45 రోజుల్లో 52 లక్షల కుటుంబాలతో భేటీ

-ప్రజలకు ప్రశ్నాపత్న్రం
-ప్రతి ఇంటికి టీడీపీ కిట్
-‘ఇదేం ఖర్మ – రాష్ట్రానికి’.. తెదేపా కార్యాచరణ
-డిసెంబర్‌ ఒకటి నుంచి

వైకాపా నేతల దాడులు, అడ్డగింతలపై ఎదురుదాడినే లక్ష్యంగా చేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది.వైకాపా అరాచకాలకు ప్రతిఘటనే సరైన విధానమని… పార్టీ విస్తృస్థాయి భేటీలో నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్‌ ఒకటి నుంచి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాలని.. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను నమోదు చేయాలని నిర్ణయించింది.అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపుతామని.. పార్టీ వెల్లడించింది.

బాదుడే బాదుడే కార్యక్రమంతో.. ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ.. మరో సరికొత్త కార్యక్రమానికి సిద్ధమైంది. వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రభుత్వ అరాచకాలను వారికి వివరించి.. అవగాహన కల్పించేందుకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది.
డిసెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభించనున్న దీనిని.. 45 రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 52 లక్షల కుటుంబాల్ని, రెండు కోట్ల మంది ప్రజల్ని కలవాలని.. కార్యక్రమ ప్రారంభం సందర్భంగా అధినేత చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.

ప్రతి గ్రామంలోనూ పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బాధ్యులు రచ్చబండలు నిర్వహించాలని.. బృందాలు ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధం చేసిన కిట్లను అందజేయాలని సూచించారు. ఓ ప్రశ్నాపత్రాన్ని ప్రజలతో నింపించి.. వాటిని కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు. అలా అందరూ పంపించిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రపతికి, గవర్నర్‌కు పంపుతామని.. తద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అదే సమయంలో తన పర్యటనకు ప్రజాదరణ అపూర్వంగా వస్తోందన్న చంద్రబాబు.. అది చూసి ఓర్వలేకనే తనపై ఇష్టారీతిన మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపాను దించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

2024 ఎన్నికల తర్వాత వైకాపానే ఉండకూడదన్నారు.రాష్ట్రాన్ని వైకాపా చెర నుంచి విముక్తి కల్పించాలన్న ఇతర నేతలు.. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు సవాల్‌ను.. నెరవేర్చే విధంగా పనిచేయాలని.. టీడీపీ నాయకులు నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు పునరుద్ఘాటించారు. ఇకపై తమ రాజకీయం.. ఢీ అంటే ఢీ అనే తరహాలోనే ఉంటుందని తెలుగుదేశం వర్గాలు ఈ సమావేశం ద్వారా తేల్చి చెప్పాయి.

Leave a Reply