Home » మార్గళికి ఆహ్వానం

మార్గళికి ఆహ్వానం

చూస్తూండగానే అయిపోయింది కార్తీకం.‌మార్గశీర్షం తెరమీదకు వస్తోంది.‌ అభిషేకాలు అయ్యాయి. తిరుప్పావై మొదలవుతుంది.చలి ముదిరే సమయంలో ప్రత్యూషానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి పాశుర పఠనాలు ఈ మార్గళి లోనే మొదలవుతాయి.
మనం పాశురాలు చదివేది డిసెంబరు 16నుంచి. ఇంకా చెప్పాలంటే మార్గశిర బహుళ పంచమి నుంచి. అంటే పాశురాలు చదివేది మార్గశిర మాసం ప్రారంభం అయిన రోజునుంచి కాదు. మన మార్గశిర మాసంలో బహుళ పంచమి నుంచి. కానీ గోదాదేవి మార్గళిత్తింగళ్ మదినిరైన్ద నన్నాళాల్ అంటు చెప్పిన మార్గళికి మన మార్గశిర మాసానికి తేడా ఉందా? అనే అనుమానం కలగొచ్చు. రెండింటికీ తేడా ఉంది.
మనం చాంద్రమానం ప్రకారం నెలలు లెక్కిస్తాం. పూర్ణ చంద్రుడు ఏ మాసంలో అయితే చిత్ర నక్షత్రంలో ఉంటాడో దాన్ని చైత్రం అని, విశాఖ లో ఉంటే వైశాఖం అని జ్యేష్ట లో ఉంటే జ్యేష్ట మాసము అని, పూర్వ/ఉత్తరా షాఢలలో ఆషాఢం శ్రవణం-శ్రావణం, పూర్వ-ఉత్తరాభాద్రలలో భాద్రపదం, అశ్విని-ఆశ్వయుజం, కృత్తిక- కార్తీకం, మృగశిర-మార్ఖశిరం, పుష్యమి- పుష్యం, మఘ- మాఘం, పూర్వ-ఉత్తర ఫల్గుణి ఫాల్గుణ మాసాలు వస్తాయి. చాంద్రమానం ప్రకారం ఒక మాసం నిడివి ఇంచుమించు 29.53 రోజులు. అంటే సంవత్సరానికి 354.36 రోజులు.
కానీ సంవత్సరానికి మనకు 365/366 రోజులుంటాయి. అందుకే చాంద్రమానం మన సౌరమానంతో నెలల లెక్కింపు చేసేటపుడు కొంత వ్యత్యాసం గా ఉంటుంది. కనుక చాంద్రమానం లో మనకు ప్రారంభం అయ్యే మార్గశిర మాసం సౌరమానంలో వచ్చే మార్గళి కన్నా భిన్నంగా ఉంటుంది. రవి ధనూరాశిలో ప్రారంభం అయ్యే మాసమే మార్గళి లేదా ధనుర్మాసం. అది డిసెంబర్ 16న రాత్రి 11.47 ని!! ప్రారంభం అవుతుంది. తమిళ సాంప్రదాయంలో లెక్కించే ఈ మాసాన్నే మార్గళి అంటాం. అందుకే గోదాతల్లి మార్గళిత్తింగళ్ అని తొలి పాశురంలో అన్నారు.
తమిళ నెలలు చిత్రి, వైయ్యాసి, ఆసి, ఆడి, ఆవణి, పెరటాశి, అల్పిసి, కార్తీకి, మార్గళి, తై, మాశి, పంగుణి అనే పేర్లతో ఉంటాయ్. ఇవి మన ఆంగ్ల మానానికి సమానంగా ఉంటాయ్. అందుకే సౌరమానం లో లెక్కించే పండుగలు ఆంగ్లమానంలో నిర్దిష్టమైన తేదీల్లో వస్తాయ్. ఇది జనవరి 14 వ తేదీ వరకూ ఉంటుంది. అటుపైన మకర సంక్రమణం అంటే సంక్రాంతి. ఇది ప్రతీ సంవత్సరం ఖచ్చితంగా జనవరి 15 నిలుస్తుంది. లీపు సంవత్సరం ఒక రోజు తేడాలో వస్తుంది. ఆ లెక్కకూడా మనకు సౌరమానం లో ఉంది.
డిసెంబరు చలిలో ఉదయాన్నే లేచి స్నానాలు, పూజలు చేయటం అంటే భలే కష్టం. వెచ్చని దుప్పట్లో ముసుగు తన్ని పడుకుంటే హాయిగా ఉండే సమయం అది. కానీ మనం అలా చేయం. గొబ్బెమ్మలు పెట్టే పిల్లలు, పాశుర పఠనం చేసే పెద్దలు, నారాయణ కీర్తన చేసే హరిదాసులు, నగర సంకీర్తన చేసే భక్తులు, ఉదయ పూజలు చేసే అయ్యప్ప స్వాములతో వీధులు కలకల లాడుతూ ఉంటాయ్.
చలిని తట్టుకునే శక్తి ఉపవాసానికి ఉంటుంది. అందుకే చలి ప్రారంభం అయ్యే ఈ రోజుల్లో ఉపవాస దీక్ష చేసి చన్నీళ్లతో స్నానం చే‌సినా ఆరోగ్యంగా ఉండే గలిగే శక్తి పొందుతారు.కడుపులో తిండి పడితే చలి ప్రారంభం అవుతుంది. అదే ఉపవాసం చేసి చూడండి, చలి దగ్గరకే రాదు. దీనివల్ల శరీరం చాలా వరకూ శ్వాస సంబంధమైన రోగాలనుంచి తనను తాను రక్షించుకుంటుంది. శ్వాసకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మన మతం లో ప్రాణాయామానికి ఉన్న విశిష్టత ఏవిటో మనకు తెలుసు. మితాహారం, ఉపవాసం, చలి ఎక్కవైన రోజుల్లో ఆరోగ్యానికి మంచిది.
అలా అని లంఖణం చేయకూడదు. అందుకే తిరుప్పావై పఠించే రోజుల్లో సూర్యోదయానికి ముందు భగవంతునికి నివేదించే ప్రసాదం తిని, రాత్రవేళ పూజానంతరం తిరిగి భోజనం చేస్తారు. ఉపవాసం అంటే లంఖణం కాదు. ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అని అర్థం. భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం. లంఖణం చేయటం కాదు. ఇది తెలియక చాలామంది కటిక లంఖణాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.అరుగుదల మందగించి, శ్వాస సంబంధిత వ్యాధులు పెరిగేవెళ, భగవన్నామ సంకీర్తన తో మనసు, శరీరం స్వస్థత పరుచుకునే పవిత్ర మాసాలివి.
అందుకే కార్తీకం కాగానే దినచర్య మార్చకుండా,మార్గశీర్ష మాసంలో కొనసాగించాలి. ఉల్లి తింటే ఎక్కువ ప్రాణవాయువు అరగడానికి ఖర్చు అవుతుందని ఉల్లి ఈ మాసంలో తినరు. అదే ఉల్లి ఎండలు ముదిరితే వడదెబ్బ నుంచి కాపాడుతుంది. కనుక ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఉండెందుకే మనకు ఈ ఆచారాలు. వీటివల్ల మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. మన మతం ఓ చక్కటి జీవన విధానం. దాన్ని పాటించడం వల్ల మంచే జరుగుతుంది.
మార్గశిర మాసంలో, తిరుప్పావై వింటూ, దీక్ష సాగించండి. కూడారై పాశురం పఠించే వేళ రుచికరమైన చక్రపొంగలి తినటం మానద్దు.ఆ రోజు చేసే చక్రపొంగలి మరేరోజూ మనకు లభ్యం కాదు. అది గోదాతల్లి చెప్పిన విధంగా చేసి ఆ రోజు కన్నయ్యకు నైవేద్యం పెడతారు. అందుకే అంత స్పెషల్.
నారాయణ కటాక్ష సిద్ధిరస్తు.

Leave a Reply