కేంద్ర పధకాల రద్దు యోచన అవివేకం..అనర్ధ దాయకం

– ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన నిధులు చెల్లించలేని ఆర్ధిక దుస్థితి కారణంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల అమలును రాష్ట్రంలో నిలుపుదల చేయాలనీ జగన్ ప్రభుత్వం నిర్ణయించడం అవివేకం, అనర్థదాయకం అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం ఏటా రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20వేల కోట్ల రూపాయల వరకు నష్ట పోతుందన్నారు. ఇప్పటికే కడప,-మదనపల్లి-బెంగుళూరు , కోటిపల్లి-నరసాపురం, శ్రీకాళహస్తి-నడికుడి తదితర కొత్త రైలు మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన నిధులను చెల్లించని కారణంగా ఆ రైల్వే ప్రాజెక్టులు నిలిచి పోయాయని ఆరోపించారు. ఉపాధి హామీ పధకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన , మధ్యాహ్న భోజన పధకం ..ఇలా దాదాపు 130 కేంద్ర ప్రాయోజిత పధకాలు ఉన్నాయని, వీటిలో చాలా వాటికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వదని, దీని వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని తులసి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, రాష్ట్ర వాటా నిధులను ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలనీ తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

వార్డు కార్యదర్సులకు మరుగు దొడ్ల డ్యూటీలా ? : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు కార్యదర్సులను మరుగు దొడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం శోచనీయమని తులసి రెడ్డి అన్నారు. వెంటనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply