* కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఈ మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ కోచ్‌ల ఉత్పత్తి
* మే 2026 నుంచి కాజీపేటలో ఉత్పత్తి ప్రారంభం
* కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించిన రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్
ఢిల్లీ: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది.
రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్తతరం.. మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ వివరించారు. 16 నుంచి 20 కోచ్‌లు ఉండే మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లను.. తెలంగాణలోని కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU)లో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో.. మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వేమంత్రి స్పష్టం చేశారు.
రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.. నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. మే 2026 నుంచి ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి ప్రారంభం కానుంది.