-జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదన్న పాల్
-దేశాన్ని రక్షించుకోలేకపోతే రాష్ట్రాన్ని కూడా రక్షించుకోలేమని ఆవేదన
-తనను ప్రధానిని చేస్తే దేశాన్ని బాగు చేస్తానని హామీ
-వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ సీఎం అవుతానని ధీమా
మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారి పెను ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘జగన్ పోవాలి-పాల్ రావాలి’ నినాదంతో పాల్ చేపట్టిన యాత్ర నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకుంది. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించుకోకపోతే రాష్ట్రాన్ని కూడా రక్షించుకోలేమని అన్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల కారణంగా మరో ఆరు నెలల్లో ఏపీ శ్రీలంకలా మారడం ఖాయమని జోస్యం చెప్పారు.
జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదన్న పాల్.. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో అవినీతి దారుణంగా పేరుకుపోయిందని, తనను ప్రధానిని చేస్తే దేశానికి మరమ్మతులు చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుతానని పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.