వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు. ఏంటా పిచ్చి ? వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్లండి. మూడు రోజులకు వెళ్లండి. విష్ణుమూర్తి ఏమైనా కోపడ్డతాడా ? ఉత్తరద్వారం నుంచి వెళ్లాలి, తలుపులు బద్దలైపోవాలి. మనసు నిండా మట్టిని పెట్టుకుని దేవుడ్ని ఆ రోజే చూడాలి, అలాగే వెళ్లాలి .. ఏదైనా సరే వెళ్లాలంటే ప్రమాదాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు, పుణ్య తీర్థాలు మాత్రమే కాదు. శరీరాన్ని మంచిన క్షేత్రం లేదు. మనసును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం. నీకు నువ్వే పుణ్య తీర్థం’
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం భక్తులు తోసుకుని ఘోర ప్రమాదానికి గురైన తర్వాత అప్పుడెప్పుడో అవధాని గరికపాటి నరసింహారవు చెప్పిన ఈ ప్రవచనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మాటల్లో ఎంతో దైవత్వం ఉంది. గరికపాటి వారు చెప్పిన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే దేవుడి దగ్గరకు పరుగులు పెట్టాలని..ఓ ప్రత్యేకమైన ముహర్తంలోనే దర్శించుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకోలేరు.
కానీ ఇవాళ భక్తి అనేది ఓ వ్యాపార వస్తువుగా మారిపోయింది.. ఓ మూఢ నమ్మకంగా మార్చేస్తున్నారు. ఫలితంగా ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియదు కొన్ని పద్దతలు పుట్టుకొస్తున్నాయి.. ఆలయాల్లో భక్తులను ముంచెత్తేలా చేస్తున్నాయి. ఫలానా రోజు దర్శించుకుంటే దేవుడు కరుణిస్తాడు.. నలుగుర్ని తొక్కేసి అయినా టిక్కెట్లు పొందేసి వెళ్లి దండం పెట్టుకుంటే ఆ పాపాలు పోతాయి అనుకోవడం దేవుడని కించపర్చడమే.
గత ఏడాది ఏప్రిల్‌లో చిలుకూరు బాలాజీ ఆలయం వద్దకు తండోపతండాలుగా జనం తరలి వచ్చారు.ఎందుకా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. సంతానం లేని వారి కోసం గురుడ ప్రసాద పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు ప్రచారం చేశారు. గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తామని ఆ నైవేద్యాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వితరణ చేస్తామని ఆ ప్రసాదం కోసం ఫలానా రోజు ఆలయానికి రావాలని ఆలయ పూజారి పిలుపునిచ్చారు.
ఆ నోటా ఈ నోటా పడి ఇసుకెస్తే రాలనంత జనం ఆలయానికి వచ్చారు. కేవలం హైదరాబాద్ వాసులే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జంటలు.. వారితో పాటు ఏపీ, కర్ణాటక నుంచి చాలా జంటలు వచ్చాయి. అలా వచ్చిన వారు రెండు లక్షల మంది ఉంటారు. ఇంత మంది వస్తారని ఊహించలేదో ఏమైనా జరిగితే సమస్య వస్తుందేమోనని అలాంటి ప్రసాదం ఏదీ పంపిణీ చేయడం లేదని చెప్పి అందర్నీ వెనక్కి పంపేశారు. ఇక్కడ ఎవరిది తప్పు ?. ప్రసాదంతో సంతానం పుట్టిస్తానని నమ్మించిన చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిదా లేకపోతే ఎంతో చదువుకున్నప్పటికీ.. ఇంకా ప్రసాదాలతో పిల్లలు పుట్టేస్తారని నమ్ముతున్న లక్షల మందిదా?.
ఇదే ఆలయానికి వీసా బాలాజీ అని పేరు పెట్టేశారు. ప్రచారం చేసేశారు. దీంతో ఇతర దేశాల్లో అవకాశాలు దక్కించుకోవాలనుకున్న వాళ్లు ఆలయానికి పెద్ద ఎత్తున వస్తారు. నిజానికి ఇలా ఆలయానికి వచ్చే వారందికీ అమెరికా చాన్సులొస్తాయా?. తమ తమ ప్రయత్నాల్లో సక్సెస్ అయిన వారికే వస్తాయి. ఇలాంటి నమ్మకాల చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తి పేరుతో మూఢ నమ్మకాన్ని పెంచేందుకు.. దాంతో వ్యాపారం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త శక్తులు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్త కొత్త నమ్మకాల్ని పుట్టిస్తున్నారు.
నిజంగా దైవత్వం గురించి చెప్పే విద్వత్ ఉన్న పండితులు.. శాస్త్రాలను ఔపాసన పట్టిన వారు జీవిత సారాలను క్షణ్ణంగా వడపోసి చెబుతున్న వారి మాటల్ని ప్రజలు నమ్మడం లేదు. కష్టాలు తీరుస్తాయనగానే ఓ తాయత్తును కట్టుకోవడానికి రెడీ అయిపోతారు. నిజానికి దైవం అంటే నమ్మకం. మీ వెనుక దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో మీరు ఎలాంటి క్లిష్టమైన ప్రయత్నాలను అయినా నమ్మకంతో చేస్తారు. గెలుపోటముల మధ్య ఉండేది ఈ నమ్మకమే. ఒకే రకమైన టాలెంట్ ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ పడితే ఒకరే గెలుస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి వద్ద ఆత్మవిశ్వాసం.. నమ్మకం ఉంటాయి. అదే దేవుడు. చేస్తున్న పనే దైవం. చేస్తున్న పని మానేసి తనకు పూజలు చేయాలని ఏ దేవుడూ కోరుకోడు.
ఎందుకంటే.. మన దేహం పోషణకు దేవుడు కల్పించేదే పని. ఆ పనిని గౌరవించకుండా.. దేవుడ్ని పూజిస్తానని బయలుదేరడం దేవుడ్ని అవమానించడమే కానీ ఆయనను పూజించినట్లుగా కాదు. ఫలానా రోజు.. ఫలానా ముహుర్తంలో దేవుడ్ని దర్శించుకోవాలన్నది కూడా ఎంతో అమాయకత్వం. ఏకాదశి, ద్వాదశిలకు ప్రత్యేకమైన పురాణాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే భోజనం చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం అని చెబుతారు. అంతే కానీ అదే రోజు వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. కానీ కాలంతో పాటు పుట్టుకొస్తున్న అథ్యాత్మిక వ్యాపారస్తుల కారణంగా ఇలాంటివి పుట్టుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
వైకుంఠ ఏకాదశినాడు ఇలా భక్తులు తిరుమలకు పోటెత్తే సందర్భాలు ఇటీవలే పెరిగాయి. ఓ ఇరవై ఏళ్ల కిందట తిరుమలలో ఈ పరిస్థితి లేదు. అప్పుడు నిజంగా ఈ రోజును నమ్మి వచ్చే భక్తులే ఉండేవారు. కానీ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత , కొత్త కొత్త పండితులు వచ్చి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువుగా ప్రచారం కావడం… ఆ రోజు కచ్చితంగా దర్శనం చేసుకోవాలేమో అన్న ఆలోచనను ప్రేరేపిస్తోంది. దీనికి తోడు దేశంలో ఉన్న ప్రముఖ వీఐపీలంతా దర్శనం కోసం పోటీ పడుతుండటంతో కచ్చితంగా ఆ రోజు దర్శనం చేసుకోవాలేమే అని మనలాంటి వాళ్లంతా అనుకునే పరిస్థితి వచ్చింది.
టీటీడీ కూడా ఈ దిశగా ప్రోత్సాహం ఇస్తూ వచ్చింది.అందుకే ఉత్తరద్వారం కోసం తోపులాటలు జరిగి ప్రాణాలమీదకు వచ్చింది. బుధవారం జరిగిన సంఘటనలో 6మంది ప్రాణాలు పోయాయి. ఇది ఒక్క తిరుమల లేదా తిరుపతి సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. గత ఏడాది జూన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఓ భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోమాత దేవాలయంలో 2022 జనవరి ఫస్ట్ తేదిన జరిగిన దుర్ఘటనలో 12మంది భక్తులు చనిపోయారు. బీహర్‌లోని పాట్నా గాంధీ మైదాన్ 2024 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో తొక్కిసలాటలో 32మంది భక్తులు మృత్యువాత పడ్డారు.
శబరిమల పుల్లమేడు దగ్గ ఘటనలో 104మంది భక్తులు చనిపోయారు. మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లాలోని రతన్ గడ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘనలో 115మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162మంది మృత్యువాతపడ్డారు. 2008లో కూడా రాజస్థాన్‌లోని చాముంఢదేవి ఆలయంలో తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. ఇరవై ఏళ్ల క్రితం మహరాష్ట్రా సతార్ జిల్లాలోని మంధర్ దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 350 మందిపైగా భక్తులు చనిపోయారు.
దశాబ్దాలుగా ఇలాంటి ఘటనలు జురగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకునే ప్రయత్నాలు చేయడం సరి లేదు కదా.. మరింతగా మూర్ఖత్వంలోకి వెళ్లిపోతున్నారు. భక్తులను కరుణించే వాడు భగంవతుడు అయితే ఏరోజైనా.. మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజిస్తే అనుగ్రహిస్తాడు. ఎదుకంటే ఆయన దేవుడు. భగవంతుడు సర్వాంతర్యామి.. ఆయన నివాసం ఉండే ఏ గుడైనా అంతే పవిత్రం.
మరి మన ఊరిలో ఉన్న.. దగ్గరలో ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు ? దేవుడికి ప్రతి భక్తుడూ సమానమే.. ప్రతీరోజూ గొప్పదే. కానీ ఇలాంటి పర్వదినాలకు అవసరమైన దానికంటే ప్రాధాన్యత కల్పించడం టీటీడీ చేస్తున్న తప్పు. నిజంగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ప్రాధాన్యత ఉంటే పదిరోజుల దర్శనాల పేరిట మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ రాజకీయం చొరబడిపోతోంది. ప్రతీ దానికి రాజకీయం చేయడమే. అసలు వైకుంఠ ఏకాదశి ఒక్క రోజు అయితే పది రోజుల పాటు దర్శనాలు చేయడం.. వాటికి తిరుపతిలో కౌంటర్లు పెట్టడం ఏమిటి ?. ఇలాంటి ఘోరాలు చేయడాన్ని ఎలా హైందవపెద్దలు అంగీకరించారో కానీ.. భక్తులు కూడా మూఢ నమ్మకంతో ఇలా వేల మంది వచ్చి రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి.. ప్రాణాల మీదకు తెచ్చుకునేలా..తోసుకోవడం ఎందుకో ఎవరికీ అర్థం కాదు.
దేవుడిపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉండాలి. మన మంచి చేస్తే ప్రోత్సహిస్తాడని.. చెడు చేస్తే శిక్షిస్తాడని భయం పెట్టుకోవాలి. అంతే కాని చేయాల్సినన్ని తప్పు చేసేసి.. ఫలానా రోజు దేవుడని దర్శించుకుని హుండీలో తాను చేసిన పాపంలో కొంత భాగాన్ని సమర్పించుకుంటే పునీతులమైపోతామని అనుకోవడం పొరపాటు. అలాంటి ప్రయత్నాలు ఎంత మహిమాన్వితమైన రోజు చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లిన భక్తులు ఆరుగురు తమ కుటుంబాలకు కాకుండా పోయారు.
ఇలాంటి నష్టం ఆ కుటుంబానికి ఎక్కడైనా జరుగుతుందా ?.తమ మనసును స్వచ్చంగా ఉంచుకుని ఎక్కడ ప్రార్థించినా దేవుడ్ని ప్రార్తించినట్లే. అథ్యాత్మిక వేత్తలు.. పవిత్ర గ్రంధాలు కూడా చెబుతాయి. భక్తులు ఆలయాలకు వెళ్లేది అక్కడి ప్రశాంతత కోసం.. ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి భగవంతుడ్ని స్మరించుకోవడానికే. ఆ సూక్ష్మం మర్చిపోయి..కోరికలు కోరుకవడానికి వెళ్తూంటారు.
అలా దర్శనాలు, పూజలు చేసే వాళ్లను దేవుడు కనిపించే పని అయితే వీఐపీ దర్శనాలు చేసుకునే వాళ్లంతా ఎప్పుడో వారి కోరికల్ని.. దేవుడు ఎప్పుడో తీర్చేసేవాడు. దేవుడు..దైవత్వం గురించి అసలు సూక్మ్మాన్ని అర్థం చేసుకున్న భక్తులు.. ఇలాంటి మూఢ నమ్మకాలకు పోయి ప్రాణాలు త్యాగం చేయరు. ఇప్పటికైనా పెద్దలు చెప్పేది అర్థం చేసుకోండి.. దేవుడ్ని తక్కువ అంచనా వేయకండి!
– రవినాయుడు కుప్పురు