– వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
శింగనమల: ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైయస్సార్సీపీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం రంభించారు. అనంతరం’చంద్రబాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలందరికీ గుర్తుచేయడానికి వైయస్ జగన్ ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇంకా ఆయనేమన్నారంటే…
2019-24 మధ్య ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసిన మోసాలు, దాడులు, అవినీతి, అకృత్యాలు, ఆడవారిపై చేసిన అఘాయిత్యాల గురించి మాట్లాడాలంటే వారం కూడా సరిపోదేమో. ఐదేళ్ల పాలనతో వైయస్ జగన్ రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే, చంద్రబాబు తన ఏడాది పాలనతోనే రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఏడాదిలోనే 5 లక్షల పింఛన్లు తొలగించిన కూటమి ప్రభుత్వం మొత్తం 10 లక్షల పింఛన్లు తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది.
నిద్ర లేచింది మొదలు వైయస్ జగన్ పేరెత్తకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదు. ఆయన వ్యక్తిత్వం హననం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలను, నాయకులను జైళ్లలో పెట్టాలని చూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో మనమే జైల్ భరో కార్యక్రమం చేసి మనమే జైల్లో ఉంటామని చెప్పాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. వైయస్సార్సీపీ కార్యకర్తల ప్రతిఘటనతో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థమైపోయింది. అందుకే మట్టి, లిక్కర్, శాండ్, బూడిద, క్వార్ట్జ్ అనే తేడాలేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు.