Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ గంజాయి మొక్కని పీకేద్దాం

నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ
ఏపీలో నిరుద్యోగం పెరగడానికి జగన్ విధానాలే కారణం
ఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా.. అభివృద్ధి కావాలా.. వినాశనం కావాలా.?
బూతులు తిట్టేవారు, రౌడీలు కావాలా.. ప్రజలకు సేవ చేసేవారు కావాలా?
సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా?
ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం
పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు

పామర్రు : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. సాధారణ కుటుంబం నుండి వచ్చిన నందమూరి తారకరామారావు పుట్టారు. ఎన్టీఆర్ ఒక చరిత్రకు స్ఫూర్తి. ఇక్కడి నుండి వచ్చిన వ్యక్తి తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీక్ష పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అధ్వితీయ శక్తులుగా మారుతారనడానికి ఎన్టీఆర్ నిదర్శనం. మనల్ని వదిలి 30 సంవత్సరాలైనా.. ఆయన ప్రజల కోసం, పేదల కోసం పడిన శ్రమ అందరి గుండెల్లో నిలిచిపోయేలా చేశారు. ఆదర్శ మూర్తిగా నిలిచారు.

ఈ పామర్రులో ప్రమాణం చేస్తున్నా. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం. అదే ఎన్టీఆర్ గారి సందేశం. పేదల్ని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ గడ్డపై ఎంతో మంది సాహితీ, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు చెందిన ఎంతో మంది హేమాహేమీలు ఈ గడ్డపైనే పుట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, ఛండ్ర రాజేశ్వరరావు, కె.ఎల్.రావు, మండలి వెంకట కృష్ణారావు లాంటి ఉద్ధండులు పుట్టిన గడ్డ ఇది.

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టారు. ఆ జెండా దేశానికి గర్వంగా ఎగురుతోంది. గంటశాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని లాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ ఇది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యన్నారాయణ పుట్టింది ఇక్కడే. అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డపై కొన్ని గంజాయి మొక్కలు పెరుగుతున్నాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి.

సుపరిపాలనకు అర్ధం తెలియని వారు మంత్రులయ్యారు

ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవరు దాడులు చేయిస్తే వారికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. ప్రజలు కోరుకున్నది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. కానీ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచించారా? అమరావతి వచ్చి ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడి నుండి 15కి.మీల దూరం నుండి వచ్చి నూజివీడు, మచిలీపట్నం రోడ్డు గుండా హనుమాన్ జంక్షన్ వద్ద కలిసేది. ఇక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే ఎటు కావాలన్నా పది నిమిషాల్లో వెళ్లేవాళ్లం. భూములకు ధరలు పెరిగేవి. గ్రామాలు, ప్రజల దశ దిశ మారిపోయేవి.

కానీ, ఈ గంజాయి బ్యాచ్ అమరావతితో ఆడుకున్నారు. మూడు రాజధానులు అంటూ బుద్ధీ జ్ఞానం లేని వాళ్లు, గుంతలు కూడా పూడ్చలేనివాడు మూడు రాజధానులు కడతానంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు. పిన్షన్లు సహా ఏ ఒక్కటైనా.. సంపద సృష్టించి, ఆదాయం పెరిగితే ఆ సొమ్మును ప్రజలకు పంచాలి. గతంలో అదే చేశాను. హైదరాబాద్ ను అభివృద్ధి చేశా. పెట్టుబడులు తెచ్చా, పరిశ్రమలు ఏర్పాటు చేశా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాను. ఈ రోజు ఇక్కడి యువత ఇంకా ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కానీ, నేను మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే హైదరాబాద్ కంటే ధీటైన రాజధానిని కడితే.. ఇక్కడే లక్షలాది ఉద్యోగాలొచ్చేవి.

నీళ్లుంటేనే నాగరికత అభివృద్ధి చెందుతుంది :

29 వేల మంది రైతులు 35 వేల ఎకరాల భూముల్ని అందించారు. అమరావతి పూర్తి చేసి ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరేది. ఆ సొమ్ముతో అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి రాగానే ప్రజావేదికను కూల్చేసి విధ్వంస పాలనను ప్రారంభించాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? నీళ్లు ఉన్నందువల్లే కృష్ణా, గోదావరి డెల్టాలు బాగుపడ్డాయి. నీళ్లుంటేనే నాగరికత, అభివృద్ధి జరుగుతుంది. కానీ తర్వాత ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టుకొచ్చారు. ఖరీఫ్ కూడా వేసే పరిస్థితి లేదు.

అదే సమయంలో విభజనతో పోలవరం పనులు మనకు ఇచ్చారు. కానీ, పోలవరం కంటే ముందు పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చాం. అందువల్ల సీజన్ మిస్ కాకుండా పంటలు పండించుకునే అవకాశం వచ్చింది. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని తేల్చేశాడు. కానీ తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే.. ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు కాలువల్లో కన్నీరు పారుతోంది. మళ్లీ హామీ ఇస్తున్నా.. పోలవరం పూర్తయితే కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుంది. రేపు జరిగే ఎన్నికల్లో మన ప్రగతి కోసం ఓటు వేయాల్సిందిగా కోరుతున్నా.

ఏ రైతుకైనా గిట్టుబాటు ధర లభిస్తోందా? ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? అన్ని సమస్యలు పరిష్కరిచే బాధ్యత నేను తీసుకుంటా. రైతును రాజుని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి రైతుకు అన్నదాతతో రూ.20 వేలు ఇస్తా. రైతు కూలీలు, కౌలు రైతులకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

ఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా?

సమైక్య రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. విభజిత రాష్ట్రంలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశాను. గత ఐదేళ్లలో ఏ ఒక్కరికైనా ఉద్యోగమొచ్చిందా? జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ఇచ్చారా? జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలొచ్చే పరిస్థితి ఉందా? జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే. ఇదే అందరి నినాదం. చంద్రబాబు వస్తేనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని ప్రజలందరికీ అర్ధమైపోయింది. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఆలోచించండి. తల్లిదండ్రలను అడుగుతున్నా.. ఉద్యోగం కావాలని కోరుకుంటారా.. లేక గంజాయికి అలవాటు కావాలని కోరుకుంటారా? అభివృద్ధి చేసేశానని ఈ సైకో జగన్ చెబుతున్నాడు.

కానీ, పిల్లల భవిష్యత్తుకు జగన్ పాలనలో గ్యారెంటీ ఉందా? పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మన కంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు. కానీ, మన రివర్స్ పాలకుడు జగన్ రెడ్డి మన జీవితాలను రివర్స్ చేశాడు. పిల్లల్ని ఎంతగా చదివించినా, ఉద్యోగాలు రావు. వారిని ఎక్కడో పొరుగు రాష్ట్రాలకు పంపించే పరిస్థితి కల్పిస్తున్నాడు. అందుకే నేను రాగానే.. ప్రతి యువకుడికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తా. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. అదే సమయంలో ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకుంటా. ప్రతి నియోజకవర్గంలో వర్క్ స్టేషన్ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తా. స్కిల్ డెవలప్ చేసి మెరుగైన ఉద్యోగాలొచ్చేలా చర్యలు తీసుకుంటా. భవిష్యత్తును ఏలబోయేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. కానీ, జగన్ రెడ్డి యువతను గంజాయి, డ్రగ్స్ కి బానిసల్ని చేయాలనుకుంటున్నాడు.

ప్రజల కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకోండి

ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఒక ఓటు, గ్లాసు గుర్తుపై మరో బటన్ నొక్కండి. వర్ల కుమార్ రాజా, వల్లభనేని బాలశౌరిలను గెలిపించండి. సమాజం పట్ల బాధ్యతగల నాయకుడు, వైసీపీలో అరాచకాలు చూసి ఇమడలేకపోయాడు. అమరావతి పోలవరం సహా అన్ని పనులూ నాశనం చేశాడు. చివరికి ఎంపీ సీటు ఇస్తామన్నా మాకొద్దంటూ బయటకొచ్చారు. అలాంటి బాధ్యత కలిగిన నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వర్ల కుమార్ రాజా.. గత ఎన్నికల్లో ఓడిపోయాడు.

కానీ, పార్టీ జెండాను ఎప్పుడూ వదల్లేదు. నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టబోను. ఇలాంటి నాయకులను ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని ఏం చేస్తారో ఆలోచించండి. కష్టకాలంలో పార్టీ కోసం అండగా నిలిచి, పోరాడిన కుటుంబం ఈ వర్ల కుమార్ రాజాది. అవసరమైతే ఎదురు ఖర్చు చేసి వర్ల కుమార్ రాజాను గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిద్దాం. పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తే.. నేను పార్టీ మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన నాయకుడు కొనకళ్ల నారాయణ. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుకునే నాయకుడికి ఉండే గర్వం. దేవినేని ఉమ పార్టీ ప్రారంభం నుండి పార్టీలోనే ఉన్నాడు. సీటు ఇవ్వలేకపోతే.. మారు మాట మాట్లాడలేదు. సీటు కాదు.. పార్టీ ముఖ్యం అన్న నాయకులు వీళ్లు. వీళ్లని గుండెల్లో పెట్టుకునే బాధ్యత నాది.

కొలుసు పార్థసారధి వైసీపీలో ఇమడలేకపోయాడు. అక్కడ ఉంటే.. జాతిక ద్రోహం చేసినట్లేనని బయటకొచ్చి నూజివీడు నుండి బరిలో దిగుతున్నాడు. మనకు నాయకులు కావాలి. జగన్ రెడ్డికి డబ్బులు కావాలి. గంజాయి బ్యాచ్ కావాలి. బ్లేడ్ బ్యాచ్ కావాలి. గొడ్డలి పట్టుకుని తిరిగేవారు కావాలి. కానీ నాకు.. ప్రజల గుండెల్లో ఉండే నాయకులు కావాలి. ప్రజలు ఆలోచించాలి. మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే పార్టీకా.. భవిష్యత్తును అంధకారంలో నెట్టే పార్టీకా? మన ఓటు అభివృద్ధికా విధ్వంసానికా? మన ఓటు సంక్షేమానికా సంక్షోభానికా?

దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే వారికి జగన్ రెడ్డి సన్మానాలు

సంపద సృష్టించి, ఆదాయం పెంచుతాను. ఆ ఆదాయాన్ని పేదలకు పంచిపెడతా. సంక్షేమాన్ని ప్రారంభించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న ఎన్టీఆర్. దాన్ని కొనసాగించింది నేనే. అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, స్టడీ సర్కిల్స్ లాంటి పథకాలేమైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఏమయ్యాయి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు ఎవరికైనా అందుతున్నాయా? వాటిని పునరుద్దరించే బాధ్యత తీసుకుంటాను.

దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. భూమి కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు రద్దు చేశాడు. స్వయం ఉపాధి పథకాలను రద్దు చేశాడు. అంబేద్కర్ కంటే జగన్ రెడ్డి గొప్పవాడా? అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య అమలు చేస్తే.. జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. కానీ, ఒక్కరికి కూడా విదేశాలకు పంపించిన పరిస్థితి లేదు. దళితులకు దగా చేశాడు. తూర్పుగోదావరిలో అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగినందుకు వేధించి వేధించి చంపేశారు. 188 మంది దళితుల్ని చంపేశారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారు. దళితుల్ని ఆదుకుని అండగా నిలిచి తీరుతాను. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు.

ఆదరించిన ఆడబిడ్డల్ని అక్కునే చేర్చుకునే బాధ్యత నాది

గుడివాడలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ.. చిన్న వ్యాపారం చేసుకునే వారి అమ్మాయిని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే గంజాయి బ్యాచ్ ఆ అమ్మాయిని రోడ్డుపై అవమానించారు. తిరుగుబాటు చేసినందుకు వారి షాపులో గంజాయి పెట్టి తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారు. 45 సంవత్సరాలుగా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కష్టబడ్డాను.

‘‘నాకు ఓ చెల్లెమ్మ పంపించింది. కృష్ణుడు లేనిదే భారతం భాగవతం లేదు. చంద్రబాబు లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరం ఎంతో.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అవసరం అంతే.’’ ఆ చెల్లెమ్మ స్ఫూర్తిని మనసారా అభినందిస్తున్నా. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాలి. గంజాయికి అడ్డాగా మారాలంటే జగన్ రెడ్డిని గెలిపించుకోవాలి.

ఇచ్చే ప్రతి రూపాయితో మరింత ఆదాయం పొందేలా మార్గాలు చూపించే బాధ్యత నాది. డ్వాక్రాతో మహిళలకు పొదుపు ఉద్యమం నేర్పించిదెవరు? ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు పెట్టా. సూపర్ సిక్స్ లో మహిళలదే అగ్రతాంబూలం. ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడబిడ్డకూ ప్రతి నెలా రూ.1500 చొప్పున అందించి తీరుతా. తల్లికి వందనంతో చదువుకునే ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున అందిస్తా. ప్రతి రైతుకు ఏటా రూ.20 ఇస్తా. యువతకు నిరుద్యోగ భృతిగా రూ.3000 ఇస్తా.

వృద్ధులకు ప్రతి నెలా ఒకటో తేదీన రూ.4000 పెన్షన్ అందిస్తా. మూడు నెలల పెన్షన్ ఒకటో తేదీన అందించే తీరుతా. ఈ నెల నుండే మీ పెన్షన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఎవరైనా తీసుకోకపోతే.. జులైలో అన్నీ కలిపి ఒకేసారి ఇస్తాను. పెన్షన్ల విషయంలో జగన్ రెడ్డి శవ రాజకీయాలకు తెగబడ్డాడు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు ఇళ్ల వద్దే అందించే పరిస్థితి తీసుకొస్తా. దివ్యాంగులకు నెలకు రూ.6000 పెన్షన్ అందిస్తాను.

అభివృద్ధిలో జీరో.. దోపిడీలో హీరో స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ :

పామర్రులో రేపు ఎన్నికలు కైలే వర్సెస్ వర్ల. పామర్రులో కైలే అనిల్ మినీ లోటస్ పాండ్ కట్టాడు. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ దోపిడీలో మాత్రం నెంబర్ వన్. పమిడిముక్కల మండలం వీరంకిలాకులు వద్ద గ్రావెల్ మాఫియా డాన్ ఈ కైలే. పోలీసు కానిస్టేబుల్ ప్రశ్నిస్తే దాడి చేశారు. సెంటు పట్టాలో రూ.16 కోట్లు మెక్కాడు. ఇళ్ల స్థలాల పంపిణీకి డబ్బులు దండుకున్నాడు. ఇసుక నుండి తైలం పిండాడు. ఎమ్మెల్యే అవినీతి.. ముఖ్యమంత్రి దోపిడీ చూశాక ఇలాంటి ప్రజా నాయకుల అవసరం ఎంతైనా ఉంది. డొంకరోడ్ల నిర్మాణం, సాగునీటి కాల్వల ఆధునికీకరణ ఎంతో అవసరం.

గతంలో నేనే భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాను. ఇలాంటి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను. ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల భూమి కేటాయించి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఇప్పటికే స్థలాలు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాను. లంక గ్రామాలకు రోడ్లు, వంతెనలు కావాలన్నారు. వాటిని పూర్తి చేసి అన్ని లంక గ్రామాలకు రవాణా సదుపాయాలు కల్పించి తీరుతాను.

LEAVE A RESPONSE