13వ రోజుకి మహాపాదయాత్ర..గుడివాడలో తనిఖీల పేరుతో ఆంక్షలు

గుడివాడ : అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కౌతవరం నుంచి రైతులు ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా సాగుతోన్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కంకిపాడు మండలం దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

పాదయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివెళ్తున్న రైతులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇటు విజయవాడ నుంచి పామర్రు, గుడ్లవల్లేరు వరకు, మచిలీపట్నం నుంచి గుడివాడ రోడ్డు, విజయవాడ-గుడివాడ, గుడివాడ-ఏలూరు రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. దొండపాడు నుంచి వస్తున్న రైతులను గుడివాడ రోడ్డులో అడ్డుకున్న కంకిపాడు పోలీసులు.. కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతల దృష్ట్యా.. పాదయాత్రకు వెళ్తున్నామని చెప్పే వారిని వెళ్లవద్దంటూ అక్కడే నిలిపివేస్తున్నారు. మీడియా ప్రతినిధులను సైతం గుర్తింపు కార్డులుంటేనే పాదయాత్రకు వెళ్లడానికి అనుమతులు ఇస్తున్నారు.

మరోవైపు గుడివాడ పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు గుడివాడ వన్ టౌన్ పోలీసులు ప్రకటించారు. పాదయాత్రలో హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నడుచుకుంటే చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ద్వారా పోలీసులు హెచ్చరించారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, తెదేపా నేత వర్లకుమార్‌రాజా సంఘీభావం ప్రకటించారు. అంగలూరు వద్ద వారు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు గుడివాడ వస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిని నాశనం చేయాలనుకోవడం ఎవరి తరం కాదని తెదేపా నేతలు తేల్చి చెప్పారు. పాదయాత్రలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, తెదేపా నాయకులు వస్తుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.

పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయి: కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా
అమరావతి రైతుల పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం గుడివాడ నగరం గుండా వెళ్తున్న సందర్భంగా గుడివాడ నగరం అంతా పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైకోర్టు 600 మందితో యాత్రను ముగించమని అనుమతించింది.హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని కోరుతున్నాము.బాధ్యత రహిత్యంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవుగుడివాడలో శాంతి భద్రతల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నాము. ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా తెలియజేశారు.

Leave a Reply