-నెల్లూరు జిల్లాకు తీరని ద్రోహం
-ఈ నెలాఖరుకే కంటైనర్ టెర్మినల్ మూతవేసేందుకు సన్నాహాలు
-ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోబోతున్న 10 వేల మంది
-ఏడాదికి రూ.1000 కోట్ల స్టేట్ టాక్స్ కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం
-ఇక కృష్టపట్నం పోర్టులో మిగిలేది డర్టీ కార్గో మాత్రమే
-ఇంత ఘోరమైన నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం
-రైతుల త్యాగంతో ఏర్పాటైన కృష్ణపట్నం పోర్టును కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నాం
నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనది కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్.దేశంలో 12 ప్రధాన పోర్టులుంటే, వాటిలో టాప్ లో ఉన్న చెన్నై, విశాఖ, ముంబై పోర్టులతో పోటీపడుతోంది ఈ టెర్మినల్. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ టెర్మినల్ జనవరి నెలాఖరుతో మూతపడిపోతుండటం దురదృష్టకరం. కృష్ణపట్నం పోర్టు కంపెనీ నుంచి అదానీ చేతుల్లోకి పోర్టు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం.
ఈ పోర్టు నుంచి కొలంబో, అమెరికా, షాంగై, సింగపూర్ లకు ఎగుమతులు జరుగుతుండగా, చైనా, మలేషియా, యూఏఈ, దుబాయ్, థాయ్ లాండ్ నుంచి దిగుమతులు జరుగుతున్నాయి.ప్రధానంగా బియ్యం, పొగాకు, గుంటూరు మిర్చి, పత్తి, క్వార్ట్జ్, రొయ్యల తదితర ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. శ్రీసిటీలోని మోటారు పరిశ్రమలకు సంబంధించిన పరికరాలతో పాటు పేపర్ రోల్స్, వైట్ సిమెంట్, సోలార్ ప్యానెల్స్, ఫర్నీచర్, ఎల్ఈడీ లైట్లు, ఫర్నీచర్, ముడి పామాయిల్, కెమికల్స్ దిగుమతి అవుతున్నాయి.
2014-19 మధ్యకాలంలో ఏడాదికి 6 లక్షల కంటైనర్లు ఎగుమతులు, దిగుమతులు జరగ్గా, టర్నోవర్ రూ.9 లక్షల కోట్లు జరిగింది.స్టేట్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1000 కోట్లు వరకు ఆదాయం లభించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-21 మధ్య కాలంలో కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు 4 లక్షల కంటైనర్లకు పడిపోయింది. టర్నోవర్ రూ.5 లక్షల కోట్లకు తగ్గింది.
స్టేట్ ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి రావల్సిన పన్నులు ఏడాదికి రూ.500 కోట్లకు పడిపోయాయి.2021-24 మధ్యకాలంలో అయితే పరిస్థితి మరీ దిగజారిపోయింది.ఏడాదికి కేవలం లక్ష కంటైనర్లు మాత్రమే ఎగుమతులు, దిగుమతులు జరగ్గా, టర్నోవర్ రూ.1.50 లక్షల కోట్లకు తగ్గిపోయింది.రాష్ట్రానికి రావల్సిన పన్నులు రూ.150 కోట్లకు పరిమతమయ్యాయి.
కృష్ణపట్నం పోర్టు ద్వారా జరగాల్సిన ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు మార్చేశారు.కంటైనర్ కార్గోను తమిళనాడుకు షిప్ట్ చేసి బొగ్గు, బూడిద తదితర కాలుష్యబరిత డర్టీ కార్గోకు మాత్రమే కృష్ణపట్నం పోర్టును పరిమితం చేస్తున్నారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఇలాంటి పరిస్థితి నెలకొనడం అన్యాయం.
1996లో చంద్రబాబు నాయుడు సీఎంగా, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదట కృష్ణపట్నం పోర్టుకు బీజం పడింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విశ్వేశ్వరరావుకు చెందిన నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పోర్టు ఏర్పడింది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పోర్టు అదానీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది.
అప్పటి నుంచే పోర్టుకు గడ్డుకాలం మొదలైంది. ఏటా రాష్ట్రానికి రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు వస్తున్న పన్నులు ఇప్పుడు రూ.150 కోట్లకు పడిపోయాయి.పోర్టు ఆధారంగా 10 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీళ్లందరి భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడింది.కృష్ణపట్నంలో పోర్టు వస్తుందని వేల ఎకరాలను ఇచ్చి నిర్వాసితులుగా మారిన రైతులకు చివరికి బూడిద మిగిలిస్తున్నారు.
కంటైనర్ టెర్మినల్ తరలిపోతుండటంతో కస్టమ్స్ హౌస్ ఏజెంట్, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, లైనర్ ఏజెంట్స్, యార్డ్స్, ట్రాన్స్ పోర్టర్స్, లేబర్ కాంట్రాక్టర్స్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, డ్రైవర్స్, ఆపరేటర్స్, డైలీ వేజ్ లేబర్ తదితర విభాగాల్లో 10 వేల మంది ఉపాధి కోల్పోబోతున్నారు.
ప్రొవిజన్స్, కూరగాయలు, వస్త్రాలు, హోటళ్లు, అపార్టుమెంట్లు, బాడుగ ఇళ్లు తదితర వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న స్థానికులు కూడా తీవ్రంగా నష్టపోబోతున్నారు. ఈ వ్యాపారాలన్నీ ఖాళీ అవబోతున్నాయి.
ఇంత ఘోరమైన నష్టం రాష్ట్రానికి జరుగుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు. ఈ నష్టంపై కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ఆయనకు లేకుండా పోయింది.అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుంది. రాష్ట్రంలోని ఓడరేవుల విభాగం ఏం చేస్తోంది. సంబంధిత ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు, పోర్టు అథారిటీ ఉందా. లేదా?
ఊళ్లకు ఊళ్లను వదిలేసిన ప్రజలకు, వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ద్రోహం చేస్తూ ఉపాధి అవకాశాలు తీసేయడంతో పాటు రాష్ట్రానికి ఏడాదికి రూ.1000 కోట్లు ఆదాయం పోతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గం.వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంత నష్టం జరుగుతుంటే స్పందించడా?కేంద్ర ప్రభుత్వ అనుమతులతో అదానీ చాపకింద నీరులా కంటైనర్ టెర్మినల్ ను తరలిస్తుంటే ఆపాల్సిన బాధ్యత వీరికి లేదా?
సీఎం జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేశారా, లేక స్థానికంగా మంత్రి అరాచకాలు తట్టుకోలేక టెర్మినల్ ను తరలించేస్తున్నారా?ఇది ఆషామాషీ విషయం కాదు. రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి, సర్వేపల్లికి కాకాణి శాశ్వతం కాదు. కానీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు శాశ్వతం.కృష్ణపట్నం పోర్టు ఉందని ఇప్పటివరకు గర్వపడిన జిల్లా వాసులు ఇప్పడు డర్టీ కార్గో మిగిలిందని ఇళ్లలో కూర్చుని ఏడ్చుకోవాలా?
పోర్టు ఆధారంగా నెల్లూరుకు గమేశా కంపెనీ వచ్చింది. ఇప్పటి వరకు విడి పరికరాలను కృష్ణపట్నం పోర్టు ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థ ఇకపై గుజరాత్ లోని ముద్రా పోర్టు లేక తమిళనాడు పోర్టులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రవాణా ఖర్చులు పెరిగిపోవడం, పరికరాల డామేజీ తదితర సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ఇలా ఎన్నో కంపెనీలు సమస్యలను ఎదుర్కోబోతున్నాయి.
పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 6 వేల ఎకరాలతో రూపొందించిన కృష్ణపట్నం సెజ్ కూడా నిరుపయోగంగా మారనుంది.కంటైనర్ టెర్మినల్ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నోరు విప్పాలి. జరుగుతున్న భారీ నష్టంపై ప్రజలకు సమాధానం చెప్పాలి.
ప్రభుత్వం వెంటనే కళ్లు తెరవాలి. కంటైనర్ టెర్మినల్ ను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి.రైతులిచ్చిన భూముల్లో ఏర్పాటు చేసిన పోర్టును ఇష్టారాజ్యంగా తరలిస్తామంటే ఊరుకోం. పోర్టును కాపాడుకోవడానికి అఖిల పక్ష పార్టీలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.