమాకు కాల్షీట్లు ఇస్తే చాలనకునే వందలమంది నిర్మాతలు.. రజనీ ఒక్కసారి తమతో మాట్లాడితే చాలనుకునే కోట్లాదిమంది అభిమానులున్న తలైవాను.. కొడాలి నాని బజారుభాషతో తిట్టిపోస్తే.. రాజకీయంగా ైవె సీపీ ప్రతిష్ఠ, వ్యక్తిగతంగా జగనన్న ఇమేజ్ పెరుగుతుందనుకుంటే.. అలాంటి ‘అలౌకిక ఆనందాన్ని’ ఎవరూ అడ్డుకోరు. అది వైసీపీ విజ్ఞతకే వదిలేయాల్సిందే.

రజనీకాంత్‌పై వైసీపీ నేతలు బజారుభాష వాడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా.. ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి నియంత్రణ-స్పందన లేదు. అంటే… అలాంటి బజారు భాషను ఆ పార్టీ నాయకత్వం ఆస్వాదిస్తుందన్న విషయం, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. పైగా ఆ పార్టీలో మర్యాదస్తులు ఎవరూ లేరని, సర్దుబాటు-దిద్దుబాటుకు దిగే నాయకులెవరూ లేరని స్పష్టమవుతుంది.

పైగా బూతులు తిడితే.. సంతోషించే బాపతు నాయకులే వైసీపీలో ఉన్నారన్న సంకేతం ఇచ్చినట్టయింది. మరి ఇది తటస్తులు-విద్యావంతులు-మేధావుల్లో జగన న్నపై గౌరవం పెంచుతుందా? తుంచుతుందా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. సహజంగా ఏ రాష్ట్రంలోనయినా అన్ని పార్టీలకు సానుభూతిపరులు, కార్యకర్తలు ఉంటారు. వారు తమ నాయకులు ఏం మాట్లాడినా తెగ సంతోషిస్తారు.

కానీ.. ఏ పార్టీకి చెందని తటస్ధ వర్గం ఒకటుంటుంది. వారిపై మీడియా, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఈ వర్గం ఆయా కాలంలో జరిగే పరిణామాలను మౌనంగా పరిశీలించి, ఎన్నికల్లో తీర్పు ఇస్తుంది. నిజానికి పోలింగ్ సమయంలో వారే కీలకం. కీలకమే కాదు. ఆ వర్గం ప్రమాదం కూడా. అది గ్రహించిన వారే తెలివైన వారు. అలాంటి తెలివి తమ పార్టీకి కొరవడిందన్నది వైసీపీ నేతల ఆవేదన.

ఆ పార్టీ నాయకత్వం మౌనం బట్టి.. కొందరు నాయకులను, కొందరిని బూతులు తిట్టడానికే ప్రయోగిస్తున్నారని నిరక్షరాస్యులకూ అర్ధమవుతుంది. తన ప్రత్యర్ధులను బూతులు తిట్టించడానికే వారి వ్యక్తిత్వాన్ని బలిపశువుగా మారుస్తున్నారని మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. చివరకు సిల్క్‌స్మిత ఆత్మహత్యకూ-రజనీకాంత్‌కూ ముడిపెట్టిన వైసీపీ సోషల్‌మీడియా సైనికుల అనైతిక ఆనందాన్ని.. ఆ పార్టీ పెద్దలు ఆనందంతో ఆస్వాదిస్తున్నారంటే, రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో సుస్పష్టం.

కొద్దికాలం క్రితం హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో, తెలంగాణ టీడీపీ సభ జరుగుతోంది. తెలంగాణ టీడీపీ ఫైర్‌బ్రాండ్, ఉస్మానియా సీమటపాకాయ్ నన్నూరి నర్శిరెడ్డి ప్రసంగిస్తున్నారు. అలుపు లేకుండా, ప్రాసలతో ప్రత్యర్ధులపై మాటల బాంబులు వేసే నర్శిరెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాటల యుద్ధం మొదలుపెట్టారు. కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారు. వెంటనే చంద్రబాబు అతడిని వారించారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఆ తర్వాత అదే ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న నర్శిరెడ్డి నుంచి కేసీఆర్‌పై విమర్శలు లేవు.

అంతకంటే ముందు.. కేసీఆర్‌ను రాత్రి బారు-పగలు దర్బార్ అని విమర్శించిన రోజా.. నాటి సీఎం వైఎస్‌పై తొడగొట్టారు. నువ్వు మొగాడివైతే.. మీసం ఉన్నోడివైతే అని రెచ్చిపోయారు. వెంటనే బాబు స్పందించి, వ్యక్తిగతంగా ఎవరినీ దూషించవద్దని మందలించారు. విభజిత ఏపీలోనయినా.. తెలంగాణ రాష్ట్రంలోనయినా ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ హుందాతనం ఉందా? అన్నదే ప్రశ్న.

ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థిని, ఎవరెన్ని బూతులు తిడితే అన్ని మార్కులు. ఎవరెంత వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారు గొప్ప. ఇదీ ఇప్పటి పొలిటికల్ ట్రెండ్! బహుశా ఇంత ఛండాలపు రాజకీయాలు.. ఏపీలో రాజ్యమేలుతున్నాయని రజనీకాంత్‌కు తెలిస్తే, ఆయన రాజకీయాల గురించి మాట్లాడేవారే కాదేమో?! ఏపీలో ఇంత బజారుభాష ‘అధికారభాష’గా వర్ధిల్లుతుందని తెలిస్తే పెదవి విప్పేవారు కాదేమో?! ఆంధ్రాలో ఇంత నేలబారు-చౌకబారు రాజకీయాలు చేసేవారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నారని తెలిస్తే, అసలు విజయవాడకే వచ్చేవారు కాదేమో?! ఇంత లేకి సంస్కృతి, ఇంత లేకి మనుషులు ఆంధ్రాలో ఉన్నారంటే.. అసలు రజనీకాంత్ ఆంధ్రాలోనే కాలు పెట్టేవారు కారేమో?!

అయితే..తలైవాపై వైసీపీ దళాలు నోరుపారేసుకుంటున్నా.. అటు తెలుగుసినీ పరిశ్రమ పెద్దలని చెప్పుకునే ప్రముఖులు, ఇటు ఆంధ్రా మేధావులు స్పందించకుండా.. రజనీ జిగిరీ దోస్తునని గొప్పగా చెప్పుకునే మోహన్‌బాబు సహా అంతా, నవరంధ్రాలు మూసుకున్నప్పటికీ.. స్వాభిమానం ఉన్న తమిళులు, విశ్వవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మాత్రం, ఎదురుదాడి చేయటమే ఈ ఎపిసోడ్ ప్రత్యేకత.
జగనన్న సంగతి వచ్చే ఎన్నికల్లో చూస్తామని కొందరు.. మీది బూతుల పార్టీ అని ఇంకొందరు.. వచ్చే ఎన్నికల్లో నగరిలో రోజా సంగతి చూస్తామని మరికొందరు.. మీ బజారుపార్టీ నుంచి బజారు భాష తప్ప, మరొకటి ఏముంటుందని ఇంకొందరు.. బూతుల పార్టీకి ఓట్లేసిన ఆంధ్రా ఓటర్లకు జోహార్లు అని మరికొందరు.. జగనన్నను తలైవా పల్లెత్తుమాట అనలేదు కదా? మరి మీకేం నొప్పి? అని మరికొందరు .. పందులే గుంపులుగా వస్తాయ్. సింహం సింగిల్‌గా వస్తుందని ఇంకొందరు.. లేకి పార్టీకి లేకి ఆలోచనలు తప్ప ఇంకేం వస్తాయి అంటూ.. వైసీపీ సోషల్‌మీడియా దళంపై , తలైవా అభిమానులు ఎదురుదాడి ప్రారంభించారు.

నటి కమ్ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో, తమిళుల సంఖ్యే ఎక్కువట. మరి తమిళ తంబిల ఆగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూడాలి. అంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రోజక్కకు ప్రమాదం తెచ్చిపెట్టిన ట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రజనీతో రోజా నటించిన చిత్రాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా, తలైవా అభిమానులు సోషల్‌మీడియాలో పెడుతున్నారు. ఏం చేస్తాం? ఎవరి ఆనందం వారిది మరి!

దానికి తగినట్లు గ్రాఫిక్స్ కూడా రూపొందించారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు.. అదే సోషల్‌మీడియా వేదికగా వైసీపీని, లేకిపార్టీగా ముద్రవేశారు. అదీ సంగతి! అది న్యాయమా? అన్యాయమా? నైతికమా? అనైతికమా? రాజకీయమా? అరాజకీయమా? నేలబారు-నేల టిక్కెట్టు రాజకీయమా? హుందాతనపు రాజకీయమా? అసలు ఈ ఎపిసోడ్‌లో రజనీకాంత్ బాధితుడా? అన్నది ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం.

Leave a Reply