సాలూరు @101
ఆయన ఓ పాటల పుస్తకం..
అందులో ఏ పుట నుంచి
ఏ పాటనని ఏరను..
సాలూరు వారి
రసాలూరు గీతాల్లో
ఏవి అద్భుతమని ఎంచను..!?
సరే..మల్లీశ్వరి..
అదో సంగీత రసఝరి..
స్వరమాధురి..
రాగాల విరి..
ఆ దృశ్యకావ్యంలో ప్రతి పాట
అత్యంత శ్రావ్యం..
ఎప్పటికీ నవ్యాతినవ్యం!
ఊరు చేరాలి..
ఒ..గిత్తలు పరుగులు తీయాలి..
ఆ ఆలాపనకు ముందుగా వినిపించే మువ్వల సవ్వడి..
ఎంత తీయని అనుభూతి..
నల్లని మబ్బులు
గుంపులు గుంపులు..
తెల్లని కొంగలు
బారులు బారులు…
అవిగో అవిగో
అ అ అ ఆ ఆ
ఆ రాగాలు
మన చిన్ననాటి సరాగాలు..
దివ్యలోకాలలో విహారాలు..
కళ్ల ముందు
కదలాడే మేఘాలు..
చెవులను చల్లగా తడిపే
వర్షపు చినుకులు..
రాజేశ్వరుని చెణుకులు..!
అన్నట్టు..
మల్లీశ్వరి పలకని రాగమా..
జరగని ప్రయోగమా..
సాలూరు ఆరునెలల సాధన
మనకి చిరకాల రసాస్వాదన..!
కోతి బావకు పెళ్ళంట..
కోవెల తోట విడిదంట..
పిలిచిన బిగువటరా
ఔరౌర..
భీంపలాస,కళంగద..
కీరవాణి..హంసానంది..
ఈ రాగమాలిక..
ఆకట్టుకున్న విరహగీతిక
ఆకాశవీధిలో హాయిగా
ఎగిరేవు
ఊరూరా మార్మోగిపోయిన పాటలు..పులకించిపోయిన
సినిమా చరిత్ర పుటలు..!
మధురగీతాల
మరో పారాయణ..
విప్రనారాయణ
పాలించరా రంగా..
పరిపాలించరా శ్రీరంగా..!
చూడుమదే చెలియా..
కనులా చూడుమదే చెలియా
రారా నా స్వామి రారా..
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా..
సావిరహే తవధీనా..
మేలుకో శ్రీరంగ..
భానుమతి గళం…
సాలూరు సంగీతంలో
సుమంగళం..
సంగీత అభిమానులకు
సన్మంగళాని భవతు..!
రాజేశ్వర రావు సినిమాలో
వీణ మధురోల్లాస నెరజాణ..
పాడమని నన్నడగ తగునా
పరవశించి పాడనా…
ఆయన అడిగితే కాదా
ఆ వీణ సమ్మోహన..!
నీవు లేక వీణ
పలుకలేనన్నది..
నిజానికి ఆ వీణ లేక
రాజేశ్వరుడు పలుకలేడేమో
మ్రోగింది కళ్యాణ వీణ..
నవమోహన జీవన మధువనిలో..
అలా ప్రతి ధ్వనిలో..
ఆ స్రష్ట హృదయ ప్రతిధ్వనిలో..!
అభేరి..మోహన..కల్యాణి..
సింధుభైరవి..శంకరాభరణం..
సాలూరు నచ్చిన రాగాలు..
జగమే మారినది..
మధురముగా ఈ వేళ..
కలలు..కోరికలు
తీరినవి మనసారా…
కల్యాణిలో హాయిగా సాగిన
మధురగీతం..
నా హృదయంలో
నిదురించే చెలీ..
కలలలోనే కవ్వించే సఖీ..
శంకరాభరణంతో ఆరాధన…
పాడవేల రాధికా..
ప్రణయసుధాగీతికా..
మోహనరాగ సమ్మోహనం..
ఇలా ఎన్నని చెబితే
తీరే దాహం..
రాజేశ్వరుని స్వరసప్తాహం..
మధురగీతాల సందోహం…!
ఏడ తానున్నా..
జాడ తెలుపవా
ఆయన పాటలు
అలా మదిలో..
ప్రతి హృదిలో..
సినిమా సన్నిధిలో..
సంగీత జలధిలో..
అవిగో ఆవిగో..
బారులు బారులు..
స్వరఝరులు..!
నేను విజయవాడలో పని చేస్తున్నప్పుడు ఒక సినిమా ఫంక్షన్లో సాలూరు వారి పక్కన చాలా సేపు కూర్చునే అవకాశం దక్కింది. కొన్ని హిట్ సాంగ్స్ అంత ఇంపుగా..వినసొంపుగా ఎలా సమకూరాయన్న విషయాన్ని ఆయన తాను మళ్ళీ కంపోజ్ చేస్తున్నంత తాదాత్మ్యంగా చెబుతుంటే తన్మయంగా వినడమే నా పని.
ఆ పనిలో పనిగా నా చిన్నప్పటి నుంచి విన్న కొన్ని పాటల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని ముచ్చటపడ్డాను.
ఎంతైనా ఒక జిల్లా వాళ్ళమే కాకుండా, నేను కూడా కాస్త సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జర్నలిస్టును కావడంతో, ఆయన కూడా అభిమానంగా మాట్లాడారు. మేము కలిసి కూర్చుని ఉన్నప్పుడు అదే కార్యక్రమానికి వచ్చిన ఏఎన్నార్ ..రండి రాజేశ్వరరావు గారూ అని పిలిచి పక్క సీటు చూపించినా నాక్కూడా ఆ పక్కనే ఇంకో కుర్చీ లేకపోవడంతో పర్లేదని అక్కినేనికి కళ్ళతోనే చెప్పి నాతోనే ఉండిపోయారు నా మ్యూజికల్ హీరో.
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286