నర్సాపురం : సీఎం జగన్ ను, నర్సాపురం ఎమ్మెల్యే గా ముదునూరి ప్రసాదరాజు ను గెలిపించి నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. నర్సాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం జె.ఏ.సి.ఆధ్వర్యంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీ అనంతరం నిరసన దీక్షలో కొత్తపల్లి చెప్పుతో కొట్టుకోవడం తో ప్రజలు ఆశ్చర్యం లో మునిగిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఘటనతో నర్సాపురం నియోజకవర్గంలోని వైసీపీ వర్గాల మధ్య ఉన్న విబేధాలు బట్టబయలయ్యాయి. కాగా, సుబ్బారాయుడు తీరుపై ఎమ్మెల్యే ప్రసాదరాజు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మెజారిటీ వైసీపీ కార్యకర్తలు
మాత్రం సుబ్బారాయుడు ఆవేదన, ఆగ్రహంలో వాస్తవం ఉందంటున్నారు. ప్రసాదరాజు వల్ల తమ పార్టీకిగానీ, నియోజకవర్గానికి గానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. గత ఎన్నికల్లో సుబ్బారాయుడు వల్లే ప్రసాదరాజు విజయం సాధించారని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. నర్సాపురం కేంద్రాన్ని జిల్లాగా ప్రకటింపచేయడంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయినందుకే, సుబ్బారాయుడు బయటకు రావలసివచ్చిందని చెబుతున్నారు.