Suryaa.co.in

Telangana

కేటీఆర్ కూడా ఈ దాడుల దమనకాండలో పాత్రధారే

– కిరాయి గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య
– బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతో రాష్ట్రంలో బిజెపి నాయకులపై దాడులు పేట్రేగిపోతున్నాయి. ఆయన తనయుడు కేటీఆర్ కూడా ఈ దాడుల దమనకాండలో పాత్రధారే. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను ఓర్వలేక కక్షగట్టి అప్రజాస్వామికంగా దాడులకు తెగబడుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో పాదయాత్ర చేస్తుండగా టీఆర్ఎస్ గూండాలు రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడికి పాల్పడటమే.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో పాటు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తూ స్థానిక ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతుల కష్టాలు, బాధలను తెలుసుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ నిరంకుశ పాలనతో విసిగివేసారిపోతున్నామని.. తమను ఆదుకునేది బిజెపి మాత్రమేనని ఆవేదనను, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వెల్లబోసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా వస్తున్న స్పందనను ఓర్వలేక, బిజెపి వైపు ప్రజల ఆదరణను భరించలేక అప్రజాస్వామికంగా దాడులకు దిగుతుండటం దుర్మార్గ చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు ఆపేక్షనీయం.

నేడు ఆలంపూర్ నియోజకవర్గం వేముల గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ గూండాల దమనకాండ కేసీఆర్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. కిరాయి గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే రక్షణ కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వం.. ఇక సామన్య ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు..? ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

దాడులు, కేసులు, అక్రమ నిర్బంధాలకు బిజెపి కార్యకర్తలు భయపడరు. బిజెపి కార్యకర్తలకు నిగ్రహం తెలుసు.. రెచ్చగొడితే ఆగ్రహజ్వాలగా ఎగిసిపడటం తెలుసు. టీఆర్ఎస్ గూండాలు మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర సాఫీగా కొనసాగేందుకు పూర్తి భద్రత కల్పించాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావ్రుతమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. నేడు వేముల గ్రామంలో జరిగిన దాడి కారకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహించాలే తప్ప రాజకీయ కుట్రలో ఇరుక్కోవద్దని సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE