– అధికారంతో బరి తెగిస్తున్న టీడీపీ, జనసేన సైకోలు
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత పోతిన వెంకట మహేష్
తాడేపల్లి: తమకిష్టం లేని పార్టీని, తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా అధికార తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని వైయస్సార్సీపీ నేత పోతిన మహేష్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామని, భారీగా ఖర్చుతో ప్రచారం చేస్తూనే ఇంకోపక్క తమకు నచ్చని వారిని అసభ్యమైన పోస్టులతో దాడి చేసి వేధిస్తున్నాయని చెప్పారు.
తన కూతురిపై పోస్టు పెట్టారని నొచ్చుకున్న పవన్‌కళ్యాణ్, వారిపై కేసులు పెట్టించి జైలుకు పంపే దాకా నిద్రపోలేదు. తాజాగా కుంభమేళాలో ఆ పార్టీ విడుదల చేసిన ఫొటోలపై కూడా మార్ఫింగ్ అంటూ అరెస్టు చేస్తున్నారు. అలాంటిది దేవిక లాంటి చిన్నారని డిప్యూటీ స్పీకర్ నుంచి కింది స్థాయి జనసేన, టీడీపీ కార్యకర్తలు వేధిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే డీజీపీ స్పందించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షలకు చిన్నపిల్లలను, సామాన్యులను బలి చేయడం ఎంత వరకు సబబు అని ఆలోచించుకోవాలి. దేవికారెడ్డి అనే చిన్నారిపై తప్పుడు పోస్టులు పెట్టిన జనసేన, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరుతున్నా. వారిని చట్టపరంగా చర్యలు తీసుకునేలా హోంమంత్రి అనిత ముందుకు రావాలని పోతిన వెంకట మహేష్ కోరారు.