రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించిన భారతీయ రాజు మహారాజా జైసింగ్

రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించిన భారతీయ రాజు మహారాజా జైసింగ్

తనను అవమానించిన రోల్స్ రాయిస్ కంపెనీకి తగిన బుద్ధి చెప్పడం కోసం ఓ భారతీయు రాజు ఆ కార్లను చెత్త తరలించేందుకు వాడాడు.
ఇది 1920ల నాటి సంగతి. రాజస్థాన్‌లోని ఆళ్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లాడు. రాచ దుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధిలో వెళ్తుండగా.. ఆయనకు రోల్స్ రాయిస్ కార్ల షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర, వివరాలు కనుక్కుందామని జై సింగ్ షోరూంలోకి వెళ్లారు.
భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్‌మెన్ సాధారణ వ్యక్తి అనుకొని మహారాజుతో హేళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పని చేశాడు. ఆ అవమానంతోనే హోటల్‌కు వెళ్లిన జైసింగ్.. ‘ఆళ్వార్ మహారాజు గారు మీ షోరూంకి వస్తున్నారు. ఆయనకు కార్లు కావాలి’ అని కబురు పంపారు.
మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు. ఆ షోరూంలో ఉన్న ఆరు కార్లనూ కొనుగోలు చేసిన జై సింగ్.. ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందించారు.
కార్లు భారత గడ్డ మీదకు చేరగానే.. వాటిని ఆళ్వార్ మున్సిపాలిటీలో వీధులు ఊడ్చడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు
maharajaమాత్రమే కొనుగోలు చేసే కారు కాస్తా.. చెత్త బండిగా మారింది. రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోటా ఈ నోటా బయటి ప్రపంచానికి తెలిసింది.
దీంతో రోల్స్ రాయిస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించే వారు కాస్తా.. చెత్తబండిగా భావించడం మొదలు పెట్టారు. మా కార్లు కొనండి అని రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే.. ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా.. అవి మాకొద్దు అనే వాళ్ల సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి.
దీంతో లబోదిబోమని గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. మహాప్రభో.. లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మీకు మరో ఆరు రోల్స్ రాయిస్ కార్లు పంపిస్తున్నాం. కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి, వీధులు ఊడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలీగ్రాం పంపించారు. దీంతో శాంతించిన మహారాజు గారు.. చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయిస్ కార్లను మినహాయించారు. దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది.

Leave a Reply