Suryaa.co.in

Telangana

8 జిల్లాల్లో మావోయిస్టుల ముప్పు

– 614 పోలింగ్‌ కేంద్రాలకు పటిష్ట భద్రత

ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. జరగబోయేది మరో ఎత్తు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. ఓట్ల కోసం అల్లర్లు, ప్రలోభాలు, మద్యం, డబ్బు రవాణా జరిగే అవకాశం ఉండటంతో గట్టి నిఘా పెట్టారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా 100 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. వీరితో పాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల నిర్వాహణకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చే వాహనాలు, కొత్త వ్యక్తుల్ని తనిఖీలు చేసేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీస్‌ బూత్‌ల దగ్గర గట్టి బందోబస్తు పెట్టారు.

ఈ క్రమంలోనే తెలంగాణలోని ఎనిమిది మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 614 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరిస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల కమిషన్.

ముఖ్యంగా మావోయిస్ట్ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, రామగుండం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 614 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించింది ఎన్నికల సంఘం.

వీటిలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో కొందరు రాజకీయ నేతలకు మావోయిస్టులు వార్నింగ్ లెటర్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ ప్రాంతాల్లో, పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక బలగాలను మోహరిస్తారు. సమీప ప్రాంతాలలో ఏరియా ఆధిపత్యం కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ప్రత్యేక పార్టీ కేటాయించడం జరిగింది. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లిలో మావోయిస్టుల హింసాకాండకు గురయ్యే పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా ఉన్నాయి. మావోయిస్ట్ కార్యకలాపాలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు జిల్లాలలో కేంద్రీకృతమై ఉన్నాయని ఒక పోలీస్ అధికారి తెలిపారు.

మరోవైపు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే 100 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు తెలంగాణకు వచ్చాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశాస్త్ర సీమా బల్‌లకు చెందిన దాదాపు 7,500 మంది సాయుధ సిబ్బంది మోహరింపుకు సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు అవసరాన్ని బట్టి సాయుధ బలగాలు పంపిణీ చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు మరిన్ని కేంద్ర బలగాలను రప్పిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు తదనుగుణంగా సమన్వయం చేసుకుంటారన్నారు.

LEAVE A RESPONSE