Suryaa.co.in

Andhra Pradesh

ప్రమాదాలకు నిలయంగా… మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్

-డివైడర్ కోసం రైతుల పట్టు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ దశాబ్దాలుగా విశేష గుర్తింపు పొందింది.అయితే ఈ మార్కెట్ కు రాకపోకలు సాగించడానికి రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అనేక ప్రమాదాలు జరిగి కొంత మంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది క్షతగాత్రులుగా మిగిలారు. దీనంతటికి కారణం మార్కెట్ వద్ద రాకపోకలకు డివైడర్ లేకపోవడమే.

మడికి సెంటర్ నుంచి కడియం మండలం పొట్టిలంక వరకు మధ్యలో డివైడర్ సౌకర్యం లేదు. అయితే ఈ మధ్యలో అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ ఉంది. దీంతో రావులపాలెం వైపు నుంచి వచ్చే రైతులు వారి పండించిన పంటలను మోటార్ సైకిల్ ఆటోల ద్వారా మడికి నుండి రాంగ్ రూట్ లో మార్కెట్కు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాదు మార్కెట్లో కొనుగోలు చేసిన కూరగాయలను కడియం పొట్టిలంక వైపుకు కూడా రాంగ్ రూట్ లోనే తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో కూడా ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి.

ఈ ప్రమాదాలు నివారణకు నేషనల్ హైవే అధికారులు పలుసార్లు పరిశీలన జరిగినప్పటికీ ఏమీ చేయలేకపోతున్నారు. రైతులు కొనుగోలుదారులు మార్కెట్ ఎదురుగా రాకపోకలకు డివైడర్ సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ మార్కెట్ కు నిత్యం గోదావరి జిల్లాల నుండే గాక తెలంగాణ, ఒడిస్సా, పశ్చిమబెంగాల్ ప్రాంతాల నుంచి కూరగాయల ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి.

సీజన్ బట్టి కొన్ని రకాల కూరగాయలను ఇక్కడకు దిగుమతి చేసుకుంటే మరికొన్ని రకాల కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.అందువల్ల ఇక్కడకు పెద్ద ఎత్తున రైతులు పండించిన పంటలతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారాలు వాహనాల పై తీసుకెళుతూ ఉంటారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి మార్కెట్ ఎదురుగా రాకపోకలకు డివైడర్ సౌకర్యం కల్పించాలని కూరగాయల రైతులు వ్యాపారులు కోరుతున్నారు

LEAVE A RESPONSE