సమస్త సృష్టిలోని సకల జీవరాశిలోనూ ఆ పరమాత్మే కొలువై ఉన్నాడని చెప్పడం ద్వారా జగద్గురు ఆదిశంకరులు సృష్టిలోని ఏ జీవీ అధికమైనది లేదా అధమమైనది కాదనే మహత్తర సత్యాన్ని బోధించారు. ఒక రకంగా చెప్పాలంటే… శంకరుల వారి బోధలకు కొనసాగింపుగానే ఆ తర్వాతి కాలంలో భగవద్రామానుజులు హిందూ సమాజంలోని కుల అంతరాలను నిర్మూలించే విశేష ప్రయత్నం వేయి సంవత్సరాల క్రితమే చేశారు. దేశంలో విస్తృతంగా వైష్ణవ ధర్మ ప్రచారం గావించిన ఆళ్వారులలో నిమ్న వర్గాల వారూ ఉన్నారు. అలాగే మాల దాసరులు, మాదిగ దాసరులు….. ఇలా అన్ని కులాలలోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఉన్నతిని కలిగించే అద్భుతమైన వ్యవస్థను నిర్మాణం చేశారు శ్రీ రామానుజులు. దేవాలయాలలో అన్ని వర్గాల వారికీ ప్రవేశాన్ని కల్పించారు. అనంతర కాలంలో స్వామి వివేకానందులు ప్రపంచమతటా పర్యటించి హైందవ శంఖారావాన్ని పూరించటమే కాక, హిందూ సమాజంలోని వికృతుల వల్ల జరుగుతున్న అనర్ధాలను, వాటిని రూపుమాపుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. నారాయణ గురు, మళయాళ స్వామి ఇలా ఎందరో… హిందూ సమాజంలో ధార్మిక చైతన్యానికి, కుల అంతరాల నిర్మూలనకు విశేష కృషి సల్పారు. పూజలు, క్రతువులలో ఇచ్చే దానాలు కేవలం బ్రాహ్మలకే కాక అత్యంత పేద, దళిత బంధువులకు కూడా ఇవ్వాలని శాసించడం తో పాటు తన పార్ధివ దేహాన్ని నాలుగు వర్ణాల వారూ మోయాలని కోరుతూ వీలునామా వ్రాసిన స్వాతంత్ర్య వీర సావార్కర్ కంటే గొప్ప అభ్యుదయవాది ఈ ఆధునిక భారతంలో మనకు కానరారు. అలా అనాదిగా హిందూ సమాజంలో నిరంతరంగా, చిరంతనంగా సంస్కరణ ప్రక్రియ, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయ్.
స్వతంత్ర భారతదేశం నిర్దేశించుకున్న ముఖ్య లక్ష్యాలలో కుల నిర్మూలన ఒకటి. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడి హోదాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తరచుగా ‘ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్’ (కుల నిర్మూలన) గురించి మాట్లాడేవారు. కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలిస్తే తప్ప భారతదేశంలో సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది అంబేద్కర్ అభిప్రాయం. అయితే మన దేశంలో గడచిన 70 సంవత్సరాలలో కులం నిర్మూలనం కాకపోగా మరింత సుస్థిరమైంది. రాజకీయాలతో పాటుగా అన్ని వ్యవస్థలలో కుల ప్రాధాన్యత పెరిగింది. జనాభా లెక్కలు కులం ఆధారంగా జరగాలని డిమాండ్ ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ వేళ బలం పుంజుకుంటున్నది. దీనిని బట్టి అంబేద్కర్ ఆలోచనలనుండి మనం ఎంత దూరంగా జరిగామో మనకు అవగతమవుతుంది.
కులం అనే దాన్ని సక్రమంగా అర్థం చేసుకోనందునే ఈ పరిస్థితి ఏర్పడింది. బ్రిటిష్ వాడు నింపిన భావ దాస్యపు కోణంలో కులాన్ని చూసినందునే మనదేశంలో కుల భావన గతంలో కంటే మరింతగా విస్తృతమై నేడు జనగణన స్థానంలో కుల గణన చెయ్యాలనే మతిమాలిన డిమాండ్లు చేసే స్థితికి చేరుకుంది.
ఆంగ్లేయులతోనే ముసలం ఆరంభం
నిజానికి ‘కాస్ట్’ అంటే కులం కాదు. వర్ణం కాదు. ‘కాస్ట్’ కు సమానార్ధకమైన పదం భారతీయ భాషలలో కానీ, సంప్రదాయాలలో కానీ లేదు. ‘కాస్ట్’ అనే పదాన్ని మొదటిగా పోర్చుగీసు వారు ఉపయోగించారు. కొత్తగా క్రైస్తవం స్వీకరించిన యూదుల, ముస్లిముల సమూహాన్ని ‘కాస్టా’ అనే పేరుతో పిలిచేవారు. కొత్త క్రైస్తవులు తమ హిబ్రూ రక్తం వలన అశుద్ధమైన వారిగా, అంటరానివారిగా భావించబడ్డారు. ఈ పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది క్రైస్తవ జెసూట్స్. కనుక ‘కాస్ట్’ అనే పదానికి కర్త, కర్మ, క్రియ క్రైస్తవులే.
16వ శతాబ్దానికి ముందు మనదేశంలో ‘కాస్ట్’ లేదు. ఆ మాటకొస్తే 1901 జనాభా లెక్కల వరకూ మన దేశంలో ‘కాస్ట్’ అనే పదానికి అధికారిక గుర్తింపు లేదు. 1901 నుండే ‘కాస్ట్’ అనే పదం వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్యుల సమాజంలో ఉన్న కాస్ట్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కొన్ని మన వర్ణ/ కుల వ్యవస్థలో కూడా వారికి కనపడడంతో, ఎక్కువ విచారించకుండానే హిందూ సమాజానికి ఆ పదాన్ని అంటగట్టారు.
మనదేశంలో ఉత్తరాదిలో ‘జాతి’, దక్షిణాదిలో ‘కులం’ పర్యాయపదాలుగా వాడబడ్డాయి. వాస్తవానికి ఈ రెండు పదాల అర్థం కూడా వేరు వేరు. వివాహ సంబంధ నియమ నిబంధనలు, ఆహారపుటలవాట్లు, వృత్తి వ్యాపకాలు, నివాసం, కర్మకాండ, ధార్మిక విశ్వాసాల కారణంగా అనుసరిస్తున్న ఆచారాలలోని అంతరాలు మొదలగు వాటి ఆధారంగా ‘జాతి’ నిర్ణయింపబడి ఉండవచ్చు. మొదటగా కొన్ని జాతులే ఉన్నాయి. కాలక్రమంలో అనేక జాతులు/కులాలు వెలిశాయి. ఉత్తరాది వారి ‘జాతి’ అంటే ఆంగ్ల పదం ‘Race’ కాదు.
వర్ణ వ్యవస్థలో అధికాధమాలకు తావు లేదు
జాతులు/కులాలు జడమైనవి కావు. కొత్త జాతులు/కులాలు వచ్చేవి. ఉన్న జాతులు/కులాలు కలిసిపోయ్యేవి. జాతుల/కులాల నియమ నిబంధనలు నిరంతరం మార్పు చెందుతూ ఉండేవి. కనుక కొత్తవి సృష్టించడానికి, రెండు మూడు జాతులు/కులాలు కలిసి రూపాంతరం చెందడానికి అవకాశం ఉండి కాలక్రమంలో ఎన్నో జాతులు, ఉప జాతులు ఏర్పడ్డాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక కొలమానంలో కొన్ని జాతుల స్థాయి పెరుగుతుండేది. మరి కొన్ని జాతుల స్థాయి తగ్గుతుండేది.
వర్ణాలు నాలుగు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ శబ్దం శ్రేష్ఠమైనది కాదు. శూద్ర శబ్దం నీచమైనదీ కాదు. ఆయా వర్ణాలకు పెట్టబడిన పేర్లు మాత్రమే అవి. అర్హత, గుణ, కర్మలను బట్టి వర్ణాలు నిర్ణయించేవారు. బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన ప్రతివాడూ బ్రాహ్మణుడే అయ్యేవాడు కాదు. అలాగే ఇతర వర్ణాలకు చెందినవారు కూడా. సమాజ కల్యాణానికి అన్ని రకాల వారూ కావాలి. తత్త్వవేత్తలు ఎంత అవసరమో, సమాజాన్ని శత్రువుల నుంచి కాపాడే యోధులు కూడా అంతే అవసరం. వివిధ రకాల పంటలు పండించి దేశ సంపదను పెంచేవారు ఎంత అవసరమో, ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసి, అమ్మి ఎగుమతులు చేసే వారు కూడా అంతే అవసరం. ఎవరూ ఎక్కువ కాదు, తక్కువా కాదు.
విస్తృత పరిశోధనల అనంతరం కూడా జాతికి, వర్ణానికి మధ్య సంబంధాన్ని నేరుగా ఇంతవరకూ ఎవరూ నిర్ధారించలేకపోయారు. గత రెండు మూడు వందల సంవత్సరాల నుండి ఈ దిశగా చేస్తున్న పరిశోధనల వలన ఏ విధమైన స్థిర అభిప్రాయానికీ రాలేకపోయారు. కానీ జాతులను ఏదో వర్ణం కిందకు తెచ్చే ప్రయత్నం పాశ్చాత్య మేధావులు చేస్తూనే ఉన్నారు. అన్ని వర్ణాలూ సమానమని చెప్పే ప్రాచీన వాంగ్మయాన్ని కావాలనే పక్కకు పెట్టారు. వారికి అది నచ్చలేదు. బ్రాహ్మణ వర్ణానికి అగ్రాసనం వేసిన శాస్త్రాలను మాత్రం విస్తృతంగా ప్రచారం చేశారు. వర్ణసంకరం గురించి చెప్పిన గ్రంథాలను ఉటంకించారు. వర్ణ సమానత్వాన్ని బోధించిన శాస్త్రాలను పక్కకు నెట్టివేశారు. జాతులను, వర్ణాలను కాస్ట్ చట్రంలో ఇరికించే ప్రయత్నంలో ఎన్నో ఉప జాతులను, ఉప ఉప జాతులను సృష్టించారు.
బ్రాహ్మణ వర్ణంలోనూ అనేక వందల జాతులు ఉన్నాయి. ఆహారపుటలవాట్లు, వివాహ పద్ధతులు, ఆరాధనా పద్ధతులు మొదలైన వాటిలో ఎన్నో వ్యత్యాసాలు/ విభేదాలు ఉన్నాయి. ఉత్తరాది బ్రాహ్మణులకు, దక్షిణాది బ్రాహ్మణులకు ఎందులోనూ సారూప్యం లేదు. అలాగే బ్రాహ్మణులలోనూ మాంసాహారం తినేవారున్నారు. బ్రాహ్మణులందరూ పూజారులు కాదు. పురోహితులు కాదు. కేవలం కొందరు మాత్రమే అందుకు అర్హత ఉన్నవారు.
ఆంగ్లేయులచే శూద్ర వర్ణం కిందకు చేర్చబడ్డ జాతులు సామాజికంగా, ఆర్థికంగా, సైనిక పరంగా ఎంతో ప్రతిభావంతమైనవి. గతంలో అనేకసార్లు వారు రాజ్యాలు ఏలారు. శివాజీ మహారాజ్, నంద చక్రవర్తులు, శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డి రాజులు, శాలివాహనులు, యాదవరాజులు మొదలైనవారు వారిలో ప్రముఖులు. ఆధునిక కాలంలో కూడా రాజ్యాధికారం శూద్రులుగా పేర్కొనబడ్డ జాతుల చేతులలోనే ఉంది. శూద్ర శబ్దాన్ని నీచ శబ్దంగా ఆంగ్లేయులు పేర్కొనటం వెనుక కుట్ర దాగి ఉంది. దీని వెనుక సంఖ్యాపరంగా అత్యధికులైన శూద్రులను మిగిలిన సమాజం నుండి వేరు చేయాలనే కుట్ర దాగి ఉంది. దాని ఆధునిక రూపమే ఎస్సీ, బీసీ, దళిత, మైనారిటీల ఐకమత్యానికి ఇస్తున్న పిలుపులు, ప్రయత్నాలు.
20వ శతాబ్ది మొదటి నుండి మాత్రమే ‘షెడ్యూల్ కులాలు’ అనే పదం వాడుకలోకి వచ్చింది 1200 జాతులను, 65 మిలియన్ల మందిని దళితులుగా పేర్కొంటున్నారు. అందుకై ఒకే ఒక ప్రాతిపదికను తీసుకున్నారు. ఆ ప్రాతిపదిక – అంటరానితనం. అనాదిగా విజ్ఞులు అంటరానితనం పాపం కాకపోతే మరేదీ పాపం కాదని చెప్పటం జరిగింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ఎందరో ఉద్యమించారు. అంటరానితనం చట్ట వ్యతిరేకం. అంటరానితనం క్రమేపీ అదృశ్యం అవుతున్నది. అంటరానితనానికి బహుశా ఆచార వ్యవహారాలు, వృత్తివ్యాపకాలు, ఆహారపుటలవాట్లు, ఆరాధనా పద్ధతుల మధ్యగల తేడాలు కారణం కావచ్చు.
కొత్త కులాలను సృష్టించటం, వాటిని ఏ, బి, సి, డి గా వర్గీకరించడం వెనుక రాజకీయాలే ప్రధాన కారణం. మన సామాజిక వ్యవస్థను ఆంగ్లేయుల మూసలోనే చూసే ప్రయత్నం అది. సమాజాన్ని వివిధ కులాల పేరుతో విభజించి, విడగొట్టే ప్రయత్నం రాజకీయ పార్టీలకు తాత్కాలికంగా లబ్ధి కలిగించవచ్చు. కానీ దేశానికి అది ప్రమాదకరం. ఇటువంటి యత్నాల వలన సమాజంలో వివిధ వర్గాల మధ్య సయోధ్య దెబ్బతింటున్నది. అగ్రహావేశాలు పెరుగుతున్నాయి. అగ్ర, నిమ్న కులాల పేరుతో చేస్తున్న వాదనలు కొందరిలో ఆధిక్య భావనను, మరికొందరిలో న్యూనతా భావనను పెంచుతున్నాయి.
బానిసత్వం కొనసాగిన కాలంలోనూ, వలస పాలన కాలంలోనూ, కమ్యూనిస్టు దేశాలలోనూ, సామ్రాజ్యవాద దేశాలలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ, ఫ్యూడలిజంలోనూ కూడా దోపిడి, అణచివేతలు ఉన్నాయి. మన దేశానికి, మన సమాజానికి మాత్రమే అవి పరిమితం కాదు. కేవలం ‘కాస్ట్’ వ్యవస్థలోనే దురాచారాలు, వివక్ష ఉందని మిగిలిన సంస్కృతులలో అటువంటి దురాచారాలు, వివక్ష లేవని చెప్పటం సత్య దూరం మాత్రమే కాదు మోస పుచ్చటం కూడా.
ఈ పెడ ధోరణులు ప్రమాదకరం
రాజకీయంగా, చట్టపరంగా, మేథోపరంగా ‘కాస్ట్’ వ్యవస్థను శాశ్వతంగా నిలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సమాజానికి శ్రేయస్కరం కాదు. అవి మన సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. కనుక మనం కొత్తగా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి.
మూడు ముఖ్యమైన వలస భావనల వలన ఇంత గందరగోళం ఏర్పడింది. మొదటిది ‘కాస్టా’ అనే పదం. రెండవది జాతిపరమైన ఆర్య – ద్రవిడ సిద్ధాంతం. మూడవది యూదులకు, క్యాథలిక్ పురోహిత వర్గానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు చేసిన విమర్శలు.
కాస్ట్, సబ్ కాస్ట్ అనేవి పాశ్చాత్యుల సమాజానికి సంబంధించినవి. వర్ణము, జాతి అనేవి భారతీయమైనవి. రెండూ విభిన్న సంస్కృతులకు సంబంధించిన వేరు వేరు పదాలు. కానీ ఆంగ్లేయులు వారి పదాలైన కాస్ట్, సబ్ కాస్ట్ చట్రంలో మన సమాజాన్ని చూసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను ఆర్యులుగానూ, శూద్రులను, దళితులను ద్రావిడులుగానూ వారు పేర్కొన్నారు. క్రైస్తవ, యూదు పురోహిత వర్గంపై ప్రొటెస్టెంట్ లు చేసిన విమర్శను బ్రాహ్మణ పురోహిత వర్గానికి కూడా అన్వయించారు. బ్రాహ్మణులను పరమ దుర్మార్గులుగా, నీచులుగా, దుష్టులుగా, సమాజపు దురన్యాయాలన్నిటికీ వారినే కారణభూతులుగా చిత్రీకరించారు.
స్వాతంత్ర్యం అనంతరం మిషనరీల, వలస పాలకుల ఆలోచనా ధోరణిని తిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యకుండా, కొనసాగించారు. వలసపాలకులు మనకు ఇచ్చిన కోణాలలోని నిజానిజాలను మనం విచారించలేదు, తర్కించలేదు, ప్రశ్నించనూలేదు. వాటిని యదాతథంగా అంగీకరించాం. విశ్వవిద్యాలయాలను, పత్రికా ప్రసార సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న కమ్యూనిస్టులు ఆర్య – ద్రవిడ విభజనను, బ్రాహ్మణ వ్యతిరేకతను, అగ్ర, నిమ్న వర్గాల విభజనను అంగీకరించారు.
దాంతో వలస పాలకులు, క్రైస్తవ మిషనరీలు వారి స్వార్థం కోసం ప్రవేశపెట్టిన భావజాలం మరింత విస్తృతంగా సమాజంలో వ్యాపించింది. ఈ భావజాలం వ్యాప్తి కారణంగా వారు ప్రవేశపెట్టిన వికృత, ద్వేషపూరిత ఆలోచనా ధోరణి కోణం నుంచే హిందూ సంఘాన్ని సామాన్యులు సైతం చూసే స్థితి ఏర్పడింది. నేడు ఎవరైనా ‘Caste system’ అనేది మనకు చెందినది కాదు. అది పాశ్చాత్యులది” అని చెబితే ఆశ్చర్యపోతారు.
‘కాస్ట్’ అనే పదాన్ని మనం వాడకూడదు. దానిని నిషేధించాలి. కాస్ట్ వ్యవస్థ మనది కాదు. కనుక మనమీద రుద్దిన ‘కాస్ట్’ వ్యవస్థను రద్దు చేసుకుందాం. నాలుగు వర్ణాలు సమానమైనవి. ఎక్కువ, తక్కువ కానివి. అది శ్రమ విభజనకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వర్గీకరణ. దానికి అంతకంటే విలువ లేదు.
మన సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. వాటి మూలాలను పాశ్చాత్య క్రైస్తవ దృష్టికోణం నుండి కాక, స్వతంత్రంగా అధ్యయనం చేసి, వాటికి మనవైన పరిష్కార మార్గాలు అన్వేషించాలి. మనందరం ఒకటే. మన మీద రుద్దబడిన కల్పిత కథనాలను మనందరం సమైక్యంగా తిప్పికొట్టాలి.
– డా. బి. సారంగపాణి
VSK TELANGANA సౌజన్యంతో…