మనిషికి తాపత్రయం ఎందుకు? ఎవరి కోసం?

ప్రతి రోజూ లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయపడుతుంటాడు. అసలు తాపత్రయం అంటే ఏమిటి? ఎందుకు అతనలా తాపత్రయపడుతుంటాడు?
మనిషి తాపత్రయాలకు అంతు ఉండదు. ఆ తాపత్రయంతోనే జీవితంలో పరుగులు పెడుతుంటారు.

ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలనే తాపత్రయం ఎందుకు?.. నా తాపత్రయం అంతా వాడి గురించే… లాంటి మాటల్ని మనం వింటుంటాం.

అసలు తాపత్రయం అంటే ఏమిటో తెలుసుకుందాం.

హిందూ ధర్మం ప్రకారం మనిషికి కలిగే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు రకాలు.

అవి భౌతికమైనవి, దైవికమైనవి, అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి .
భౌతిక ప్రపంచంలో ఉండే క్రూర జంతువులు, సాటి మనుషులు, ప్రకృతి వైపరీత్యాలు.. అంటే భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తదితరమైన వాటిని భౌతికిమనవిగా చెబుతారు.
దైవికమైన వాటికి వస్తే మనకు మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు. అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమిస్తుంటాయి.

ఆధ్యాత్మికమైన కష్టాల గురించి చెప్పాల్సి వస్తే తన గురించి లేదా ఇతరుల గురించి బాధ పడడం, శరీరం, బుధ్ది అదుపులో లేక పోవడం, వ్యాధి, శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతమవడం మొదలైనవి.

తాపత్రయం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో చూద్దాం. తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు.. మూడు రకాల కష్టాలని అనుకోవాలి.

ఈ తాపాలు ఆధ్యాత్మిక తాపం,ఆధిభౌతిక తాపం, ఆధిదైవిక తాపం అని మూడు రకాలుగా విభజించారు పెద్దలు. సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయడం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా భావిస్తారు. ఆధ్యాత్మిక తాపం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ నశించనిది, శరీరం నశించేది. ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభూతంగా శరీరం అనుభవిస్తుంది.

మనసుకు సంబంధించింది పురుషార్ధసాధన. ఇందులో మూడో పురుషార్ధమే కామం. కామమంటే కోరిక, లేదా ఇంకేదైనా కావచ్చు. స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశత్రువులుగానూ చెబుతుంటారు. ఇవి బయటికి కనిపించవుగానీ చాలా కష్టాన్నే కలగచేస్తాయి. ఏదో ఒక కోరిక లేనివారు ఉండరు. నాకే కోరికా లేదన్నవారినెవరినీ నమ్మకూడదు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. శరీరానికి సంబంధించిన కోరికలు ఆరు.

అవి ఆకలి, దప్పిక, జర, రుజ, శోకం, మోహం. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం.‘గోచీ కంటే దరిద్రం, ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర అంటే ముసలితనం, రుజ అంటే వ్యాధి బారినపడటం.. ఇవి రెండూ తప్పించుకోలేనివి. ఈ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం, మోహం నుంచి తప్పించుకోవాలని తంటాలైతే పడతాం కాని సాధ్యం కాదు. ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి ఈ కోరికలు. ఇవే అధ్యాత్మిక తాపాలు .

అధిభౌతిక తాపం గురించి తెలుసుకుందాం. ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, ప్రాణం కానివీ ఉన్నాయి, ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువుల వలన, మనుషుల వలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు.

ఉదాహరణకి నల్లులు, దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం లాంటివి. వీటికంటే చాలా ముఖ్యం సాటి మనిషి నుంచి కలిగే కష్టం కూడా. ఇతరజీవులను హింసించడం, వధించడం ఆధిభౌతికతాపమే.
భగవంతుడు కలగచేసే కష్టాలను అధిదైవిక తాపాలన్నారు. భగవంతుడు చేశాడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ముపోసుకుని అధిదైవిక తాపాలంటున్నాడనడం బాగుంటుందేమో.

పంచభూతాలెప్పుడూ వాటివాటి హద్దులు దాటవు. కాని వాటి సమతుల్యతను మానవుడు చెడగొట్టినపుడు విజృంభిస్తాయి. అప్పుడు మానవుడు బలహీనుడే. హంసమంత్రం సర్వకాల సర్వావస్థలలో తిరుగుతుండవలసిందే. హంసమంత్రం అంటే గాలి పీల్చేటపుడు కలిగే శబ్దమే హం, గాలి వదిలేటపుడు కలిగే శబ్దం స, ఈ రెండూ కలిస్తే జీవితం, లేకుంటే మరణం.

చూశారు కదా తాపత్రయాలు ఎన్ని విధాలుగా ఉంటాయో. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలలో చిక్కుకుని మనిషి మనుగడ సాగిస్తుంటాడు. ఇలాంటి తాపత్రయాలతో కుంగిపోకుండా స్థిత ప్రఘ్నతతో ప్రతి మనిషీ జీవించాలి.

– సతీష్‌కుమార్

 

Leave a Reply