– మొంథా విషాదంపై సీఎం అంతర్మథనం!
ఈ ప్రజలకు నేను ఎలా సాయం చేయగలను?- హెలికాప్టర్లో చంద్రబాబు మొహంలో ఆవేదన!
ఆకాశం నుంచి చూస్తే… అది కేవలం తుపాను వర్షపు నీరు కాదు, అది వేలమంది రైతుల కష్టం, ఆశల సమాధి!
మొంథా తుపాను సృష్టించిన బీభత్సం తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ నిర్వహించారు. హెలికాప్టర్ కిటికీలోంచి కళ్లముందు కదలాడిన ఆ దృశ్యాలు.. మాటల్లో వర్ణించలేని మొంథా విషాదాన్ని కళ్లకు కట్టాయి.
పచ్చని ప్రాంతాన్ని విశాలమైన నీటి మడుగులు, నిస్తేజమైన తుపాను నీటి ప్రపంచంగా మార్చేశాయి. ఎటు చూసినా నీరే! ఇళ్ళు, గ్రామాలు తాము ఒకప్పుడు జీవించిన నేలపైనే ఇప్పుడు నిస్సహాయంగా తేలియాడుతున్నట్లు కనిపించాయి. శ్రమ తెలియని ఆ వర్షపు వరద నీరు, నెలల తరబడి రైతులు పడ్డ కష్టాన్ని కొన్ని గంటల్లో కబళించిన వైనం, ఆ దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది.
నష్టం తీవ్రతను చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ముఖంలో కనిపించిన ఆ ఆవేదన కేవలం అధికారిక సమీక్షకు సంబంధించినది కాదు. “మనం ఎంత ప్రయత్నించినా ప్రకృతి ముందు ఎంత చిన్నవాళ్లం? ఈ ప్రజలకు నేను ఎలా సాయం చేయగలను?” అనే అంతర్మథనంలా అది కనిపించింది.
ఏ ఊరు, ఏ పొలం ఎంతగా నష్టపోయిందో ఆకాశం నుంచి అంచనా వేస్తూ… కింద ఉన్న బాధితులకు త్వరగా సాయం చేరే మార్గాలపై ఆయన తపన పడుతున్న ప్రతి క్షణం, ఆ దృశ్యాలలో ప్రతిబింబించింది. ఈ విజువల్స్ చూసిన తర్వాత.. ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత వేగంగా, మానవత్వంతో పనిచేయమని ఆయన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. మొంథా తుపాను నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా సీఎం పంపించారు. అన్నదాతలలోని దిగులు స్థానంలో తిరిగి ఆశలను కలిగించి భరోసాను నింపుతుంది.