Suryaa.co.in

Editorial

బాబు, లోకేష్, షర్మిల ఫోన్లు ట్యాప్

– బాబు ఇంటి దగ్గర కారులో కూర్చుని ట్యాపింగ్ ఆపరేషన్?
– దానిని జగన్‌కు పంపిన కేసీఆర్ సర్కార్
– షర్మిల ఫోన్లపైనా కేసీఆర్ నిఘా
– నాటి కేసీఆర్ సర్కారు దుశ్చర్య
– సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీడీ జనార్దన్ ఫోన్లపైనా దొంగచెవులు?
– దాదాపు వెయ్యిమంది ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేసీఆర్ సర్కార్
– మాస్టర్ పాన్ హరీష్‌రావుదేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేసీఆర్ హయాంంలో ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మిత్రుల ఫోన్లతోపాటు.. నాటి ఏపీ విపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కార్యదర్శి టిడి జనార్దన్, నాటి ఎంపి సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేష్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు తాజా విచారణలో వెల్లడయింది.

బంజారాహిల్స్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయం వెనక ఈ నిఘా బృందం ప్రత్యేక వాహనంలో కూర్చుని ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసు విచారణలో వెల్లడయిందట. ఆ రకంగా నాటి తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలతోపాటు.. టీడీపీ నేతల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు విచారణలో వెల్లడయింది.

కేసీఆర్ జమానాలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు, ఏపీలోని టీడీపీ సీనియర్ల ఫోన్లపైనా దొంగచెవులు నిఘా పెట్టినట్లు విచారణలో తేలింది. నాటి ఏపీ సీఎం జగన్ సొంత చెల్లెలయిన షర్మిల ఫోన్లపైనా కేసీఆర్ సర్కారు నిఘా పెట్టింది.

షర్మిలను ఎవరు కలుస్తున్నారు? ఎవరు ఫోన్లు చేస్తున్నారన్న వివరాలను తెలుసుకున్న కేసీఆర్.. వాటిని జగన్‌కు సమాచారం ఇచ్చారని విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఆ మేరకు షర్మిలకు సంబంధించి కేసీఆర్ సర్కారు ఒక కోడ్ భాషలో ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా షర్మిల గతంలో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా, ఆమె తల్లి విజయలక్ష్మి, ఓ వైసీపీ ఎంపీకి ఫోన్ చేసి.. పాదయాత్రకు ఆర్ధిక సాయం చేయాలని కోరిన విషయం ట్యాపింగ్ ద్వారా వెల్లడయింది. దానిని కేసీఆర్ నాటి ఏపీ సీఎం జగన్‌కు సమాచారం ఇచ్చారట. దానితో సదరు ఎంపీని పిలిపిచించిన జగన్.. తన చెల్లి షర్మిలకు ఎలాంటి ఆర్ధిక సాయం చేయవద్దని ఆదేశించారట.

ఇక చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోనే, తెలంగాణ పోలీసులు ఒక వాహనంలో కూర్చుని నిఘా పెట్టినట్లు సమాచారం. చంద్రబాబు-లోకేష్ ఫోన్లకు ఎవరు ఫోన్లు చేస్తున్నారు? ఇంటికి ఎవరు వస్తున్నారన్న సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వం, ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేశారని తెలుస్తోంది.

నాడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులైన టిడి జనార్దన్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావు ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా.. టీడీపీలో ఏం జరుగుతోందన్నది జగన్‌కు పూసగుచ్చినట్లు సమాచారం ఇచ్చారట. ఇక హైదరాబాద్‌లో భూములు, ఆస్తులు, వ్యాపారాలున్న టీడీపీ నేతలను నాటి కేసీఆర్ సర్కారు బెదిరించి..వారిని ఎన్నికలకు దూరంగా ఉండేలా చేశారని దర్యాప్తులో తేలిందట. వల్లభనేని వంశీ వంటి వారిని ఇలాగే బెదిరించారంటున్నారు.

మావోయిస్టుల ముసుగులో ఫోన్ ట్యాపింగ్?

ఇక తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, రఘనందన్‌రావు, అర్వింద్‌కుమార్, ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి, ప్రస్తుత నల్లగొండ కాంగ్రెస్ ఎంపి రఘువీర్‌రెడ్డి వంటి కీలక నేతల ఫోన్లను ఎన్నికల ముందు.. అంటే నవంబర్ 15న ఒకేరోజు 600 మంది ఫోన్లపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.

కొందరు సినీ నటీమణులతో ఇప్పటి కాంగ్రెస్ ఎంపీల సంబంధాలపైనా ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ వివరాలను నాటి ఆపరే షన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులే దర్యాప్తులో అంగీకరించారట. ఇవన్నీ మావోయిస్టు కార్యకలాపాల ముసుగులో చేసిన నాటి నిఘా దళపతి ప్రభాకర్‌రావు నిర్వాకాన్ని, అప్పటి ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులే బట్టబయటలు చేయడం విశేషం. అయితే ఇవన్నీ ఐన్యూస్ అధిపతి శ్రవణ్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ ద్వారానే జరిగినట్లు పోలీసు విచారణలో వెల్లడయిందని చెబుతున్నారు.

మాస్టర్‌మైండ్ హరీష్?

కాగా కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఫోన్లపై నిఘాకు సూత్రధారి నాటి మంత్రి హరీష్‌రావేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీని మళ్లీ తెలంగాణలోకి రాకుండా, చంద్రబాబును ఏపీకి పంపించిన రాజకీయ వ్యూహకర్తయిన హరీష్.. కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘాకు సైతం సూత్రధారన్నది పోలీసుల దర్యాప్తులో తేలిందంటున్నారు. నిఘా దళపతి ప్రభాకర్‌రావు, ఐన్యూస్ ఎండి శ్రవణ్‌రావు ద్వారా, ఆయనే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేవలం వెలమ కులానికి చెందిన అధికారులకే అప్పచెప్పడం వెనక హరీష్‌రావు ఆదేశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐన్యూస్ ఎండి శ్రవణ్ ఈ వ్యవహారంలో ఇంకొంచెం ముందుకెళ్లి, పారిశ్రామికవేత్తలు, ధనవంతుల ఫోన్లను ట్యాప్ చేయించి, వారిని పోలీసుల ద్వారా బెదిరించి ఆర్ధిక లబ్ధి పొందినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఐన్యూస్ ఎండి శ్రవణ్‌తో హరీష్‌కు బంధుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంత అనైతికమా?: షకీలారెడ్డి

తమ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, టిడి జనార్దన్ ఫోన్లను ట్యాపింగ్ చేయడం అనైతికమని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి విమర్శించారు. తమ నేతల ఫోన్లపై ట్యాపింగ్ చేసిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడును నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేని జగన్.. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్తై, తమ నేతల ఫోన్లు చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై కేంద్రం దర్యాప్తు చేయాలని షకీలా రెడ్డి డిమాండ్ చేశారు.

రంగంలోకి కేంద్రం?

కాగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి-బండి సంజయ్, ఎంపి బండి సంజయ్, ఈటల రాజేందర్, సీఎం రమేష్ ఫోన్లు ట్యాపింగ్ చేసిన వైనాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి టెలిగ్రాఫిక్ చట్టానికి భిన్నంగా.. మావోయిస్టుల ముసుగులో చేసిన ఈ ట్యాపింగ్‌పై, కేంద్రం రంగంలోకి దిగనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A RESPONSE