* 7 నెలల్లో రూ.6.33 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు
* 4 లక్షల మందికి ఉపాధి లబ్ధి
* సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన విజయవంతం
* త్వరలో పలు సంస్థల సీఈవోలు, ప్రతినిధులు రాక
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని, కేవలం ఏడు నెలల కాలంలో రూ.6.33 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని తెలిపారు. దీనివల్ల నాలుగు లక్షలకు మందికి పైగా ఉపాధి లభించే అవకాశముందని తెలిపారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. మంత్రి నారా లోకేశ్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు సోమవారంతో రెండేళ్లు గడిచిందన్నారు. ఏపీ రాజకీయ యవనికపై యువగళం పాత్ర చెరగని ముద్ర వేసిందని, రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని అన్నారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలో మీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగిందన్నారు.
ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంలతో సంపూర్ణ విజయం సాధించిందని, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసిందని తెలిపారు. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం మంత్రి లోకేష్ పాదయాత్రను ఆపలేదన్నారు. ఎండ, వాన, తుపానులను సైతం లెక్కచేయకుండా మంత్రి లోకేష్ పాదయాత్రను కొనసాగించారన్నారు.
7నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
అధికారంలోకి వచ్చాక యువతకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని యువనేత, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోందని మంత్రి సవిత తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయాన్నారు. వాటి వల్ల 4 లక్షలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంత కృషితో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్, గూగుల్, టిసిఎస్, వీడియోకాన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పలు సంస్థలు, పరిశ్రమల సీఈవోలు, ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారన్నారు. ఏపీ బ్రాండ్ మరోసారి ఊపిరిపోసుకుందన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చుతున్నాం
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఉచిత ఇసుక అందజేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేశామని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు ప్రారంభించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలో తల్లికి వందనం, రైతు భరోసా పథకాలు కూడా అమలు చేయబోతున్నామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను వంద శాతం మేర అర్హులందరికీ అందచేస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రతి ఇంటిలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దే బృహత్తుర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి సవిత తెలిపారు.
ఉనికి కోసమే జగన్ విమర్శలు
కేవలం ఏడు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబునాయుడికే దక్కుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్, ఆయన పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న నాయకులను, కార్యకర్తలను అడ్డుకోలేక, తన ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జగన్ పై మంత్రి సవిత విరుచుకుపడ్డారు.