– ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా
విజయవాడ: సంఘాలు కేవలం ఉద్యోగ సంబంధిత అంశాలకే పరిమితం కాకుండా సమాజం అభివృద్ధికి కూడా తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా అన్నారు. సంఘాలు నైతిక నాయకత్వం, పారదర్శకత, ప్రజాసేవ విలువలపై దృష్టి సారిస్తూ, తమ సభ్యుల హితాన్ని కాపాడేలా వ్యవహరించాలన్నారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులతో మీనా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం తరఫున మీనాకు సత్కారం నిర్వహించి, శాఖాభివృద్ధికి ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడలో జరిగిన ఎన్నికల ద్వారా డాక్టర్ ఆర్.ఎస్. కుమారేశ్వరన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బొడపాటి నరసింహులు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇతర కీలక పదవుల్లో డి. రాజశేఖర్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, శ్రీమతి శ్రీలత కోశాధికారిగా, రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, బాలయ్యలు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అజయ్ సింగ్, శ్రీధర్ రాయ్, జల్లి రమేష్ సంయుక్త కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా అరుణ కుమారి, చంద్రశేఖర్ రెడ్డి, రేణుక, బి. సుబ్బారావు ఎన్నికయ్యారు. నూతన బృందం శాఖతో సమన్వయంతో, నైతికతతో పనిచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల హితాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది.