-విస్తృతస్థాయి సమావేశంలో మంగళగిరి నేతల ప్రతిన
మంగళగిరి: రాష్ట్రంలో 5కోట్లమంది మంది ప్రజల గొంతుకై యువగళాన్ని విన్పించిన యువనేత లోకేష్ ను రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేలా యావత్ మంగళగిరి టిడిపి కేడర్ కలసికట్టుగా సంకల్పించాలని మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య పిలుపునిచ్చారు. తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
సమావేశంలో అబద్దయ్య మాట్లాడుతూ… గత ఎన్నికల్లో లోకేష్ ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని సొంత నిధులతో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 27 సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2014-19వరకు చంద్రబాబు పరిపాలన చూశాం, ఉమ్మడి రాష్ట్రంలో బాబు పాలన చూశాం, సంక్షేమంతోపాటు అనేక పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం ప్రాజెక్టును 72శాతం పూర్తిచేశారు, రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పలు నిర్మాణాలు చేపట్టారు. లోకేష్ పంచాయితీ, ఐటి మంత్రిగా పలు పరిశ్రమలు తేవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల రోడ్లు నిర్మించారని చెప్పారు.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ… యువగళం ద్వారా రాష్ట్రప్రజలకు నేనున్నానని భరోసా నిచ్చిన నారా లోకేష్ ను లక్షఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు నియోజకవర్గంలోని కేడర్ అంతా రాబోయే 100 రోజులు కష్టపడి పనిచయాల్సి ఉంది. మనం రాక్షసుడితో పోరాడుతున్నాం, కలిసికట్టుగా యుద్ధం చేయాల్సి ఉందని చెప్పారు.
గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ… యువనేత లోకేష్ ప్రజాగళాన్ని యువగళంగా రాష్ట్రవ్యాప్తంగా విన్పించారు, ఎన్నికల్లోగా అన్ని నియోజకవర్గాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. మనందరం కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో లక్షఓట్ల మెజారిటీ తగ్గకుండా గెలిపించుకుని, ఆయనకు బహుమతిగా ఇద్దాం, ఇందుకోసం ప్రతి కార్యకర్తా ప్రతినబూనాలి.
గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ అనేక మోసపూరిత వాగ్దానాలతో అన్నివర్గాల ప్రజలను మోసగించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అమరావతిని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో లక్షఓట్ల మెజారిటీ సాధించేవరకు ఎవరూ విశ్రమించవద్దు. రాష్ట్రంలో 160 పైచిలుకు స్థానాల్లో మనం గెలవబోతున్నాం.
మంగళగిరిలో కలసికట్టుగా పనిచేసి యువనేత లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పోతినేని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ నాయకులు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన బాధ్యులు పాల్గొన్నారు.