– భూములిస్తె ఎట్ల బతకాలె?
– మగవాళ్లెవరూ ఇప్పుడు ఊర్లో లేరు
– మా భూములు వదిలేయండి
– మా వారిని విడిచిపెట్టండి
– కలెక్టర్‌ను మా పిల్లలు కొంతమంది తెలియక కొట్టారు
– జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ విజయభారతి సాయని వద్ద లగచర్ల గిరిజన మహిళల రోదన
ఢిల్లీ: ఆందోళన, అరెస్టులతో అతలాకుతలమవుతున్న లగచర్ల అలజడి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. పోలీసుల అరెస్టులతో చెల్లాచెదరై రోడ్డున పడ్డ గిరిజన బిడ్డలను.. బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి తీసుకువెళ్లి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ విజయభారతి ఎదుట హాజరుపరిచారు. ఆ సందర్భంలో గిరిజన మహిళలు భోరుమన్నారు.
భూములిచ్చేస్తే ఎట్లా బతకాలని ప్రశ్నించారు. ‘‘మేం భూములివ్వం. మా వాళ్లను విడుదల చేయమని చెప్పండి. మా పిల్లలు తెలియక కలెక్టరును కొట్టారు. మీకాల్లొక్తం. మమ్మల్ని కాపాడండి’’ అంటూ రోదించారు. దానికి స్పందించిన విజయభారతి, తాను ఈ అంశంపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో బాధితులు ఏమన్నారంటే..
మా భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా మేము చాలా ధర్నాలు చేస్తున్నాం. మేము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారు.
ఆ దాడిని సాకుగా చూపి అర్థరాత్రి రాత్రి 500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి మాపై దౌర్జన్యం చేశారు. కుతిక పిసికి, కళ్లకు బట్టలు ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారు.
మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారు. మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారు.మేము మా భూములు ఇవ్వమని చెబుతున్నా. మా భూములను వదిలేయాలి. మా వారిని వదిలేయండి. మాకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటా అంటే మేము ఎలా బతకాలి? ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోంది.
మా ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారు. ఎనిమిది రోజులుగా మా పిల్లలు ఎక్కడున్నారో తెలియదు వారిని కూడా తీసుకెళ్తామని చెబుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా బాగా బతికాం. గత 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం.మా ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వం. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే మమ్మల్ని బెదిరించి పంపించారు.
ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఏమన్నారంటే.. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారు. 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని రైతులు చెబుతూనే ఉన్నారు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను హింసించారు. కొట్టారు. బూతులు తిట్టారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారు. మళ్లీ ఏం చేస్తారోనని భయపడుతున్నారు. తమకు అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుంది. ఇప్పటికీ కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్ట్ లు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి సోదరుడు బాధితులకు ఉరి శిక్ష పడుతుందని బెదిరిస్తున్నాడు. మీ భూములు గుంజుకుంటామని చెబుతున్నాడు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చాం. జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించాం. ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ ను కూడా కలుస్తాం. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డే. ఆమె మాకు సమయం ఇస్తే వారికి కూడా ఈ సంఘటనను వివరిస్తాం. కొద్ది రోజులుగా బాధితులు ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటాం.
మాలోతు కవిత ఏమన్నారంటే..
తాతాలు, తండ్రుల వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీ ఇవ్వాలని అంటున్నారు. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం ఇప్పటికే భూములు సేకరించింది. దాన్ని కాదని గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడు. కానీ లగచర్లలో మా తండా వాసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
90 శాతం లంబాడాలు మద్దతు ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు.మా గిరిజనుల భూముల జోలికి రావద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. లగచర్ల బాధితులకు గిరిజన బిడ్డలందరం అండగా ఉంటాం.
బాదితుల వెంట బీ ఆర్ ఎస్ ఎంపీ లు కె ఆర్ సురేష్ రెడ్డి ,వద్ది రాజు రవిచంద్ర ,డి .దామోదర్ రావు , ఎమ్మెల్యే కోవా లక్ష్మి ,మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్ ,హరిప్రియ నాయక్ ,బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ పలువురు కొడంగల్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు.