కరకు బోయడే అంతరించగా
కవిగా ఆతడు అవతరించగా..
నవరసభరితం
రాముని చరితం
జగతికి ఆతడు
పంచిన అమృతం…!
ఆదికావ్యాన్ని
అందించిన ఆదికవి..
భారతీయ సంస్కృతిలో
ఎప్పటికీ అస్తమించని రవి..
వాల్మీకి మహర్షి..
పూర్వాశ్రమంలో రత్నాకరుడు
ఆ మహర్షి ఆశ్రమమే అయింది
అంతటి మహరాణి సీతమ్మకు
వనవాసాశ్రమ గుడి..
భూజాతకు అమ్మ ఒడి..
అచ్చోటనే చల్లారిందట
శ్రీరామపత్ని మదిలో అలజడి
అదే ఆ తల్లి పిల్లలకు బడి..
అక్కడ సదా
శ్రీరామనామ సవ్వడి..
శ్రీరామభక్తుల సందడి..!
మహర్షి వాల్మీకి ఘంటంలో
అమృతాన్ని మించిన సిరా
అదే శ్రీరామాయణ సిరి..
సృష్టి ఉన్నంతకాలం
నిలిచి ఉండే కావ్యం..
నాటికీ నేటికీ ఏనాటికీ
రసరమ్యం..నవ్యాతినవ్యం..!
వాల్మీకి విరచిత
రామాయణంలో పాత్రలు..
ఏ ప్రాయంలోనైనా ఆదర్శప్రాయం..
ఒకే మాట ఒకే బాణం
ఒకే పత్ని..
రాముని నియమం..
క్షమయా ధరిత్రి..
ఆ ధరిత్రికే పుత్రి
తల్లి సీత..
పతి ఆనతి
జవదాటని సాధ్వి
ఇప్పుడా లక్షణమే
అరుదై నివ్వెరపోతున్న పృథ్వి!
అగ్రజునిలో జనకుని
చూసే అనుజులు..
కలియుగంలో ఆస్తుల కోసం కుమ్ములాడుకుంటున్న
దనుజులు..
నేటి తరంలో ఇలా ప్రతి పాత్ర
అపాత్రమై..
ఆచారానికే రామాయణం
ఆచరణకు డ్రామాయణం..!
రామాయణం కల్పితమని
కొట్టిపడేసే కొందరికి..
ఇదిగో ఓ చిన్నమాట…
మీ దృష్టిలో
శ్రీరాముడు ఊహైనా
వాల్మీకి వాస్తవమే కదా..
రాముని పాత్రే
నిజమైన ఇజం..
ఏ యుగానైనా మనిషి
ఎలా ఉండాలి..
ఎంత ఉన్నతంగా జీవించాలి
రాముని రూపంగా
నిర్వచించిన మహర్షి
విలువలు పూజ్యమైన
నేటి యుగంలో
వాల్మీకి ప్రవచించిన
రామరాజ్యం..
వాస్తవ సాధ్యమా..!?
వాల్మీకి రామాయణం
ఏడు కాండలు..
ఇప్పుడున్నది
అన్నిటా అరణ్యకాండ..
కొండొకచో కిష్కింద..
ఆపై యుద్ధకాండ..!
అంత గొప్పదని కోదండం
రాసినందుకు నీకో దండం..
రాముని నీతి..నిరతి..
అనుసరిస్తే..ఆచరిస్తే..
ముష్కరుల ఏలుబడిలో
తప్పదు చేతికి అరదండం..!
రామాయణ సృష్టికర్తకు శతసహస్ర ప్రణామాలతో..
– సురేష్ కుమార్ ఎలిశెట్టి
విజయనగరం
9948546286
7995666286