సీఎం సభలో రాజధాని కోసం నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ఎగరేద్దాం

6

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య పిలుపు

రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని మోసం చేసి, రాజధానిలో సెంటు పట్టాల పేరిట పేదలను వంచిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ పంపిణీ సభలో నల్లజెండాలను, నల్ల బెలూన్లులను ఎగరేసి నిరసన తెలపాలని, ఉద్యమ శిబిరాల లోను, ఇళ్ళ పైన నల్ల జెండాలు కట్టాలని, మహిళలు నల్ల చీరలు ధరించి నిరసన తెలపాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు.

ఆయన విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. కేవలం పేదలను మోసం చేసి సెంటు పట్టాల ఆశ చూపి తద్వారా రాజకీయ ఓట్ల లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి అత్త సొమ్ము అల్లుడు దానం ప్రోగ్రాం పెట్టారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ చేయకుండా, ఎలాంటి తీర్మానం చేయకుండా, హైకోర్టు తీర్పును, సుప్రీంకోర్టు విచారణలను పరిగణనలోకి తీసుకోకుండా, రాజధాని ఉద్యమ సెగలను పోలీసు బలంతో కాలరాసి ‘పంచుకుందాం రండి’ అంటూ పిలుపునిస్తున్నట్లు ఆరోపించారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాజధాని భూములను ఇళ్ళ పట్టాలుగా ఇస్తామని కానీ, తాను అధికారంలోకి వస్తే మూడు రాజధానులు పెడతామని కానీ చెప్పేందుకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి, అధికారంలోకి రాగానే పరదాలు కప్పుకొని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. సెంటు పట్టాలకు తాను ఎవ్వరమూ వ్యతిరేకం కాదని, పేదలకు రెండు సెంట్లు చొప్పున నివేశన స్థలాలు ఇవ్వాలన్న తమ డిమాండ్లను గుర్తు చేశారు.

ఒకపక్క గూగుల్ టేక్ అవుట్ నిర్ధారించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు చేతులు రాని పోలీసులు, మరోపక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యంను నేనే చంపాను అన్న మాన్ ఈటర్ ఎమ్మెల్సీ అనంత బాబుకు సన్మాన సభలు పెడుతూ, న్యాయమైన అమరావతి మహిళలపై ‘పోతురాజు’లను ప్రయోగించటం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, 356 ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మరో ఏడాదిలో ముఖ్యమంత్రి పరిపాలన అంతమవుతుందని, ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోతాడని, ఆ వెంటనే ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ ను ప్రోక్లైన్లతో కూల్చి, ముఖ్యమంత్రి నివాస స్థలాన్ని వేలం పాటల ద్వారా విక్రయించి, రాజధాని ఉద్యమంలో అమరులైన అమరావతి కుటుంబాలకు పరిహారంగా ఇస్తామని బాలకోటయ్య హెచ్చరించారు.విలేకరుల సమావేశంలో ఐకాస ఉపాధ్యక్షులు మామిడి సత్యం, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శిరం శెట్టి నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు.