Suryaa.co.in

Editorial

నందిగం సరే.. మిగిలిన వారెక్కడ?

– సురేష్‌ది అరెస్టా? లొంగుబాటా?
– పోలీసులు వచ్చేవరకూ ఇంట్లోనే ఉన్న నందిగం
– మందుకొట్టే వరకూ పోలీసులు బయటే ఉన్నారా?
– దళితకార్డు కోసమే నందిగం దొరికిపోయారా?
– సకలశాఖ మంత్రి బృందమే సలహా ఇచ్చిందా?
– అప్పిరెడ్డికి టీడీపీ నేతలే సహకరిస్తున్నారా?
– ఆయనకు ఓ గుంటూరు రూరల్ పోలీసు అధికారి ఉప్పందిస్తున్నారా?
– అప్పిరెడ్డితో గుంటూరు టీడీపీ నేతలకు వ్యాపార సంబంధాలు
– దేవినేని అవినాష్, జోగిని పట్టుకోలేరా?
– అవినాష్ బెజవాడలోనే ఉన్నారా?
– జోగికి అనారోగ్య సమస్యలతో జోగి జంప్
– వీరికి పోలీసులే సహకరిస్తున్నారా?
– దళితకార్డు సంధిస్తున్న వైసీపీ సోషల్‌మీడియా
– నందిగం భుజంపై తుపాకి పెట్టి సర్కారుపై గురి పెట్టే కులతంత్రం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై ముష్కరమూకల దాడికి పధక రచన చేసిన మాజీ ఎంపి నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ అదే కేసులో బెయిల్ తిరస్కరణకు గురై.. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ను పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యంపై, టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వీరికి కొందరు పోలీసు అధికారుల సహకారం ఉందన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే నందిగం సురేష్ అరెస్టు నేపథ్యంలో.. దీనిని కులరాజకీయాలకు అనుకూలంగా మలచుకునే ఎత్తుగడతో, వైసీపీ సోషల్‌మీడియా రంగంలోకి దిగింది. దళిత కార్డు ప్రయోగంతో ఆ వర్గం మద్దతు సంపాదించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అసలు నందిగం అరెస్టు వెనుక చాలా పెద్ద డ్రామానే నడిచిందన్న ప్రచారం జరుగుతోంది.

నందిగం సురేష్‌ను హైదరాబాద్‌కు పరారవుతుండగా, శివార్లలో పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసం నుంచే మంగళగిరికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు వెళ్లే సమయానికి ఇంట్లోనే ఉన్న నందిగం మందు కొడుతున్నారని, అది అయిపోయేంత వరకూ పోలీసులు బయటే ఉన్నారని తెలుస్తోంది.

అసలు నందిగం సమాచారాన్ని వైసీపీలోని సకలశాఖల సలహాదారు బృందమే పోలీసులకు లీక్ చేసిందంటున్నారు. అప్పటివరకూ తన రెండు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న నందిగం, వ్యూహాత్మకంగా ఒక ఫోను ఆన్ చేశారని, దానితో పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి అరెస్టు చేసేలా పకడ్బందీగా వ్యూహరచన చేశారంటున్నారు. అరెస్టును దళితులపై వేధింపులకు వాడుకోవచ్చన్న వ్యూహంతోనే సురేష్ అరెస్టయ్యేలా చూశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగా పోలీసులు నందిగం ఆనుపానులు శోధించి అరెస్టు చేసినట్టయితే, అదే పని మిగిలిన ముద్దాలయిన అప్పిరెడ్డి, అవినాష్, రమేష్ జోగి విషయంలో పాటించి ఎందుకు అరెస్టు చేయలేదని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఆ సాంకేతిక పరిజ్ఞానం వారి విషయంలో ఎందుకు అమలుచేయమేదని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జోగి రమేష్ ఒక్కడే పరాయి రాష్ట్రానికి పరారయ్యారని, మిగిలిన అవినాష్-అప్పిరెడ్డి విజయవాడ, గుంటూరులో సేఫ్ జోన్‌లనే ఉన్నారని టీడీపీ శ్రే ణులు అనుమానిస్తున్నాయి. అవినాష్‌కు విజయవాడ నుంచి గుడివాడ వరకూ సురక్షిత స్ధావరాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇక అప్పిరెడ్డికి గుంటూరులోని టీడీపీ కీలక నేతల మద్దతు ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అప్పిరెడ్డికి గుంటూరులోని కమ్మ సామాజికవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలతో వ్యాపార సంబంధాలున్నాయని గుర్తు చేస్తున్నారు. పైగా అదే సామాజికవర్గానికి చెందిన, ఓ రూరల్ పోలీసు అధికారితో అప్పిరెడ్డికి సత్సంబంధాలున్నాయని చెబుతున్నారు. సదరు అధికారే అప్పిరెడ్డికి ఉప్పందిస్తున్నారని గుంటూరు టీడీపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా గుంటూరు నేతలు టీడీపీ అభ్యర్ధికి మాధవికి సహకరించకుండా, వైసీపీకి పరోక్షంగా సహకరించేలా.. పోలింగ్ రోజు బూత్‌లలో తిరగకుండా, ఇంటికే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో జరిగిన రెండు కీలక పరిణామాలను సద్వినియోగం చేసుకుని.. దళితకార్డుతో ఆ వర్గాన్ని దరిచేర్చుకోవాలన్న వ్యూహంతో, వైసీపీ సోషల్‌మీడియా సైన్యం రంగంలోకి దిగింది. ఒక మహిళతో రాసలీల సాగిస్తున్న వీడియోతో దొరికిపోయిన ఎమ్మెల్యే ఆదిమూలంపై, టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. దానితో పార్టీ ప్రతిష్ఠ పెరిగినట్టయింది. ఆ తర్వాత మాజీ ఎంపి నందిగం సురేష్‌ను, పార్టీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టు చేసింది. ఈయనకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో చట్టప్రకారం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

అయితే అటు ఆదిమూలం, ఇటు నందిగం ఇద్దరూ దళితులే కావడంతో, వైసీపీ సోషల్‌మీడియా రంగంలోకి దిగింది. కూటమి సర్కారు కేవలం దళితులనే వేధిస్తోందన్న ప్రచారానికి పదునుపెడుతోంది. అదే సమయంలో ఈ కేసులో అగ్రకులాలకు చెందిన అప్పిరెడ్డి, అవనాష్‌ను విడిచిపెట్టి దళితులపైనే వేటు వేస్తోందన్న మరో కులప్రచారానికీ తెరలేపింది. ఈ రెండంచల వ్యూహంతో కులకలం రేపాలన్నదే దాని లక్ష్యంగా స్పష్టమవుతోంది.

ఫలితంగా ఈ ప్రభావం అటు టీడీపీ దళితనేతపైనా స్పష్టంగా కనిపిస్తోంది. అగ్రకులానికి చెందిన అవినాష్, అప్పిరెడ్డిని విడిచిపెట్టి దళితుడైన నందిగం సురేష్‌ను అరెస్టు చేయడం, దళిత ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్ష్ వేటు వేయటం తప్పుడు సంకేతాలకు కారణమవుతోందని పొలిట్‌బ్యూరో, మాజీ మంత్రుల స్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్‌మీడియా ప్రచారానికి టీడీపీ దళిత వర్గాలు ప్రభావమయితే ప్రమాదమని అధిష్ఠానానికి సూచిస్తున్నారు.

అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న వారంతా పాత్రధారులేనని, అసలు కీలక సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. ‘సజ్జలది రాక్షస మనస్తత్వమేకాదు. భయంకరమైన నేరపూరిత మనస్తత్వం కూడా. ఆయనే వారిని పిలిచి జగన్‌ను తిడుతుంటే మీరేం చేయరా అని రెచ్చగొట్టి పార్టీ ఆఫీసుపై దాడికి పురికొల్పారు. అలా చేస్తే జగన్ సంతోషిస్తారని వారిని రెచ్చగొట్టారు. కాబట్టి సజ్జలను అరెస్టు చేస్తే తప్ప ఈ కేసు తేలద’ని స్పష్టం చేశారు. నందిగం సురేష్ అరెస్టవడం కూడా సజ్జల వ్యూహంలో భాగమేనని డొక్కా అనుమానం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE