– డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి
– శాంతి, ఆర్థిక భద్రతకు డ్రగ్స్ అవరోధం
– డ్రగ్స్ రహిత సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం: మాదకద్రవ్యాలు లేని సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా రామచంద్రపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తొలుత విద్యార్థులు, యువతతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే మాదకద్రవ్యాలు పట్ల విద్యార్థులు,యువత, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక మంత్రుల కమిటీ నిత్యం పర్యవేక్షణ చేస్తుందని, డ్రోన్లు జిపిఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత సీసీ టీవీలు, సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. గత వైసీపీ పాలనలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. అనంతరం ర్యాలీ ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్ కి చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్ఐ లు నాగేశ్వరరావు, లక్ష్మణ్, భుజంగరావు, ఎక్సైజ్ సీఐ, పలువురు అధికారులు, కూటమి పార్టీ నాయకులు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.