తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత లోకేష్ భేటీలు

-అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి, అందె నాగ ప్రసాద్, తుమ్మా సాంబశివరావులను కలిసిన లోకేష్
-చేనేతదారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై టిడిపి యువనేత నారా లోకేష్ తటస్థ ప్రముఖులతో వరుస భేటీలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులను కలుసుకొని వారి సలహాలు స్వీకరిస్తున్నారు. మంగళగిరి రూరల్ మండలం ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యులు అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిని యువనేత లోకేష్ గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

గత 50ఏళ్లుగా అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి మంగళగిరిలో నివాసముంటూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన లోకేష్ ను సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులు సత్కరించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్ర చిత్రపటంలో నిలిపేవిధంగా అభివృద్ధి చేయాలన్నది తమ సంకల్పమని, ఇందుకు మీవంతు సహకారం అందించాలని లోకేష్ కోరారు. అనంతరం మంగళగిరికి చెందిన ప్రముఖ చేనేతవస్త్ర వ్యాపారి అందె నాగప్రసాద్ ను కలుసుకుని నియోజకవర్గంలో చేనేతలు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను తెలుసుకున్నారు.

తర్వాత మంగళగిరికి చెందిన టిఎస్ఆర్ హ్యాండ్ లూమ్స్ అధినేత తుమ్మా సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలో చేనేతలను తాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తాను ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మంగళగిరి చేనేత వస్త్రాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించినట్లు చెప్పారు. యువగళంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రలో చేనేతలు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి .

Leave a Reply