– పీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్
– ఖరారు చేసిన ఏఐసీసీ
– నెగ్గిన రేవంత్ మాట
– నిజమైన ‘సూర్య’ కథనం
– ముందే చెప్పిన ‘సూర్య’
( సుబ్బు)
నాలుగవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
మహేష్‌కుమార్‌గౌడ్‌కే పీసీసీ పట్టాభిషేకం జరగబోతోందంటూ పీసీసీ ‘బొమ్మ’పడినట్లే అన్న శీర్షికతో తో ఆగస్టు 24న ‘సూర్య’లో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కథనాన్ని నిజం చేస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా మహేష్‌కుమార్ గౌడ్ నియామకంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజికవర్గ సమీకరణ సమతుల్యం పాటించినట్లయింది. ముఖ్యమంత్రిగా రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గాలకు చెందిన నేతలను నియమించిన నాయకత్వం.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్ గౌడ్‌ను నియమించడంతో, అన్ని వర్గాలకు సమన్యాయం చేసినట్టయింది.
తన వారసుడిగా మహేష్‌ను ఎంపిక చేయాలన్న సీఎం,పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సూచనను నాయకత్వం గౌరవించింది. పార్టీ-ప్రభుత్వ సమన్వయం కోసం ఆయన మహేష్‌గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా వివాదరహితుడు, పుట్టు కాంగ్రెస్‌వాది అయిన మహేష్‌కుమార్ గౌడ్ నియామకంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 , 2014లో వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు.
ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా అద్భుతంగా పనిచేసిన రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామని ప్రకటనలో తెలిపారు.