‘మహా’ జనానికి కారణమయిన జగన్‌ సర్కార్‌

– ద్విచక్రవాహనాలపై వచ్చిన మహిళలు
– ఎడ్లబండ్లు, సైకిళ్లపై ఒంగోలు మహానాడుకు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అణచివేస్తే ఆ ఆగ్రహం రెట్టింపవుతుంది. అవమానం లక్ష్యసాధనకు మరింత దగ్గరచేస్తుంది. వేధింపులు విజయం కోసం పిడికిలి బిగిసేలా చేస్తాయి. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. ఇప్పటి ఏపీ సీఎం జగన్‌ అప్పుడు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ కసి, పట్టుదలే ఆయనను గద్దెనెక్కేలా చేసింది. కాంగ్రెస్‌ చేసిన అవమానం భరించలేక సొంత పార్టీ పెట్టి జననేతగా అవతరించారు. ఆ తర్వాత తన ముఖంతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న టీడీపీ సర్కారుపై, పాదయాత్ర అస్త్రంతో అనూహ్య విజయం సాధించారు. ఇదంతా అణచివేత, వేధింపు, అవమానానికి ఇచ్చిన సమాధానమన్నది నిష్టుర నిజం.

ఈ లౌక్యం, జీవితసత్యం తెలిసిన ఏ నాయకుడూ ప్రత్యర్ధి జోలికి వెళ్లరు. సొంతంగా తన బలం పెంచుకోవాలని చూస్తారే తప్ప, ప్రత్యర్ధిని మళ్లీ అదే అవమానాలు, వేధింపులు, అవమానాలతో కెలికి కయ్యం పెట్టుకోరు. కానీ.. ఇప్పుడు ఏపీలో జగన్‌ పార్టీ మళ్లీ అదే చేస్తోంది. తాను ఏ కసితో అయితే అధికారంలోకి వచ్చేందుకు ఏ అంశాలు కారణమయ్యాయో, ఇప్పుడు అదే అంశాల అవకాశాలను టీడీపీకి ఇస్తుండటమే ఆశ్చర్యం.

టీడీపీ మహానాడును ఆ పార్టీ పెట్టిన నాటి నుంచీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ హయాంలో కూడా అనేక మహానాడులు నిర్వహించింది. ఏ ప్రభుత్వమూ దానికి పెద్దగా ఆటంకాలు సృష్టించిన దాఖలాలు లేవు. చివరకు టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునూ రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే మహానేత దివంగత వైఎస్‌ కూడా ఎక్కడా అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ఆ పని వైసీపీ సర్కారు ప్రారంభించడమే చర్చ-రచ్చకు కారణం.

ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు స్వాగత తోరణాలు, పార్టీ జెండాలు, బంటింగులు, ఫ్లెక్సీలను నగర పాలక సంస్థ తొలగించేసింది. కలెక్టర్‌ దేశాల ప్రకారమే ఆపనిచేశామని కమిషనర్‌ ప్రకటించారు. నిజానికి ఏ
MAHA-1 పార్టీ అయినా తన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అధికారుల నుంచి అనుమతి తీసుకుంటుంది. ఆ విషయంలో చివరకు అధికార పార్టీలు కూడా అనుమతి తీసుకోవలసిందే. టీడీపీ హయాంలో వైసీపీ.. తన ప్లీనరీని మంగళగిరి ప్రాంత ంలో భారీ స్థాయిలో నిర్వహించింది. దానికి అన్ని అనుమతులు తీసుకుంది. గుంటూరు-విజయవాడ మధ్యన ఉన్న అన్ని ప్రాంతాల్లో బ్యానర్లు, బంటింగులు, ఫ్లెక్సీలు కట్టింది.

కానీ అప్పటి టీడీపీ సర్కారు వాటిని తొలగించిన సందర్భం లేదు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఆయన పార్టీ నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, వాటినీ తొలగించలేదు. నాటి సర్కారు వీటిని రాజకీయ కార్యకలాపాల కోణంలో చూడటమే దానికి కారణం. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తన పార్టీ అధికారంలో ఉన్న జడ్పీ, మున్సిపల్‌ కార్పొరేషన్లలో గానీ మహానాడు ఏర్పాటుచేసేది. అక్కడయితే అనుమతులు సులభంగా వస్తాయన్న ధీమానే అందుకు కారణం.

ఒంగోలు మున్సిపల్‌ స్టేడియంలో మహానాడు నిర్వహించాలన్న టీడీపీ వినతిని అధికారులు తిరస్కరించారు. దానితో ఒక ప్రైవేటు స్థలంలో మహానాడు ఏర్పాటుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. క్రైస్తవ కూటములు, ధార్మిక సంస్ధల సభలకు అనుమతి ఇచ్చే అధికారులు.. మహానాడు నిర్వహణను ఎందుకు అడ్డుకున్నారో కారణం బహిరంగమే. అయితే ఇది తమ్ముళ్లను మరింత రెచ్చగొడుతుందని, పాలకపక్షం ఊహించకపోవడమే ఆశ్చర్యం. మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. సరే.. ఏ ప్రభుత్వంలో ఉన్నా, అధికారపార్టీ చేసే పని అదే కాబట్టి దాని గురించి చర్చ అనవసరం. కానీ ప్రైవేటు బస్సులు కూడా ఆపాల్సిన అవసరం ఏమిటన్నది అర్ధం కాదు. ఇది తెదేపాయులను మరింత రెచ్చగొట్టింది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేం ఎడ్లబండ్లు, మోపెడ్లు, సైకిళ్లు, అవసరమైతే పాదయాత్రగానయినా ఒంగోలుకు చేరుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

చెప్పినట్లుగానే.. ఒంగోలు మహానాడుకు ఎడ్లబండు, సైకిళ్లమీదకు వస్తుండటం చూసిన వారంతా ఆశ్చర్యపడక తప్పనిపరిస్థితి. మహిళలు ఇంకో అడుగు ముందుకేసి.. బుల్లెట్‌, స్కూటీ, యాక్టివాల మీద

వందల సంఖ్యలో ఒంగోలుకు వెళ్లడం సర్కారుకు షాకే మరి. తెలుగుమహిళలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై మహానాడుకు వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా అన్నట్లు.. ఈ పరిస్థితికి తమ సర్కారే కారణమన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘వాళ్లను అలా వదిలేసి మున్సిపల్‌ స్టేడియం ఇచ్చి ఉంటే 15 నుంచి 30 వేల మంది వరకూ వచ్చేవాళ్లు. ఇప్పుడు వాళ్లు 150 ఎకరాల స్థలాన్ని వేదికగా సృష్టించుకున్నారు. మేం అడ్డంకులు సృష్టించడం వల్ల ఇప్పుడు వేలు, లక్షల మంది వచ్చేందుకు ఒకరకంగా మేమే అవకాశం ఇచ్చాం’’అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మహిళలు ద్విచక్రవాహనాలపై వస్తున్న దృశ్యాలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎంత అణచివేస్తే అంతకంటే తీవ్రంగా పైకిలేస్తారు. మా జగన్‌సార్‌ కూడా అలాగే సీఎం అయ్యారన్న కనీస పరిజ్ఞానం, రాజకీయ అనుభవం లేని వాళ్లు మా పార్టీలో నిర్ణయాలు తీసుకుంటున్నార’ని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Leave a Reply