Suryaa.co.in

Andhra Pradesh

కష్టాల్లో ప్రజలకు నేనున్నానంటూ భరోసా

-పసుపు సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జైత్రయాత్ర
-బాధితులకు అండగా సంక్షేమ నిధి ద్వారా సాయం
-పీడిత వర్గాలకు తోడుగా నిలిచిన యువనేత
-కుటుంబసభ్యుడిలా భావించిన ఆయా వర్గాల ప్రజలు

అమరావతి: నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ నేను న్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ కృతకృత్యులయ్యారు. భరోసా అన్నది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించి అసలు సిసలైన ప్రజానాయకుడయ్యారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా మంగళగిరి నియోజక వర్గంలో సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి పేదప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. యువగళం పాదయాత్రలో తమవద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్న ఆపన్నులకు తమవంతు సాయం అందించి అండగా నిలచారు. 3132 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమందికి పార్టీపరంగా, వ్యక్తిగతంగా సాయమందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో మునిరాజప్ప అనే రజక మహిళ యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకుంది. లోకేష్‌ను కలిసి సమస్యలు చెప్పిందన్న అక్కసుతో అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి 27-2-2023న ఆమె టిఫిన్‌ బడ్డీని ధ్వంసం చేశారు. వైసీపీ కార్యాలయానికి వచ్చి తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబితే వదిలేస్తామన్నారు. నేను చనిపోవడానికైనా సిద్ధమే..క్షమాపణ చెప్పనని ఆమె తెగేసి చెప్పింది.

ఆ తర్వాత మునిరాజమ్మ లోకేష్‌ వద్దకు వచ్చి జరిగింది చెప్పడంతో ఆయన వెనువెంటనే స్పందించారు. మునిరాజమ్మ కొత్తషాపు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించారు. ధర్మవరంలో పాదయాత్ర సందర్భం గా చేనేతలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో రాములమ్మ అనే మహిళ అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బిడ్డలకు చదువు చెప్పించలేక పోతున్నానని కన్నీరుమున్నీరైంది. దీంతో చలించిపోయిన లోకేష్‌…ఆమె ఇద్దరి బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కూలులో చేర్పిం చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో దళిత మహిళా రైతు రంగమ్మ తన బాధను వెల్లబోసుకుంది. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయడం వల్ల రూ.30 లక్షల అప్పుకావడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అక్కడికక్కడే రంగమ్మకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు. పాదయాత్ర ఆ నియోజకవర్గం దాటక ముందే 30-4-2023న ఎమ్మిగనూరు సభలో సంబం ధిత చెక్కును రంగమ్మకు అందించారు. దారిపొడవునా ఇలా ఎంతోమందికి యువనేత సాయమందించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను వెనువెంటనే చేయూత నందించే ఈ సాయగుణం, సమస్యలపై వెనువెంటనే స్పందించే తీరు లోకేష్‌ మాటపై ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని కలిగించింది.

కుటుంబసభ్యుడి మాదిరిగా కష్టాల ఏకరువు
పాదయాత్ర సమయంలో కుటుంబసభ్యుడి మాదిరిగా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. కమ్యూనిటీ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను సైతం యువనేతకు చెప్పి సాంత్వన పొందారు. పలమనేరులో వైసీపీ నేత సునీల్‌ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న చదువుల తల్లి మిస్బా తల్లిదండ్రులు నసీమా, తండ్రి వజీర్‌ అహ్మద్‌ పుంగనూరు నియోజకవర్గం కల్లూరు వద్ద పాదయాత్ర సమయంలో లోకేష్‌ను కలిశారు. లోకేష్‌ ను కలిస్తే ఊళ్లో ఉండనివ్వం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందేనని వైసీపీ నేతలు బెదిరించినా లెక్కచేయకుండా మిస్బా తల్లిదండ్రులు యువనేత వద్దకు వచ్చారు. వైసీపీ నాయకుడు సునీల్‌ కుమార్తెకి సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ప్రిన్సిపాల్‌పై ఒత్తిడి చేసి తమ కుమార్తెకు టీసీ ఇచ్చి బయటకి పంపేశారని, ఆ అవమానాన్ని భరించలేక మా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కన్నీరు మున్నీర య్యారు. మిస్బాకు సంబంధించిన మార్కుల లిస్టులు, డ్రాయింగ్‌ పుస్తకాలు, వివిధ పోటీల్లో మిస్బా సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చి చూపిం చినప్పుడు యువనేత చలించిపోయారు.

ప్రజాప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేస్తామని, మిస్బాను పొట్టనబెట్టుకున్న వారిని కటకటాల వెనక్కి పంపుతామని ధైర్యం చెప్పారు. 27-7-2023న ఒంగోలులో జరిగిన జయహో బీసీ సదస్సులో వైసీపీ ముష్కరుల చేతిలో బలైన రేపల్లెకు చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ అక్క హేమశ్రీ…లోకేష్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పకుంది. నన్ను ఏడాదిన్నరగా వైసీపీ కీచకులు ఏడిపిస్తుంటే నా తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్‌ పోసి తగు లబెట్టేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. కేసు కూడా సరిగా నమోదు చేయలేదు. బీసీలు ఏమీ చేయలేరు… ప్రశ్నించలేరనే ఈ విధమైన అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో లోకేష్‌ స్పందిస్తూ… ఇలాంటి మరో చెల్లికి, అక్కకి జరగకుండా చూసే బాధ్యతను ఈ లోకేష్‌ తీసుకుంటాడు. అధికారంలోకి వచ్చాక అమర్నాథ్‌ గౌడ్‌ హత్య వెనుక ఎంతటి వాడు ఉన్నాసరే తీసుకొచ్చి జైల్లో పడేస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తెస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఈ హామీని మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఆయావర్గాలకు యువనేత కల్పించిన భరోసాతోనే ఎన్నికల్లో ఓట్లవర్షం కురిపించింది.

యువనేత బలం, బలగం టీడీపీ కార్యకర్తలే…
సుదీర్ఘ పాదయాత్ర చేసినా, రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం వంటి కార్యక్రమాలతో సుడిగాలి పర్యటన చేసినా తనకోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలే యువనేత లోకేష్‌ బలం, బలగం. యువగళం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన 400 మంది వాలంటీర్లు క్రమశిక్షణగల సైనికుల్లా పనిచేశారు. యువగళం పాదయాత్రను ఏ విధంగానైనా భగ్నంచేయాలని వైసీపీ తొత్తులుగా మారిన పోలీసులు ఒకవైపు, వైసీపీ ముష్కర మూకలు మరోవైపు ఎంత రెచ్చగొట్టినా వాలంటీర్లు ఎంతో ఓర్పుతో సేవలందించారు. అదేవిధంగా తమను నమ్ముకున్న కార్యకర్తలకు యువనేత లోకేష్‌ కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.

ఒకవైపు పాదయాత్ర చేస్తూనే క్షేత్రస్థాయిలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కేడర్‌కు యువనేత అండగా నిలిచారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ కార్యకర్త చిట్టిబోయిన పెద్ద వెంగయ్యని వైసీపీ నేతలు అత్యంత దారుణంగా హతమార్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతసాగరంలో నిర్వహించిన బహిరంగ సభలో మృతుడు భార్య ధన లక్ష్మమ్మకి 16-6-2023న రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు యువనేత నారా లోకేష్‌ను కలిశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేయడంతో కార్యకర్తల సంక్షేమ నిధినుంచి సాయం అందించారు. ఇలా దేశంలో మరెక్కడా లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.130 కోట్ల సాయం అందించారు. లోకేష్‌ ఇచ్చిన ఈ భరోసాతోనే ఎన్నికల కురుక్షేత్రంలో అరాచక ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి పార్టీని విజయతీరాలకు చేర్చారు.

LEAVE A RESPONSE