Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ హయాంలో లడ్డూ డ్రై గా ఉండేది

– నేడు మెత్తగా, నాణ్యంగా, పవిత్రంగా ఉంది
– జగన్‌ ‘ప్రసాద’ దోషం ఎలా పోతుందో పండితులు చెప్పాలి
– టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్

విజయవాడ: ఆగమ శాస్త్రాన్ని ఆపోశన పట్టిన పండితులు జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ దోషం ఎలా పోతుందో వివరించాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఏమన్నారంటే… జగన్ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. ఆగస్టు 3, 2023లోనే మేం తిరుపతి లడ్డూల నాణ్యత గురించి మాట్లాడాం. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని, సరైన నెయ్యి వాడటం లేదని, సరైన పదార్థాలు లడ్డూలో ఉండటం లేదని, లడ్డూలో నెయ్యి వాసన లేదని, లడ్డూ రుచికరంగా లేదు అని ఇదే వేదిక పై సమావేశం ఏర్పాటు చేసి చెప్పాం.

భక్తుల మనోభావాలు తెబ్బతినకుండా చూడాలని కోరాం. వైసీపీ ప్రభుత్వం రకరకాల కంపెనీల నుంచి ఆవు నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యి సరఫరాలో కూడా రివర్స్ టెండరింగ్ పాలసీని అవలంబించారు. టీడీపీ హయాంలో తయారు చేసిన లడ్డూలో జీడిపప్పు, బాదమ్, కిస్ మిస్ లు ఎక్కువగా ఉండేవి. జగన్ హయాంలో అవి కనపడేవి కాదు. ప్రస్తుత టీడీపీ హయాంలో నేడు తయారవుతున్న లడ్డూల్లో పెద్ద పెద్ద జీడిపప్పు, బాదమ్, కిస్ మిస్ ఉంటోంది. గత ప్రెస్ మీట్ లో జీడిపప్పు కానరాని దృశ్యాలను చూపాను, నేటి లడ్డూలో ఐదారు జీడిపప్పులు, కిస్ మిస్ లు, ఇలాచీ కలిగి ఉండడం చూపాను. ప్రస్తుతం నాణ్యమైన లడ్డూ తయారవుతోంది. పైగా మెత్తగా ఉంటోంది. లడ్డూని ముట్టుకోగానే చేతికి నెయ్యి తగులుతుంది… పవిత్రంగా ఉంటోంది. వైసీపీ హయాంలో లడ్డూ డ్రై గా ఉండేది. ఒక క్రికెట్‌ బంతిలా… ప్రస్తుతం పట్టుకుంటేనే మెత్తగా పిప్పిలా ఉంటోందని అన్నారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినవారు ఇంటికొచ్చేదాక నాన్ వెజ్ తినరు. కాని వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తినిపించి నాన్ వెజ్ తినేలా చేశారు. పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారు. ఇదంతా ఖర్మగా భావించాలి. గత ఐదేళ్లలో హిందువుల మనోభావాలు తెబ్బతిన్నాయి. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని చంద్రబాబు చెప్పినప్పుడు విని బాధపడ్డాను. ఇలాంటి సొసైటీలోనా మనం బతుకుతున్నది అని ఫీల్ అయ్యాను. ఇకనైనా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నాను. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరని అందరికీ తెలుసు. జంతు కొవ్వు కలిపిన నెయ్యి తో తయారైన లడ్లను తిన్నామని తెలిస్తే… పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తిరుపతిని ప్రక్షాళన చేయాలి. తెలియక తప్పు చేస్తే ఏ విధంగా ఆ తప్పును సరి చేసుకోవచ్చో ఆగమ సాస్త్రం తెలిసినవారిని అడుగాలి. నాన్ వెజ్ తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఆగమ శాస్త్రం తెలిసిన వారు ఏ విధంగా ఈ దోషం వదలుతుందో ప్రెస్ రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూను రాజకీయాలకు వాడుకుంటున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదం. అలిపిరిలో చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు మరో జన్మ ఇచ్చారని చెప్పారు. ఆయన ఎప్పుడూ టీటీడీని రాజకీయాలకు వాడలేదు. అటువంటి ఆలోచన జగన్ కే ఉంది.

టీటీడీని లాబియింగ్ చేసి వాడుకున్నది వైసీపీ ప్రభుత్వమే. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా భార్య సమేతంగా టీటీడీకి వెళ్లారా? వెంకటేశ్వర స్వామినే ఇంటికి తెప్పించుకున్న ఘనత జగన్ కే దక్కుతుంది. ప్రధాన మంత్రికి లెటర్ రాస్తానంటున్నారు. ఏమని రాస్తారు? చంద్రబాబుకు అక్షింతలు వేయాలంటున్నారు. చంద్రబాబుకు కాదు మీకు పడతాయి. జగన్ చేసిన తప్పులను ప్రజలు గమనించే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ చేసిన తప్పులు అన్ని బయటికి రావాలి. అవన్నీ ప్రజలకు తెలియాలి.

తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాలి. ప్రసాదాల పదార్థాల నాణ్యత లోపం జరిగింది. సింహాచలంలో నాణ్యమైన నెయ్యి వాడడంలేదని తెలిసింది. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. తిరుమలకు సమీపంలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని తిరుమలలో విలీనం చేయదలచుకుంటే దానికి వైసీపీ నాయకులు అడ్డు తగిలారు. అందుకు జనసేన, బీజేపీ కూడా పోరాడింది. దీన్ని బాంబే వారికి కట్టబెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. వీటిపై కూడా విచారణ చేయాలి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి తప్పులు అనేకం చేశారు. వారిని వదలిపట్టకుండా కఠినంగా శిక్షించాలి. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా ముఖ్యమంత్రి చూస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో వుంది. భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి గా జగన్ చరిత్రలో నిలిచిపోతారు.

LEAVE A RESPONSE