హవ్వ…న్యాయ వ్యవస్థపై శాసన వ్యవస్థ దాడా?

-అరసవల్లి నుంచి అమరావతికి సత్తిబాబు యాత్రా?
-పిచ్చి వేషాలు వేస్తే… ఢిల్లీ నుంచి తడాఖా చూపిస్తా
-నా కేసు కూడా సిఐడి కోర్టులో రావడం లేదు
-దమ్ముంటే మంత్రులు వికేంద్రీకరణకు మద్దతుగా పాదయాత్ర మొదలు పెట్టాలి
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యాయవ్యవస్థపై, శాసన వ్యవస్థ దాడి చేస్తుందా?, హైకోర్టు ఒకే రాజధాని అమరావతి అని చెప్పడం తప్పా? అని రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వికేంద్రీకరణకు మద్దతుగా బొత్స అండ్ కంపెనీ, జగన్ అండ్ కో అరసవల్లికి పాదయాత్ర చేస్తుందా? అంటూ నిలదీశారు. మంత్రివర్గ సభ్యుల వెనుక ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు, హైకోర్టు తీర్పు కు వ్యతిరేకంగా… వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడించడం, ప్రజాస్వామ్య వ్యవస్థ కి బ్లాక్ డే అని అభివర్ణించారు. ఇటువంటి శాసన వ్యవస్థ పదవిలో ఉండడానికి అనర్హులని పేర్కొన్నారు. ఈ భూమండలం పుట్టిన తర్వాత ఇంత అసంబద్ధంగా మాట్లాడే మంత్రివర్గం ఉండి ఉండదన్నారు. స్వతహాగా క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు అంగీకార పత్రాన్ని అందజేయడం ద్వారా హిందువుల మనోభావాలను గౌరవించినట్లు అవుతుందని చెప్పారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఇంతకంటే కారణం ఏమి కావాలని ప్రశ్నించారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హైకోర్టు తీర్పుపై, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఆ పిటిషన్ పై వాదనలు ముగిసి, తీర్పు వెలువడే వరకు కూడా ఈ మంత్రి వర్గానికి వేచి ఉండే ఓపిక లేదని విమర్శించారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, అప్పలరాజు, సంబంధం లేని స్పీకర్ లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నారని రఘురామకృష్ణం రాజు విరుచుక పడ్డారు.

మంత్రిగా బొత్స సత్యనారాయణ చొరవ తీసుకొని ముఖ్యమంత్రికి చెప్పవచ్చునని, కానీ ఆయన ఆ చొరవే తీసుకోవడం లేదని అన్నారు. వికేంద్రీకరణ ఉద్యమానికి మద్దతుగా తాము శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించలేమా?అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఇదే మంత్రులు ఏసీ బస్సులను వేసుకొని ఊరూరు తిరిగితే వారి సభలలో 90 శాతం ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయని గుర్తు చేశారు. ఎక్కడ కూడా ఏ సమావేశంలోనూ 500 మందికి మించి సభి కులు లేరన్నారు. మెప్మా, డ్వాక్రా గ్రూప్ సభ్యులను బలవంతంగా సభలకు తీసుకువస్తే, పోలీసులు బ్రతిమాలిన వారు భారీకేడ్లను దాటుకొని వెళ్లారని గుర్తు చేశారు.

వికేంద్రీకరణకు మద్దతుగా బొత్స సత్యనారాయణ సరదాగా పాదయాత్ర ప్రారంభించాలని, రాష్ట్ర ప్రజలలో ఒకడిగా తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. అమరావతి ప్రాంత రైతులు, రాష్ట్ర ప్రభుత్వానికి తమ భూములను ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరావతి రైతులతో, రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టంలో తీసుకువచ్చి, ఒప్పందాన్ని చేసుకున్నదని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయనున్నారో ముందే రాజధాని రైతులకు వివరించారన్నారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చేసిన తర్వాత మీకు అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇస్తామని చెప్పి ముందే అంగీకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నదని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ఈ మంత్రులకు బుద్ధి లేదా?, ఇటువంటి వారి నా మనం ఎన్నుకున్నదని ప్రజలు ప్రస్తుతం బాధపడే పరిస్థితి నెలకొందన్నారు.

విశాఖలో ఆస్తులు పోగొట్టుకున్న వారి పాదయాత్రకు పిలుపునిస్తే సక్సెస్ అవుతుంది
విశాఖపట్నంలో ఆస్తులు కోల్పోయిన వారి పాదయాత్రకు పిలుపునిస్తే, ఆ పాదయాత్ర సక్సెస్ అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎంతోమంది ఆస్తులను, బీచ్ రోడ్ లోని హోటల్ ప్రాపర్టీని ఎలా కొట్టేశారో విశాఖ ప్రజలందరికీ తెలుసునన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా మంత్రులు పాదయాత్ర చేస్తే ప్రజలు పారిపోయే ప్రమాదం ఉందని, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ల మాదిరిగా అపహాస్యం పాలవుతారంటూ ఎద్దేవా చేశారు.

దమ్ముంటే మంత్రులు వికేంద్రీకరణకు మద్దతుగా పాదయాత్ర మొదలు పెట్టాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆ రోజే ఈ ప్రభుత్వం చాఫ్టర్ క్లోజ్ అని వ్యాఖ్యానించారు. కోర్టులు సుమోటోగా తీసుకొని, న్యాయపరంగా ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించే ఊరేగింపులో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా అగ్రభాగాన నడవాలంటూ సవాల్ చేశారు.

అప్పుడు ఈ మంత్రివర్గం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దామన్నారు. రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే విధంగా మతి లేని పనికిమాలిన మాటలను ఈ మంత్రులు మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రులు తమ వాచాలతను తగ్గించుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఇలా మాట్లాడడం తగదని హితవు పలికారు.

మీటింగులకు రాకపోతే పథకాలు కట్… అనడం విడ్డూరం
మీటింగులకు రాకపోతే ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ఆపివేస్తామని ఉపముఖ్యమంత్రి రాజన్న దొర చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు ఫైర్ అయ్యారు. ఒక ఉపముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి, ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ప్రజలలో చులకన అవ్వక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే మంత్రులు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని చేశారని, ఇప్పుడు దేవుళ్లను కూడా వేరు చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గుడివాడ అమర్నాథ్, హిమాలయాల్లో ఉన్న శివుని పేరు పెట్టుకోవచ్చు కానీ, అమరావతి ప్రాంత రైతులు, అరసవల్లి సూర్యభగవానుడిని వచ్చి కొలవకూడదా అంటూ ప్రశ్నించారు.

ఒక సమావేశంలో మంత్రి అమర్నాథ్ తనని జోకర్ అని అపహాస్యం చేసినట్లుగా తెలిసిందని, అయితే మీ దూల తీర్చేది ఈ జోకరే నని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈనెల 12వ తేదీన తాను ఒక లేఖ రాసినట్టు, అమరావతి రైతుల పాదయాత్రను విచ్చిన్నం చేయడానికి మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్ర పై ఒక కన్నేసి ఉంచాలని తాను కోరగా, అమిత్ షా స్పందించి తనకు తిరిగి లేఖ రాశారని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్రను మంత్రులు అమర్నాథ్, రాజన్న దొర, దాడిశెట్టి రాజా, ధర్మాన సోదరులు, స్పీకర్ ఆపుతారా అంటూ ప్రశ్నించిన ఆయన, ఢిల్లీలో ఉండే తాను మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే… ఢిల్లీ నుంచి తన తడాఖా చూపిస్తానని పేర్కొన్నారు.

ప్రభుత్వ కేసులు వాదించే వారే… శివ శంకర్ రెడ్డి కేసును వాదిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వ కేసులను వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులే హైకోర్టు, సుప్రీంకోర్టులలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి కేసును వాదించడం అనుమానాలకు తావునిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు కేసులను వాదించిన అభిషేక్ మను సింగ్వి, శివశంకర్ రెడ్డి కేసును కూడా వాదించడం విస్మయాన్ని కలిగించిందన్నారు.

ఇక శివ శంకర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తి అని, ఆయనపై గతంలో 31 కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కేసును విచారిస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసిందన్న ఆయన, ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటివరకు హత్య కేసులో పురోగతి లేదని వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు చేసి పదేళ్లు అవుతున్న, ఇప్పటివరకు ట్రయల్ కు ఎందుకు రాలేదని సుప్రీంకోర్టు సదరు న్యాయస్థానాన్ని ప్రశ్నించిందన్న రఘురామకృష్ణం రాజు, తన కేసు కూడా సిఐడి కోర్టులో రావడం లేదన్నారు.

సతీ సమేతంగా తిరుపతి బ్రహ్మోత్సవాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలి
హిందువుల మనోభావాలను గౌరవిస్తూ సతీ సమేతంగా తిరుపతి లో జరుగుతున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జగన్మోహన్ రెడ్డి హాజరుకావాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, తాను హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తానని, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పై భక్తి భావాన్ని కలిగి ఉన్నానని అంగీకార పత్రాన్ని అందజేయాలని హితవు పలికారు. స్వతహాగా క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు అంగీకార పత్రాన్ని అందజేయడం ద్వారా హిందువుల మనోభావాలను గౌరవించినట్లు అవుతుందని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఒక గ్రామంలో సమావేశం నిమిత్తం ఏర్పాటుచేసిన టెంట్ కు సంబంధించిన తాడును శివలింగానికి బిగించడం జరిగిందని, ఇటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు.

ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు పెట్టడం అభినందనీయం
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని, విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పేరును పెట్టడం అభినందనీయమని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ప్రధాన మంత్రి అయ్యే అవకాశం లేదని, ఆ ఎయిర్ పోర్టు పేరుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు.