నేను పోయాక?

నేను చనిపోయాక నువ్వు నా కోసం కన్నీరు పెడతావేమో..
కానీ అది నాకు తెలియదుగా
అంతకంటే ఇప్పుడే నాతో పాటు కాసేపు ఏడవొచ్చుగా..!

పూలు కూడా పంపుతావేమో
వాటిని నేను చూడలేను
ఇప్పుడే పంపు నేస్తం..!

నా గురించి కొన్ని మంచి మాటలు చెప్తావు
కాని నేను వినలేను..
అదేదో ఇప్పుడే పొగడొచ్చుగా..!

నా తప్పులను మర్చిపోతావేమో..
అదీ నాకు ఎరుకవ్వదు..
ఇప్పుడే మర్చిపోతే
నాకెంత ఊరట..!

నన్ను మిస్ అవుతున్నట్టు అప్పుడు బాధ పడినా
నాకు తెలియదు..
ఇప్పుడే మిస్ అవుతుంటే
నాకూ తెలుస్తుంది కదా!

అయ్యో..నాతో ఇంకాస్త సమయం నాతో గడిపి ఉంటే ఎంత బాగున్నో అనుకునే కంటే
ఇప్పుడే కాసేపు
నాతో ఉండొచ్చుగా..!

నా మరణవార్త వినగానే
విచారం వెలిబుచ్చడానికి
మా ఇంటికి ప్రయాణమవుతావు..
కాని మనం కలిసి మాటాడుకుని చాలాకాలం అయింది మిత్రమా..
ఇప్పుడే వచ్చి చూస్తే
నాకెంత సంబరం..!

నీ చుట్టూ ఉండే వారు,నువ్వెరిగిన మనుషులు..
కుటుంబసభ్యులు, పరిచస్థులతో
కాసేపు గడిపి..వారి సంతోషం కోసం చేయగలిగినది చెయ్యి..
వారు నీకు ప్రత్యేకం అనే ఆనందం కానుకగా ఇవ్వు..
ఎందుకంటే నీ నుంచి వారు ఎప్పుడు దూరం అయిపోతారో
ఏమెరుక..!?

మనిషిగా నేను చెప్పగలను
అదే నలుగురితో కలిస్తే మాటాడగలుగుతాను..
ఒంటరిగా కాలం వెళ్ళబుచ్చుతానేమో..
పది మంది కలిస్తే
పండగ చేసుకుంటాను..
ఇప్పుడు చిరునగవు..
నలుగురితో కలిస్తే
ఆనందాల పకపకలు..

మానవ సంబంధాలలో
అదోలాంటి నిండైన సంబరం..
ఒకరికొకరం కాకపోతే
ఎవ్వరం లేము..
అందుకే..అందుకే..
కలసి ఉంటేనే కలదు సుఖం..

(ఇది విశ్వకవి రవీంద్రుని రచన కాదు..ఇది రవీంద్రుని శైలి కానే కాదు..సింగపూర్ కల్చరల్ మెడల్ విజేత లీ జూ పెంగ్ అద్భుత రచన..దీనికి నేను కొంతకాలం క్రితం చేసిన స్వేచ్ఛానువాదం)

– ఇ.సురేష్ కుమార్
9948546286