Home » మన కోసం మనం

మన కోసం మనం

– అవినీతి లేదా లంచగొండితనం ఖరీదు ఎంత ?
( పవన్ కుమార్ సిద్ధి)
అవినీతి లేదా లంచం అంటే కేవలం మనకు ఎదో ఒక సర్టిఫికెటు ఇవ్వడానికి తీసుకునే డబ్బో లేదా ఒక కాంట్రాక్టు ఇవ్వడానికి తీసుకునే డబ్బో లేదా ఒక రోడ్డో మరేదో వేస్తే అది సరిగ్గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చి , డబ్బులు విడుదల చేయడానికి తీసుకునే పర్శంటేజ్ మాత్రమే కాదు , అది అంతటితో ఆగదు. దానికి మామూలు జనం అయిన మనం ఎంత మూల్యం చెల్లించాలో తెలుసా ?
సరే ఇది అందరికి బాగా అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెబుతాను.ఒక మునిసిపాలిటీలో దాదాపు ఒక 15 ఏళ్ళ క్రితం ఆ ఏరియా మొత్తానికి ఒక పెద్ద వాటర్ ట్యాంకు నిర్మించి, ఆ మునిసిపాలిటీ లో అందరికి రక్షిత మంచి నీళ్లు నల్లా ద్వారా ఇంటింటికి అందించాలని నిర్ణయించారు. ట్యాంకు బాగా ఎత్తుగా కట్టి కేవలం దానిని గ్రావిటీ ( గురుత్వాకర్షణ ) ప్రెషర్ ద్వారా అందరి ఇళ్లల్లో రెండవ అంతస్తు వరకు నీళ్లు ఎక్కేలా ప్రణాళిక రచించారు. దానిని కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి గొప్పగా ప్రచారం చేసి దాదాపు 5 కోట్ల ఖర్చు తో ఆమోదించారు.
అది టెండరు జరిగి అధికారుల అలసత్వం తో, ఒక సంవత్సరం దాకా లాగి దానిని ఆమోదించేసరికి ఆ మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపు 6 % పెరిగింది , సరే అలా ఆ ఆరుశాతం కూడా ఆమోదించారు ( అంటే వారి అలసత్వానికి మనం ఒక 6 % అప్పుడే ఎక్కువ చెల్లించాము ) సరే ఈ ఖర్చు మొత్తం , అందరు కట్టే టాక్సులలో నుండే కదా నా ఒక్కడిదే కాదు కదా అని సర్దుకున్నాము.
ఆ పని దక్కించుకున్న కుర్ర సివిల్ ఇంజనీర్, బాగా పనిచేసి మంచి కాంట్రాక్టర్ గా పేరు తెచ్చుకుని పెద్ద సంస్థగా ఎదుగుదామని ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు. అదే అతడికి మొదటి కాంట్రాక్టు కావడం తో శ్రద్ధ గా పని మొదలెట్టాడు.
పని మొదలవగానే ఆ కాంట్రాక్టర్ దగ్గరకు కౌన్సిలర్ గారి మనుషులు వాలిపోయారు అతడి దగ్గర , మా ఏరియాలో పని అవుతుంది కాబట్టి , మాకు మా కట్ ఇవ్వాల్సిందే , లేకపోతే ఎదో ఒక గొడవ పెట్టి పని జరగ కుండా చేస్తాం , జనాలని పోగేసి నీ క్వాలిటీ బాగా లేదని ధర్నాలు చేసి, నీ పరువు తీస్తాం. అది జరగకుండా ఉండాలంటే మాకు 10 % ఇవ్వాలి అని వసూలు చేసుకుని వెళ్లారు.
వాళ్ళు వెళ్ళగానే ఎమ్మెల్లే మనుషులు వచ్చారు, వారు కూడా అలాగే బెదిరించి ఇంకో పది శాతం పట్టుకెళ్లారు. ఆ తరువాత మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేసే ఇన్స్పెక్టర్ , బిల్లు పాస్ చేసే అకౌంట్ సెక్షన్ ఆఫీసరు ఇలా అందరూ వారి వారి వాటాలు వేసేసరికి, మొత్తం 30 % కి చేరింది. పాపం నిజాయితీగా పని చేద్దామనుకున్న ఆ కాంట్రాక్టర్ కి, తక్కువ క్వాలిటీ పని చేయడం తప్పలేదు. ఇంకేం అందరూ తినేస్తుంటే నేనొక్కడినేనా నిజాయితీ గా ఉండేది అంటూ.. తనుకూడా తక్కువ క్వాలిటీ పైపులు వాడడం మొదలెట్టాడు. ఎలాగూ అందరి చేతులూ తడిసాయి కాబట్టి అన్ని బిల్లులు శాంక్షన్ అయ్యాయి. ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు అందాయి.
ఇక ఆ ప్రాజెక్ట్ ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన పత్రికలవాళ్ళు కూడా, ఈ ప్రాజెక్టు గురించి బాగా రాయడానికి మందు పార్టీ తో సహా వాళ్లకు కావలసింది వాళ్ళుకూడా దండుకున్నారు.
అసలు కథ ఇప్పుడు మొదలయింది.ట్యాంకులో నుండి నీళ్లు వదలగానే మొదటి వారం లోనే, ఆ ప్రెషర్ కి ఆ నాసిరకమైన పైపులు పగలడం మొదలెట్టాయి, దాంతో బెంబేలెత్తిన అధికారులు, వదిలే నీటి ప్రెషర్ తగ్గించమని ఆదేశించారు. రెండు అంతస్తుల పైదాకా నీళ్లు చేరాలి అనే ఉద్యేశం తో మొదలెట్టిన ఆ ప్రాజెక్టు , అంత ఖర్చు పెట్టినా చివరకు గ్రౌండ్ లెవెల్ దాకా కూడా నీళ్లు పంప్ చేయలేకపోయింది.
దానితో జనాలు గుంతలు తోడి ఆ నల్లా ని, ఐదు ఆరు ఫీట్ల కిందకు పెట్టడం మొదలెట్టారు , ఆ నీళ్లు పట్టడానికి కింద ఒక సంపు కట్టాల్సి వచ్చింది. దానికి ప్రతి ఇంట్లో దాదాపు ఐదు వేల లీటర్ల సంపు దాదాపు 20 వేల ఖర్చుతో కట్టుకోవలసి వచ్చింది.
ఇది ఆ అవినీతికి జనాలు పర్సనల్ గా పెట్టుకున్న మొదటి ఖర్చు .ఆ సంపు లో పడ్డ నీటిని పైన వున్న ట్యాంకులోకి పంపడానికి , ఒక 1 hp మోటారు దానికి కావలసిన పైపులు వగైరా అన్నీ కలిపి ఇంకో 10 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది .
ఇది ఆ అవినీతికి పెట్టిన రెండవ ఖర్చు.అందరూ నల్లాలు కిందకు చేసుకుని.. సంపులు కట్టడం తో ఎవరికీ సరిగ్గా నీళ్లు రాక , మళ్ళీ ఆ నల్లలకు డైరెక్ట్ గా మోటార్ పెట్టి నీళ్లు లాగడానికి , ఇంకో ఐదువేలతో మోటారు దానికి పైపులు కరెంటు ఖర్చు.ఇది మూడవ ఖర్చు.
ఇలా జనాలు కట్టిన ఆ సంపులు సరిగ్గా మైంటైన్ చేయక లేదా కొందరు కేవలం మట్టి తో కూడా కట్టినవాటిలో నీళ్లు నిండి , నీళ్ల సప్ప్లై ఆగినప్పుడు ఈ మట్టి సంపులలో వున్న నీరు కూడా , రివర్స్ గా నీళ్ల పైపుల్లోకి చేరి ఆ మట్టి నీళ్లు జనాల పైపుల్లో వస్తున్నాయని దానికి వాటర్ ఫిల్టర్లు కెంట్లు పెట్టుకుని వచ్చే ఆ మంచి నీళ్లను మళ్ళీ మంచినీళ్ళుగా మార్చడానికి పెట్టె ఖర్చు.
ఇది కాకుండా ఆ నీళ్లు కలుషితమైతే, ఆ నీళ్లు తాగి హాస్పిటళ్ళకు కట్టే బిల్లులు అందుకు పని మానేసి ఇంట్లో కూర్చుంటే వచ్చే నష్టం ఇవన్నీ బోనస్.
అంటే కేవలం ఒక చిన్నప్రాజెక్టు లో, కొందరు చేసిన చిన్న స్థాయి అవినీతి అనే పిల్ల దయ్యం , ఇలా ఒక్కో స్టేజీలో తన ప్రతాపం చూపుతూ, చివరకు ప్రజల తో కొన్ని వందల రెట్లు ఖర్చు చేయించేలా బ్రహ్మ రాక్షసి అవతారం ఎత్తింది.
ఇదంతా దాదాపు మనందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కానీ మనం ఇది ఎవరో చేసిన ఆ అవినీతి వల్ల మనము పెట్టాల్సిన అనవసర ఖర్చు అనే విషయం కూడా ఆలోచించకుండా, ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి ఉంటాము.
అంటే ఎవరో చేసిన అవినీతికి, మనం కష్టపడి సంపాదించి టాక్సులు కూడా కట్టగా.. మిగిలిన అచ్చంగా మన సొంత డబ్బు కొన్ని వేలు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాల్సివచ్చింది. ఈ డబ్బులతో ఒకరి ఇంట్లో పిల్లలకు మంచి చదువుకోసం ఖర్చు పెట్టుకోగలిగేవారేమో , లేక వారు మంచి వాహనం లేదా ఇంట్లో సౌకర్యాలు సమకూర్చుకోగలిగేవారేమో. అంటే మన సౌకర్యాలన్నీ దొబ్బేసి మనలను పేదరికంలోనే మగ్గేలా చేసింది ఈ అవినీతి.
ఒక చిన్న ప్రాజెక్టు లో కొందరు చేసే చిన్న చిన్న అవినీతి కే, ఇంతగా మన మీద ప్రభావం ఉంటే .. ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతి కి మనం ఎంతగా డబ్బులు కడుతున్నామో, వీటి వలన ఎంతమంది పేదరికంలోనుండి బయటపడలేకపోతున్నారో.
ఇదండీ.. ఈ అవినీతి భూతం మనమీద చేయించే ప్రభావం. ఆలోచించండి మరి మనము ఏమి చేయాలో. భరించాలా లేక తిరగబడాలా. ఒకవేళ తిరగబడాలంటే ఎవరిమీద ఎలా తిరగబడాలి.
దీనికి పరిష్కారం లేదా, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉన్నది. ఎవరు మారాలి..ఎలా మారాలి..వ్యక్తిగా మీరు ఏంచేయాలి.., మీరు మారడానికి సిద్ధమేనా?. ప్రగతి కోరుకుంటున్నారా..ఐతే ఖర్చు లేని, కష్టం లేని ,ఇబ్బందిలేని విధానం లో కి నేటి నుండి మారుదామా..నేను రెడీ..మరి మీరు రేడినా…,(,నాణ్యత లోపల పనులపై ఫిర్యాదులు చెయ్యండి.)
ఈ దేశానికి “”యజమని””గా ఉంటావా…కూలీగా, బానిసగా జీవిస్తవా, భవిష్యత్తు లో మీ పిల్లల ప్రగతికి దారులు వేస్తావా..అంధకారంలో కి, అప్పుల్లోకి నెట్టు తవా..
ఓటర్ గా ప్రలోభాలకు, డబ్బు, మద్యానికి లొంగకుండా మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకో…., ఒక్క మంచి నిర్ణయం నీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది…
సేకరణ. ..మురికిపూడి ప్రసాద్ అధ్యక్షుడు వినియోగదారుల సంఘం
ప్రధాన కార్యదర్శి లోక్సత్తా. చిలకలూరిపేట..9701741748

Leave a Reply